బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి అంచనా
ముంబై: అధికార కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఉన్న బలాబలాలను అంచనా వేసుకుంటే ఈ నెల 27న మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఏక్రగ్రీవం కావచ్చని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్‌కులే అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పటికీ 2022 మేలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో మహారాష్ట్ర వికాస్ అఘాడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఎంపీల పదవీ కాలం ముగిసిపోతుండడంతో మహారాష్ట్ర నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడనున్నాయి.
మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షమైన బిజెపి మూడు స్థానాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, మాజీ ఎమ్మెల్యే మేధా కులకర్ణి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అజిత్ గోప్‌చడేలను అభ్యర్థులుగా బిజెపి నామినేట్ చేసింది. బిజెపి మిత్రపక్షమైన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తమ పార్టీలో చేరిన మాజీ ఎంపి మిలింద్ దేవరను అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్ర మాజీ మంత్రి చంద్రకాంత్ హండోరేను తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది. అయితే ఆరవ అభ్యర్థిగా సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అజిత్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) తన అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు.