కెనడాలోని ఒట్టావా నగరంలో శ్రీలంకకు చెందిన ఓ విద్యార్థి తాను ఉంటున్న శ్రీలంక వ్యక్తి కుటుంబంలోని ఆరుగురిని బలమైన ఆయుధంతో పొడిచి చంపేశాడు. మృతుల్లో రెండున్నర నెలల వయసు చిన్నారి సహా నలుగురు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఫెబ్రియో డిసౌజాగా గుర్తించిన 19 ఏళ్ల ఈ యువకుడు వారిని చంపడానికి కత్తిలాంటి పదునైన ఆయుధాన్ని ఉపయోగించినట్లు ఒట్టావా పోలీసు చీఫ్ ఎరిక్ స్టబ్స్ చెప్పారు. మృతులంతా శ్రీలంక వాసులని, వారు ఇటీవలే కెనడా వచ్చినట్లు ఆయన చెప్పారు.
మృతుల్లో 35 ఏళ్ల తల్లి, ఏడేళ్ల కుమారుడు, నాలుగు, రెండేళ్ల వయసు కుమార్తులు, రెండున్నర నెలల చిన్నారితో పాటుగా 40 ఏళ్ల బంధువు ఉన్నారు. ఇంటి బయట ఉన్న పిల్లల తండ్రి పోలీసులకు ఫోన్ చెయ్యమని అరవడంతో ఎమర్జెన్సీ కాల్స్ అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కొలంబోలో ఉన్న మృతుల బంధువులను తాము సంప్రదించినట్లు శ్రీలంక హైకమిషన్ తెలిపింది.