నాష్‌విల్లె (అమెరికా) : సెంట్రల్ టెన్నెస్సేలోని అనేక నగరాల్లో తీవ్రమైన తుపాన్ల బీభత్సానికి ఇళ్లు, వ్యాపార సంస్థలు విధ్వంసమై శనివారం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 24 మంది గాయపడ్డారు. కెంటుకీ రాష్ట్రం సరిహద్దు సమీపాన నాష్‌విల్లెకు ఉత్తర ప్రాంతంలో మోంట్‌గోమెరీ కౌంటీని టోర్నడో చిన్నాభిన్నం చేయడంతో ఒక చిన్నారితోసహా ముగ్గురు చనిపోయారని కౌంటీ అధికారులు ప్రకటించారు. తుపాన్ విధ్వంస దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైవేపై ట్రాక్టర్ పల్టీలు కొట్టి పడి ఉండడం కనిపిస్తోంది. ఈ విధ్వంసంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారు తీవ్ర విషాదంలో ఉన్నారని క్లార్క్‌విల్లె మేయర్ జో పిట్స్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ విపత్తులో ఆయా కుటుంబాలను ఆదుకోడానికి నగరం మొత్తం సిద్ధంగా ఉందన్నారు. టోర్నడో తుపాన్ శనివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో సంభవించిందని, నిర్వాసితులకు స్థానిక హైస్కూలులో ఆశ్రయం కల్పించామని మోంట్‌గోమెరీ కౌంటీ కార్యాలయం వెల్లడించింది. టెన్నెస్సేలో శనివారం రాత్రి దాదాపు 85 వేల మందికి విద్యుత్ సౌకర్యం లేకుండా పోయింది. జాతీయ వాతావరణ విభాగం అనేక హెచ్చరికలు జారీ చేసింది.