Thursday, January 23, 2025

ఆరుగురు జల సమాధి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జవహర్‌నగర్ : చెరువులో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులతో పాటు వారిని కాపాడేందుకు దిగిన ఓ ఉపాధ్యాయుడు నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలోని ఎర్రగుంటలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన మదర్‌స్సా పాఠశాలలో దాదాపు 41 మంది విద్యార్థులు అరబ్బు చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్నారు. శనివారం ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు విద్యార్థులను తీసుకొని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో నివసించే ఓ ఉపాధ్యాయుడి ఇంటి ఫంక్షన్‌కు వచ్చాడు. మధ్యాహ్నం 1 గంటకు ఆరుగురు విద్యార్థులు స్థానికంగా ఉన్న మల్కారం ఎర్రగుంట చెరువు వద్దకు ఈత కొట్టడానికి వెళ్లి చెరువులోకి దిగారు. అయితే చెరువు లోతుగా ఉన్న విషయం తెలియని విద్యార్థులు మునిగిపోవడం గమనించిన ఉపాధ్యాయుడు వారిని రక్షించేందుకు చెరువులోకి దిగడంతో విద్యార్థులంతా ఒక్కసారి ఉపాధ్యాయుడిని పట్టుకోవడంతో అందరూ క్షణాల్లోనే మునిగిపోయారు.

అటుగా వస్తున్న వ్యక్తి మునిగిపోతున్న ఓ విద్యార్థిని చూసి రక్షించాడు. ఐదుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మునిగిపోయిన విషయం తెలుసుకున్న స్థానికులు జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ హుటాహుటిన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిలో జాఫర్ (10)ఇస్మాయిల్ (11), సోహేల్ (9), అయాన్ (9), రియాన్ (12) కాగా ఉపాధ్యాయుడు యోహ (25)గా గుర్తించారు. కుషాయిగూడ ఎసిపి సాధనా రేష్మీ పేరుమాళ్ అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన విద్యార్థులంతా 10 నుంచి 14 సంవత్సరాలలోపే ఉన్నారు. విద్యార్థుల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయండి

కాగా ప్రతిఏటా ఎర్రగుంట చెరువులో పడి చనిపోతున్న మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు మండిపడ్డారు. చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News