Thursday, January 23, 2025

వేటగాళ్ల ‘ఆకలి’ చావు..

- Advertisement -
- Advertisement -

పోర్ట్ బ్లెయిర్ : అండమాన్, నికోబార్ దీవులలో మారుమూల నార్కొండం దీవిలో ఆరుగురు అనుమానిత మయన్మార్ వేటగాళ్ల మృతదేహాలు కనిపించాయని అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. ఆ వేటగాళ్లు రేషన్ నిండుకున్న తరువాత చిన్న అగ్నిపర్వత దీవిలో ఆకలితో, నీటి లోపంతో చనిపోయినట్లుగా అనుమానిస్తున్నామని అధికారి తెలిపారు. దీవిని చేరడానికి వారు ఉపయోగించిన చిన్న పడవలో ఏదో లోపం తలెత్తింది. ఫలితంగా వారు తిరిగి వెళ్లలేకపోయారు. చిన్న నార్కొండం దీవిలోని ఒక అడవిలో సముద్ర తీరం నుంచి కొన్ని మీటర్ల దూరంలో వారి మృతదేహాలు శనివారం కనిపించాయి. భారత్‌కు బాగా తూర్పు దిశగా, ఉత్తర, మధ్య అండమాన్ జిల్లాలో నార్కొండం మయన్మార్ కోకో దీవికి కేవలం 126 కిలో మీటర్ల దూరంలో ఉన్నది.

నార్కొండం దీవి స్తబ్ధుగా ఉన్న అగ్నిపర్వతం అని భారత భౌగోళిక సర్వే సంస్థ (జిఎస్‌ఐ) వర్గీకరించింది. సుమారు 7.6 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలోని దీవి మయన్మార్ వేటగాళ్లకు ఆలవాలంగా ఉన్నది. అండమాన్ పోలీసులు ఈ నెల 14న గాలింపు కార్యక్రమంలో నార్కొండం దీవిలో నుంచి ఇద్దరు మయన్మార్ వేటగాళ్లను పట్టుకున్నారు. వారిని పోర్ట్ బ్లెయిర్‌కు తీసుకువచ్చి, సిఐడికి అప్పగించినట్లు అధికారి తెలిపారు. ఆ ఇద్దరిని ప్రశ్నించినప్పుడు తమ దేశం నుంచి వచ్చిన మరి ఆరుగురు వేటగాళ్లు నార్కొండం అడవిలో దాక్కున్నట్లు వారు వెల్లడించారు. దీనితో అండమాన్ పోలీసుల అన్వేషణ బృందం రంగంలోకి దిగారని, పోలీసులకు ఆరుగురు వేటగాళ్ల మృతదేహాలు కనిపించాయని అధికారి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News