రెండోసారి దాడిలో దేశ వ్యాప్తంగా రోజుకి లక్ష దాటేసిన కరోనా కేసులు భయోత్పాతం కలిగిస్తున్నాయి. తొలి విడతలో సుదీర్ఘ లాక్‌డౌన్ సృష్టించిన కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అందుకు తెర లేపడానికి పాలకులు జంకుతున్నారు. ప్రజలూ గడగడలాడుతున్నారు. ముందు జాగ్రత్తల పట్ల జనం మరింత శ్రద్ధ వహించేటట్టు చూసి పరిమిత ఆంక్షలతోనే ఈ రెండో గండాన్ని గట్టెక్కాలని పాలకులు భావిస్తున్నట్టు స్పష్టపడుతున్నది. అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో పూర్తి లాక్‌డౌన్ విధించే విషయమై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో దేశంలో కరోనా టీకాలు మొదలైనప్పుడు రోజుకి 15,000 మందికే పరిమితమైన వైరస్ వ్యాప్తి మార్చి నుంచి వేగాన్ని పుంజుకున్నది. ఏప్రిల్ 4 నాటికి పరాకాష్ఠకు చేరుకుంది. కొత్త కేసులు రోజుకి లక్ష దాటిపోయాయి. శనివారం నాటి కేసుల సంఖ్య లక్ష 45 వేల 384కి చేరడం గమనార్హం.
అయితే ఈ వ్యాప్తి దేశమంతటా ఒకే స్థాయిలో లేకపోడం కొంచెం ఊరట కలిగించే అంశం. కొత్త కేసుల్లో 72.23 శాతం ఐదు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. లక్షకు పైబడిన కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 50 వేలకు పైగా ఉన్నాయి. ఈ విధంగా సెకండ్ వేవ్‌లో కరోనా కేసుల ఉధృతి అనూహ్యంగా సాగుతున్న దశలోనే టీకాలకు కొరత ఏర్పడడం ఆందోళనకరం. సకాలంలో సమర్థవంతమైన కరోనా టీకాలను ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా అందిస్తున్నామన్న ఖ్యాతిని గడించుకున్న మనకు వ్యాక్సిన్ కొరత సమాచారం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. గత జనవరి 16న దేశంలోని ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు టీకా కార్యక్రమం మొదలైంది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు దాటిన వారికి, ఇతర జబ్బులతో బాధపడుతున్న 45 ఏళ్లు మించిన వారికి వ్యాక్సినేషన్ చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటినవారందరికీ ప్రారంభించారు.
పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విదేశీ కొవిషీల్డ్, హైదరాబాద్ భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాలను వేస్తున్నారు. ప్రతి నెలా 6070 మిలియన్ డోసుల టీకాను దేశంలో అందిస్తూ దాదాపు అదే కిమ్మత్తు వ్యాక్సిన్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని సీరం చెబుతున్నది. దేశ వ్యాప్తంగా ఇంత వరకు 94 మిలియన్ డోసుల టీకా వేసినట్టు సమాచారం. 7 కోట్ల మంది మొదటి డోసు వేసుకోగా రెండు డోసులు పూర్తైన వారు కోటి మంది ఉంటారని తేలింది. ఈ లెక్కన 130 కోట్ల మందికి పైగా గల దేశ జనాభాలో కనీసం వంద కోట్ల మందికైనా టీకా అందడానికి ఇంకా చాలా కాలం పడుతుందని బోధపడుతున్నది. సెకండ్ వేవ్‌లో యువతకు ఎక్కువగా సోకుతున్నదంటున్నారు. వారికి టీకా లభించడానికి ఇంకెన్ని మాసాలు పడుతుందో. ఇంతలోనే వ్యాక్సిన్‌కు కొరత ఏర్పడడం, కేంద్రానికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మధ్య రాజకీయం రగలడం ఆందోళనకరం. అసలే టీకాలపై మొదట్లో వ్యాపించిన పుకార్లు, అనంతర ప్రభావాలకు సంబంధించిన భయాలు ప్రజలు ముందుకు రాకుండా చేశాయి. ఇప్పుడిప్పుడే అవగాహన పెరిగి వ్యాక్సిన్ వేయించుకోడానికి జనం ఉత్సాహం చూపుతున్నారు.
పేద వర్గాలకు చెందిన అసంఖ్యాక జనానికైతే టీకా పట్ల ఇంకా ఆసక్తి కలిగినట్టు కనిపించడం లేదు. ఈ దశలో టీకా కొరత ఏర్పడడం ఎంత మాత్రం మంచిది కాదు. కనీసం ఆరు రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నట్టు వార్తలు చెబుతున్నాయి. కొరత గురించి ముందుగా మహారాష్ట్ర కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాలు తమ వద్ద టీకా నిల్వలైపోయాయని అదనపు డోసులు కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వమైతే వ్యాక్సిన్ కొరత లేనేలేదని పంపిణీ చేయడం చేతకాక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కొరత సమస్యను కృత్రిమంగా సృష్టించాయని ఎదురు దాడికి దిగింది. ఇది ఎన్నికల రాజకీయం కాదు, కేవలం ప్రజల ప్రాణాలకు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించినది. ఇందులో నీదే తప్పంటే నీదే తప్పు అనే ధోరణి ఎంత మాత్రం పనికి రాదు. కేంద్రం గొప్పలకు పోయి 6 కోట్ల డోసుల టీకా మందు ఎగుమతికి అనుమతించిందని, ఇది దాని ముందు చూపు లేమిని చాటుతున్నదని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
ఇందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ రాహుల్ గాంధీ రాజకీయాలు వదిలిపెట్టి ఫార్మా కంపెనీలకు ఏజెంటుగా తయారయ్యారని ఎదురు దాడి చేశారు. ఈ విధంగా కొరత ఉన్నదని రాష్ట్రాలు మొరపెట్టుకుంటుంటే లేనేలేదని కేంద్రం అంటున్నది. వాస్తవం ఎక్కడ దాగింది? ప్రజలకు అత్యవసరమైన వైద్య ఆరోగ్య సమస్యను రాజకీయానికి వాడుకోడాన్ని ఇకనైనా మానుకోవాలి. పాలక ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక్క త్రాటిమీద నిల్చొని దేశ ప్రజలను కరోనా గండం నుంచి పూర్తిగా గట్టెక్కించాలి. అవసరమైతే అదనపు నిధులను భారీగా కేటాయించి దేశంలో టీకా కార్యక్రమం వీలైనంత త్వరగా పరిపూర్ణంగా జరగడానికి కావల్సినంత వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయించాలి.