Monday, December 23, 2024

మరింత శక్తిమంతంగా బ్రిక్స్

- Advertisement -
- Advertisement -

బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు కొత్త దేశాలు చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చోటు కల్పించారు బ్రిక్స్ దేశాధినేతలు. ఈ దేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్రిక్స్ కూటమిలో భాగమవుతాయని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తెలిపారు. మరోవైపు బ్రిక్స్‌లో కొత్త దేశాలు భాగమవడం వల్ల కూటమికి మరింత శక్తి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ కూటమి దేశాధినేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిక్స్ కూటమిలో మరో ఆరు కొత్త సభ్య దేశాలను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్‌ఎమిరేట్స్‌కు బ్రిక్స్ కూటమిలో చోటు దక్కనుంది.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఐదు ప్రధాన జాతీయ ఆర్థిక వ్యవస్థల సంక్షిప్త రూపం బ్రిక్స్. వాస్తవానికి మొదటి నలుగురిని 2010లో దక్షిణాఫ్రికా ప్రవేశానికి ముందు బ్రిక్‌గా వర్గీకరించారు. ప్రాంతీయ వ్యవహారాలపై వాటికున్న గణనీయమైన ప్రభావానికి గాను బ్రిక్స్ సభ్యులు ప్రసిద్ధి చెందాయి.

ఇవన్నీ జి 20లో సభ్యులే. ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధి నేతలు పాల్గొంటారు.2009 నుండి బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. బ్రిక్స్ దేశాల 6వ సమావేశం 2014 జులై 13 17 వరకు బ్రెజిల్లో ఫోర్టాలెజా, బ్రసీలియాలో జరగింది. 2017 సెప్టెంబర్‌లో జియామెన్‌లో 9 వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా ఆతిథ్యం ఇవ్వగా, బ్రెజిల్ 13- 2019 నవంబరు 14న 11వ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. 2015లో ఐదు బ్రిక్స్ దేశాలు 310 కోట్లకు పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించాయి. ప్రపంచ జనాభాలో ఇది 41%. ఐదుగురు సభ్యులలో నలుగురు (దక్షిణాఫ్రికా మినహా -అది 24 స్థానంలో ఉంది) జనాభాపరంగా ప్రపంచంలో మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి.2018 నాటికి ఈ ఐదు దేశాల నామమాత్రపు జిడిపి 18.6 ట్రిలియన్ డాలర్లు.స్థూల ప్రపంచ ఉత్పత్తిలో ఇది 23.2%. సంయుక్త జిడిపి (పిపిపి) సుమారు 40.55 ట్రిలియన్ డాలర్లు (ప్రపంచ జిడిపి ఇది 32%). వీటి సంయుక్త విదేశీ మారక నిల్వలు 464.46 ట్రిలియన్లు. బ్రిక్స్ పలువురు విశ్లేషకుల నుంచి ప్రశంసలనూ, విమర్శలనూ అందుకున్నది.

బ్రిక్స్ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను జోక్యం చేసుకోని, సమానత్వంతో కూడిన, పరస్పర ప్రయోజనాల ఆధారంగా నిర్వహించుకుంటా యి. ఐదు దేశాలలోని బ్యాంకుల ఆర్థికాభివృద్ధికి ఆయా దేశ ప్రధాన మంత్రుల బృందం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి బ్యాంక్‌ను నెలకొల్పేందుకు బ్రిక్స్ దేశాలు సన్నద్ధమవుతున్నాయి. సభ్యదేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం బ్రిక్స్ లక్ష్యం. ‘బ్రిక్’ అనే పదాన్ని 2001లో అప్పటి గోల్డ్‌మన్ సాచ్స్ అసెట్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్ జిమ్ ఓనీల్ తన బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్ బ్రిక్స్ అనే పుస్తకంలో ఉపయోగించాడు. కానీ వాస్తవానికి అసలు నివేదికలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉన్న రూప పురుషోత్తమన్ ఈ పదాన్ని కాయించింది. నాలుగు బ్రిక్ జనరల్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) విదేశాంగ మంత్రులు న్యూయార్క్ నగరంలో 2006 సెప్టెంబరులో ఐరాస అసెంబ్లీ జనరల్ చర్చల సమయం లో సమావేశమయ్యారు. వరుస ఉన్నత స్థాయి సమావేశాలను ప్రారంభించారు. 2009 జూన్ 16న రష్యాలోని యెకాటెరిన్ బర్గ్ లో పూర్తి స్థాయి దౌత్య సమావేశం జరిగింది.

