రామేశ్వరం వద్ద పట్టుబడ్డ లంకేయులు
కొలంబో : ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో దేశంలో ధరల పెరుగుదలతో శ్రీలంక పౌరులు భారత్‌కు వలసవెళ్లుతున్నారు. పెట్రోలు, ధాన్యం ఇతరత్రా వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, జనజీవితం అస్థవ్యవస్థం కావడంతో దిక్కుతోచని స్థితిలో వలసల బాటపట్టారని వెల్లడైంది. మంగళవారం భారతీయ కోస్తా రక్షక దళం గస్తీ సందర్భంగా ఆరుగురు శ్రీలంక జాతీయులను రామేశ్వరం వద్ద అదుపులోకి తీసుకుంది. వీరంతా శ్రీలంకలోని ఉత్తర ప్రాంతం అయిన జాఫ్రా ఇతర చోట్లకు చెందిన వారు. తిండికి నోచుకోలేని స్థితి ఏర్పడినందున తాము రహస్యంగా వలస వచ్చామని ఈ శ్రీలంకన్లు తెలిపారు. శ్రీలంకలో పలు పెట్రోలు బంకుల వద్ద భారీ స్థాయిలో సైనిక కాపలా విధించారు.
బంకుల వద్ద వాహనదారులు హింసాకాండకు దిగడంతో, రోజూ వేలాది మంది ఇక్కడ గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం నెలకొంది. ద్రవ్బోల్యణానికి దారితీసింది. పలు ప్రాంతాలలో దైనందిన నిత్యావసర సరుకులకు కొరత ఏర్పడింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. దేశానికి ప్రధాన ఆర్ధిక వనరు అయిన పర్యాటక రంగంపై పడిన ప్రభావం మరింత తీవ్రతరం అయింది. చైనా నుంచి భారీ స్థాయిలో రుణాలను తీసుకోవడంతో వడ్డీల భారంతో ఆర్థిక వ్యవస్థ చతికిల పడింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కెందుకు తాము అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)ని ఆశ్రయిస్తామని శ్రీలంక అధ్యక్షులు గొటాబాయ రాజపక్సా తెలిపారు.