అగర్తలా : త్రిపురలోని కుమారఘాట్‌లో జగన్నాధ రథయాత్ర దశలో చెలరేగిన మంటల్లో ఆరుగురు విషాదాంతం చెందారు . పలువురు గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం యాత్ర దశలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లకు రథం పై భాగం తగులడంతో మంటలు చెలరేగాయి. జగన్నాధ రథయాత్ర తిరుగుయాత్ర లేదా బహుధా యాత్ర దశలో ఈ అపశృతి నెలకొంది. విద్యుత్ షాక్‌తో ఆరుగురు ఆహుతి అయ్యారు. పలువురు ఒళ్లు కాలి గాయాల పాలయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. వేలాది మంది ఉత్సాహంగా రథం లాగుతూ ఉండగా , రథానికి ఉన్న ఇనుప భాగానికి హైటెన్షన్ విద్యుత్ సోకింది.
పైన 133 కెవి సామర్థపు హైటెన్షన్ వైర్లు వేలాడుతూ ఉండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆరుగురు అక్కడిక్కడే చనిపోగా , పలువురు గాయపడ్డారని సహాయక ఐజి జ్యోతిష్మాన్ దాస్ చౌదరి తెలిపారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సహా విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉందని ఆ తరువాత అధికారులు తెలిపారు. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఘటనపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు వెలువడ్డాయి.