యెకాటెరిన్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్ మొట్ట మొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం 2009 జూన్ 16న ప్రారంభమైంది. లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, డిమిత్రి మెద్వెదేవ్, మన్మోహన్ సింగ్, హు జింటావో హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఆర్థిక సంస్థలను సంస్కరించడం వంటి మార్గాలపై శిఖరాగ్ర సమావేశం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో నాలుగు దేశాలు ఎలా సహకరించుకోగలవో చర్చించారు. యెకాటెరిన్‌బెర్గ్ శిఖరాగ్ర సమావేశం తరువాత బ్రిక్స్ దేశాలు కొత్త గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవసరాన్ని ప్రకటించాయి. ఇది విభిన్నంగా, స్థిరంగా ఊహించగలిగేలా ఉండాలి. ఈ ప్రకటనలో యుఎస్ డాలర్ ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగా విమర్శించనప్పటికీ (రష్యా గతంలో విమర్శించింది) ఇది డాలర్ విలువలో పతనానికి దారితీసింది. 2010లో దక్షిణాఫ్రికా బ్రిక్ సమూహంలో చేరడానికి ప్రయత్నా లు ప్రారంభించింది. దాని అధికారిక ప్రవేశం ఆ సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది. చేరాలని చైనా అధికారికంగా ఆహ్వానించిన తరువాత 2010 డిసెంబరు 24న దక్షిణాఫ్రికా అధికారికంగా సభ్యదేశంగా మారింది.

తరువాత ఇతర బ్రిక్ దేశాలు అంగీకరించాయి. సమూహం విస్తరించిన సభ్యత్వాన్ని ప్రతిబింబించేలా ఈ బృందానికి బ్రిక్స్ అని పేరు పెట్టారు. దక్షిణాఫ్రికా కోసం ఎస్ చేరింది. 2011 ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, చైనాలోని సాన్యాలో జరిగిన 2011 బ్రిక్స్ సదస్సుకు పూర్తి సభ్యునిగా హాజరయ్యారు. బ్రిక్స్ ప్రాధాన్యం ఎంత? బ్రిక్స్ దేశాల మొత్తం జనాభా 324 కోట్లు. వీటి మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 26 ట్రిలియన్ డాలర్లు (రూ. 2,162 లక్షల కోట్లు). అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26 శాతం. అయితే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో ఓటింగ్ హక్కులు ఈ కూటమికి 15% మాత్రమే ఉన్నాయని అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అంచనా వేసింది. బ్రిక్స్ లక్ష్యం ఏమిటి? ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు, గళాన్ని వినిపించేందుకు ఈ కూటమి ఏర్పాటైంది. 2014లో బ్రిక్స్ దేశాలు 250 బిలియన్ డాలర్లతో (రూ.20.78 లక్షల కోట్లు) న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి)ను ఏర్పాటు చేశాయి. అభివృద్ధి చెందుతున్న

దేశాలకు రుణాలు ఇవ్వడమే దీని లక్ష్యం. బ్రిక్స్‌లో సభ్యత్వం లేని ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లకు ఎన్‌డిబిలో సభ్యత్వముంది. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వాతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా బ్రిక్స్ కూటమి విస్తరణ నిర్ణయాన్ని ప్రకటించారు. బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6 సభ్య దేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భాగమవుతాయి. విస్తరణ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు, ప్రమాణాలు, విధి విధానాలపై ప్రస్తుత బ్రిక్స్ కూటమి దేశాలు చర్చించుకున్నాయి. ఆ తర్వాతే కొత్త సభ్యదేశాలను బ్రిక్స్ కూటమిలో భాగం చేసేందుకు అంగీకరించారు. బ్రిక్స్‌లో ఆరు కొత్త దేశాలను చేర్చుకోవడం వల్ల కూటమికి కొత్త శక్తి వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బ్రిక్స్ కూటమి విస్తరణ, ఆధునీకరణ, అంతర్జాతీయ సంస్థలన్నీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ మేరకు బ్రిక్స్ కూటమిలో మరో 6 సభ్య దేశాలను చేర్చుకోనున్నట్లు చెప్పారు. బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆరు కొత్త సభ్య దేశాల చేరిక బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం అవుతుంది. కొత్త సభ్య దేశాలైన అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఎఇలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News