పట్టణ శివారులోని శ్రీరంగాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన శ్రీకాంత్ (30) గత పది ఏళ్లుగా హైదరాబాదులో కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ, జీవనం గడుపుతున్నాడు. అతనికి భార్య నాగమణి ఇద్దరు పిల్లలు లాస్య(4), లావణ్య(2) ఉన్నారు. లాస్యకు విజయవాడ గుణదలలో చెవులు కుట్టించే వేడుకకు
హైదరాబాద్ నుండి శ్రీకాంత్ కుటుంబంతో పాటు బంధువులు మాణిక్యమ్మ (48), చందర్రావు (50), కృష్ణంరాజు (34), స్వర్ణకుమారి (33) పిల్లలు కౌశిక్, కార్తీక్ బయలుదేరారు. మొత్తం పది మంది కారులో విజయవాడకు వెళ్తుతుండగా.. కోదాడ పట్టణ శివారులోని శ్రీరంగాపురం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీకాంత్ అతని కుమార్తె లాస్య,అత్త మామలైన మాణిక్యమ్మ, చందర్రావు, బామరిది కృష్ణంరాజు, చెల్లెలు స్వర్ణ అక్కడికక్కడే మృతిచెందగా మృతుడు శ్రీకాంత్ భార్య నాగమణి అతని కుమార్తె లావణ్యతో పాటు బంధువుల పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాను పోలీసులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డ క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
మిన్నంటిన రోదనలు
మృతుడు శ్రీకాంత్ స్వగ్రామం చిమిర్యాల గ్రామం నుండి బందువులు పెద్ద ఎత్తున కోదాడ ప్రభుత్వ వైద్య శాలకు చేరుకున్నారు. వేడుక ముచ్చట తీరకముందే తమ వారి బతుకులు గాలిలో కలిసిపోవడంతో బంధువులు రోదిస్తున్న తీరుతో హాస్పిటల్ ప్రాంగణంలో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహలను పోస్టుమార్టం తీసుకెళుతున్నప్పుడు ఆటోలో ఉన్న మృతదేహాలను చూసి పలువురు ఉద్వేగానికి లోనయ్యారు.
గోవిందపురం గ్రామంలో విషాదఛాయలు
ఖమ్మం జిల్లా బొనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామస్తులంతా ఒకసారిగా కన్నీరు మున్నీరయ్యారు. అనాధలైన కార్తీక్, కౌశిక్‌లను చూసి భాగ్వేదానికి గురైయ్యారు. అటు తల్లిదండ్రులు నాయనమ్మ, తాతయ్యలు చనిపోవడంతో ఆ పిల్లలకు దిక్కు ఎవరంటూ గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు.