Saturday, March 29, 2025

కుప్పకూలిన భవనం

- Advertisement -
- Advertisement -

భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న
ఆరు అంతస్తుల భవనం కూలి
ఇద్దరు మృతి శిథిలాల కింద
చిక్కుకున్న మరికొంత మంది
కాపాడండి అంటూ ఆర్తనాదాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాద్రి రామాలయానికి అతి సమీపంలో ఉన్న వీధిలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో నలుగురు శిథిలాల కింద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అర్చకత్వం చేసుకునే ఓ వ్యక్తి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. శిథిలాలు తొలగిస్తేనే కానీ ప్రమాద తీవ్రతను చెప్పలేమని అధికారులు అంటున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధిలో అతి తక్కువ స్థలంలో ఆరు అంతస్తుల భవనం నాసిరకంగా నిర్మించడమే కారణంగా తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పాత భవనం పునాదలు మీదే ఆరు అంతస్తులు నిర్మించడంతో

ఈ సంఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. శ్రీపతి నేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయ కనక దుర్గా భవాని ఆలయం, అనుబంధ భవనాన్ని గత నాలుగేళ్లుగా నిర్మిస్తూనే ఉన్నారు. మూడేళ్ల క్రితం ఈ భవన నిర్మాణానికి పంచాయతీ అధికారులు ఆటంకం తెలిపినా భవన యజమాని అధికారులను మేనేజ్ చేసి నిర్మాణం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం… భవనం కూలిపోయే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలిసింది. వారిలో ఒకరు తాపీ మేస్త్రీ ఉపేందర్ (40) కాగా మరో ఇద్దరు కూలీలు అని తెలుస్తోంది. అయితే, బుధవారం రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఒక్క మృతదేహం కూడా బయటకు తీయలేదు. శిథిలాలను తొలగిస్తే ఎంతమంది మృతి చెందారనేది తెలిసే అవకాశం ఉంది. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్‌పి రోహిత్‌రాజు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి శిథిలాలు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు.

*గతంలోనూ ఫిర్యాదులు
నాసిరకంగా, పిట్టగోడలతో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారని గతంలోనే పంచాయతీ అధికారులకు స్థానికులు అనేకసార్లు ఫిర్యాదుచేశారు. ఎన్నోసార్లు ఆందోళనకు కూడా దిగారు. చర్యలు తీసుకుంటామన్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం, మామూళ్లకు అలవాటు పడి జరుగుతున్న నిర్మాణాలను పట్టించుకోకపోవడం కారణంగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం బహుళ అంతస్తుల నిర్మాణాలు లేవని తెలిసినా అక్రమార్కులు భద్రాచలంలో యథేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. గ్రౌండ్, ప్లస్ 2 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉండగా ఆరు అంతస్తులు ఎలా నిర్మిస్తున్నారని, అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

* ఐటిడిఎ స్థాయి అధికారి ఉన్నా…
భద్రాచలంలో ఐటిడిఎ స్థాయి అధికారి, ఆర్‌డిఒ, ఎంఆర్‌ఒ ఉన్నా ఈ అక్రమ కట్టడంపై ఫిర్యాదులు అందినా ఏ ఒక్కరూ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంత పెద్ద ఉపద్రవం వచ్చిపడిపట్లే తెలుస్త్తోంది. భద్రాద్రి రామాలయానికి భక్తులు ఎక్కువగా వస్తున్న దృష్టా ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు భారీగా పెరిగాయి. నిర్మాణ పనులు ఎలా ఉన్నా అనుమతులు లేకుండా ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ నిర్మించిన, నిర్మిస్తున్న భవనాలే ఎక్కువ. వివిధ సంఘాల నాయకులు కొందరు స్థానికులతో కలిసి అక్రమ భవనాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు కూలిన భవనంపై కూడా ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News