Tuesday, December 24, 2024

బ్రిక్స్ మరింత శక్తివంతం.. కొత్తగా మరో ఆరుదేశాలు

- Advertisement -
- Advertisement -

జొహన్సెన్‌బర్గ్ : ఐదుదేశాల సభ్య కూటమి బ్రిక్స్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. దక్షిణాఫ్రికా ఆతిధ్యంలో ఇప్పుడు జరుగుతోన్న బ్రిక్స్ సదస్సు దశలో గురువారం కూటమిలోకి మరో ఆరుదేశాలను తీసుకుని , విస్తరింపచేసుకోవాలని నిర్ణయించారు. అర్జెంటినా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను బ్రిక్స్‌లోకి తీసుకోవాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. దీనితో ఇక బ్రిక్స్ 11 దేశాల సభ్యత్వ వేదిక అవుతుంది. ఈ ఆరుదేశాలకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలని సంకల్పించారు. బ్రిక్స్ విస్తరణ, ఇకపై మరింతగా ప్రాబల్యం చెందడానికి వీలుండటంతో ఈ పరిణామం అమెరికా, బ్రిటన్ వంటి పశ్చిమ దేశాలకు ప్రతికూల పరిణామం అవుతోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామాఫోసా బ్రిక్స్ సదస్సు చివరి రోజున గురువారం ఈ ఆరుదేశాలను బ్రిక్స్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బ్రిక్స్‌లో ఇప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

వచ్చే ఏడాది జనవరి 1 వ తేదీ నుంచి కొత్త సభ్యదేశాలను బ్రిక్స్‌లోకి తీసుకుంటారని అధ్యక్షులు తెలిపారు. జొహన్సెస్‌బర్గ్‌లో ఆయన తమ వెంట భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్, బ్రెజిల్ అధినేత లూయిజ్ ఇనాషియో లూలా డ సిల్వా ఇతరులు వెంట ఉండగా విలేకరులతో మాట్లాడారు. పలు ప్రపంచ దేశాలు బ్రిక్స్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయని రామఫోసా తెలిపారు. అయితే భావ సారూప్యత , క్లిష్టతలను పరిగణనలోకి తీసుకుని సభ్యత్వంపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వివరించారు. 2024 జనవరి 1 నుంచి బ్రిక్ బలం 11 దేశాల స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. బ్రిక్స్ విస్తరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, మార్గదర్శక సిద్ధాంతాలు, ప్రమాణాలకు ,నిబంధనలకు, నిర్ధేశిత పద్ధతులకు అనుగుణంగానే కొత్త సభ్యులను తీసుకుంటారని వివరించారు. చాలా కాలంగా బ్రిక్స్ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయని , తొందరపడి నిర్ణయాలకు రావడం లేదని ఆఫ్రికా నేత తెలిపారు. ఇప్పుడు ఈ దేశాలను బ్రిక్స్‌లోకి తీసుకోవడంపై ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇది తొలి దశ విస్తరణ, ఇకపై మరిన్ని విస్తరణలు దశలవారిగా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్రిక్స్‌కు అధ్యక్ష స్థానంలో ఉంది.

ఇతర ప్రపంచ సంస్థలూ విస్తరణ పొందాలి
బ్రిక్స్ సదస్సు నుంచి మోడీ పిలుపు
ఇప్పుడు బ్రిక్స్ తొలి దశ విస్తరణ కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఇతర ప్రపంచ సంస్థలు కూడా గిరిగీసుకుని ఉండకుండా విస్తరించుకుపోవల్సి ఉందని పిలుపు నిచ్చారు. బ్రిక్స్ విస్తరణకు భారతదేశం నుంచి ఎల్లవేళలా మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటి బ్రిక్ విస్తరణ ఐరాస సంస్థలు, ఇతర వేదికల విస్తృతికి ఓ మంచి ఉదాహరణ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బ్రిక్స్‌కు కొత్త సభ్య దేశాలు రావడం వల్ల సంస్థగా ఈ వేదిక మరింత బలోపేతం అవుతుంది . ఉమ్మడి లక్షాలు నెరవేరే దిశలో ఇదో మార్గం అవుతుందని చెప్పారు. ఇప్పుడు ప్రపంచం బహుళ ధృవస్థితిలో ఉంది. బహుముఖతను చాటుకుంటోంది. బ్రిక్స్ పట్ల పలు దేశాల నమ్మకం పెరగడం మంచి పరిణామం అయిందన్నారు.

2006 సెప్టెంబర్‌లో ముందుగా నాలుగు దేశాలు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో బ్రిక్‌గా వెలిసిన సంస్థలోకి 2010లో దక్షిణాఫ్రికా కూడా వచ్చి చేరడంతో దీనిని బ్రిక్స్‌గా పేరు మార్చారు. ఇప్పుడు బ్రిక్స్‌కు ప్రపంచస్థాయిలో 41 శాతం వరకూ జనాభా ప్రాతినిధ్యం ఉంది. గ్లోబల్ జిడిపిలో 24 శాతం, గ్లోబల్ ట్రేడ్‌లో 16 శాతం వరకూ బ్రిక్స్ దేశాల వాటా ఉంది. ఈ క్రమంలో బ్రిక్స్ విస్తరించుకుంటూ పోవడం ప్రపంచ స్థాయిలో బ్రిక్స్ మరింత పటిష్టం అయ్యేందుకు, తిరుగులేని శక్తిగా మారేందుకు దారితీస్తుంది. బ్రిక్స్ విస్తరణపై చైనా అధినేత జిన్‌పింగ్ స్పందిస్తూ ఈ బృందంలో నూతన అధ్యాయానికి దారితీస్తోందన్నారు. రష్యా అధ్యక్షులు పుతిన్ పరోక్షంగా స్పందిస్తూ విస్తరణను కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News