Tuesday, February 11, 2025

దోషులను కఠినంగా శిక్షిస్తాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/సిటీబ్యూరో: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రంగరాజన్‌ను ఫోన్‌లో పరామర్శించారు. దాడి వివరాలను ఆయన స్వయంగా అ డిగి తెలుసుకున్నారు.ఇలాంటి దాడులను సహించేది లేదని సిఎం స్పష్టం చేశా రు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు.

ఆరుగురి అరెస్టు
చిలుకూరు బాలా జీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి,ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించా రు. దాడి చేసిన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా, మిగతా ఐదుగురిని సోమవారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన నిందితుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులు ఉన్నారు. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజ్ వద్దకు వెళ్లాడు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యులను చేర్పించాలని రంగరాజన్‌ను డిమాండ్ చేశారు.

అందుకు ఆయన నిరాకరించడంతో ఆయనపై దాడి చేశారు. ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, కొప్పవరానికి చెందిన వీర రాఘవరెడ్డి 2022లో రామరాజ్యంను స్థాపించాడు. స్థానికంగా మణికొండలో ఉంటున్నాడు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడు. రామరాజ్యంలో చేరితే రూ.20వేలు జీతం ఇస్తానని చెప్పాడు. తణుకు, కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి పర్యటించాడు. రామరాజ్యంలో చేరిన వారిని యూనిఫామ్ కుట్టించుకోమన్నాడు. ఈ నెల 6న అందరూ యాప్రాల్‌లో కలిశారు. రామరాజ్యం బ్యానర్తో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటితో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ నెల 7న మూడు వాహనాల్లో వీరరాఘవరెడ్డి అనుచరులు 25మంది నల్ల దుస్తుల్లో చిలుకూరు వచ్చి రంగరాజన్‌పై దాడి చేశాడు. తర్వాత రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News