Monday, December 23, 2024

ప్రధానికి ఆరేళ్ల పాప లేఖ!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: రెండు వారాల గలభా, గందరగోళం, నిరసనలు, సస్పెన్షన్ల తర్వాత సోమవారం నాడు అధిక ధరలపై లోక్‌సభలో చర్చ జరిగినందుకు సంతోషించాలో, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సమస్య విడిచిపెట్టి దేశ ఆర్ధిక వ్యవస్థ అమోఘంగా వెలిగిపోతున్నదని చెప్పినందుకు ఆశ్చర్యపోవాలో అర్ధం కావడం లేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కీర్తి దూబే అనే ఆరేళ్ల బాలిక పెన్సిల్, ఎరేజెర్, మాగీ ధరలు పెరిగిపోయాయంటూ ప్రధాని మోడీకి రాసిన లేఖ విస్మయాన్ని, ఆవేదనను కలిగించకమానదు. లోక్‌సభలో చర్చలో డిఎంకె సభ్యురాలు కనిమొళి ఈ విషయాన్ని ప్రస్తావించారు.

అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర విపరీతంగా పెంచేసి పచ్చికూరలు తినే దుస్థితిని ప్రజలకు దాపురింపజేసిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపి కాకోలి ఘోష్ వంకాయను కొరికి చూపించడం గమనార్హం. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలకు పైచూపే తప్ప కింది చూపు బొత్తిగా లేకపోయింది. వంట నూనెలు మంట నూనెలనిపించుకొంటున్నాయి. కూరగాయల ధరలూ చెట్టెక్కి కూచున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజెల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా విజృంభించి అన్ని వస్తువుల ధరలనూ ఆకాశం తాకేలా చేశాయి.

కోట్లాది సామాన్య ప్రజలు, నిరుపేదలు ఎలా బతుకుతున్నారో ఊహించడమే కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంతటి ముఖ్యమైన ప్రజాసమస్యపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చించాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలపై సస్పెన్షన్లతో పగ తీర్చుకొని పాలక పక్షం వికృతానందం పొందింది. ఆరేళ్ళ కీర్తి దూబే ప్రధానంగా మాగీ (చిన్న పిల్లలు ఇష్టంగా తినే పాక్డ్ నూడుల్స్) ధర పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయిదు రూపాయలు తీసుకొని మాగీ కోసం కిరాణా కొట్టుకు వెళ్లగా దుకాణదారు ఏడు రూపాయలు అడిగినట్టు, తిరిగి ఇంటికెళ్లి అదనపు డబ్బు అడిగితే అమ్మ కొట్టినట్టు ప్రధానికి చెప్పుకొన్నది. అలాగే పెన్సిల్ పోయిందని, తిరిగి కొనుక్కొనే స్థితి లేదని మొరపెట్టుకొన్నది. కొవిడ్ లాక్‌డౌన్ల దెబ్బతో ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయి పుస్తెల తాళ్ళు కూడా కుదువబెట్టి బతుకులీడ్చే దుస్థితిలోని తమ మీద నుంచి తాజా జిఎస్‌టి పెంపు ద్వారా అధిక ధరల గుర్రాలను పరిగెత్తించడం న్యాయమేనా అని జనం మొత్తుకొంటున్నారు.

ఇందుకు బదులుగా దేశవృద్ధి రేటు దేదీప్యమానంగా వెలిగిపోతున్నదని నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పడం విచిత్రంగా ఉంది. ఇది ప్రజల ఆవేదనాగ్ని మీద కిరోసిన్ చల్లినట్టు, వారి గాయాలను కెలికినట్టుగా ఉంది. మన ద్రవ్యోల్బణం 7 శాతం, అంతకంటే తక్కువగానే ఉందని, బ్యాంకుల రుణ ఎగవేతలు అరేళ్లలో అతి తక్కువగా 5.9 శాతం వద్ద ఉన్నాయని, 2022లో జిడిపితో రుణభారం 56.21 శాతమేనని, ఇది ఇతర అనేక దేశాలతో పోల్చుకొంటే చాలా తక్కువని ఆమె చెప్పుకొన్నారు. ద్రవ్యోల్బణాన్ని ఇంకా తగ్గిస్తామన్నారు. అయితే దేశ ప్రజలను సంవత్సరాల తరబడిగా పిచ్చికుక్కల్లా కరుస్తూ తరుముతున్న అధిక ధరల సమస్యకు ఇవి సమాధానాలు కాజాలవు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను 500-600 బిలియన్ డాలర్ల వద్ద కాపాడుకొంటున్నందున మన ఆర్ధిక వ్యవస్థను అంతర్జాతీయ నిపుణులు మెచ్చుకోడాన్ని, ఇందులో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకి అయిన రఘురామ్ రాజన్ కూడా ఉండడం బాగానే ఉంది.

కాని అది ప్రభుత్వం దివాలా తీయకుండా కాపాడుతుంది తప్ప ప్రజల ఆకలిని ఎలా తీరుస్తుంది? ప్రజలను పస్తులు పెట్టి, మరీ మరింతగా పన్నులు వేసేసి ఆర్ధిక వ్యవస్థ మెరిసిపోతున్నదనడం ఏమైనా బాగుందా? కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆరా తీసి నిర్ధారించిన గణాంకాల ప్రకారమే ధరలు విపరీతంగా ఎగబాకిపోయాయి. 2021 మే 13న కిలో రూ. 28.80 ఉన్న గోధుమ పిండి ధర ఈ ఏడాది అదే సమయంలో రూ. 33.14 అయింది. పెరుగుదల 13 శాతం. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖే వెల్లడించింది. ఇది కోట్లాది కుటుంబాల వంట గదులను సంక్షోభంలోకి నెట్టి వేసింది. ఈ నేపథ్యంలో గోధుమలను ఇష్టావిలాసంగా ఎగుమతి చేసుకోడానికి వర్తకులను కేంద్రం ప్రోత్సాహించింది. సమీప భవిష్యత్తులో 10 మిలియన్ టన్నుల ఎగుమతులకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెబుతున్నారు.

ఐదేళ్ల క్రితంతో పోల్చితే బియ్యం ధర 24 శాతం, గోధుమ ధర 28 శాతం, పప్పులు 20-30 శాతం, వంట నూనెలు 70-80 శాతం పెరిగిపోయాయి. పాల ధర 25 శాతం, తేయాకు 41 శాతం, ఉప్పు ధర కూడా 28 శాతం ఎగబాకాయి. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర ఏడాదిలోనే రూ. 431.50 అధికమైంది. వాణిజ్యస్థాయి వంట గ్యాస్ ధర చెప్పనలవికానంతగా విజృంభించింది. వీటిని సామాన్యుడికి అందుబాటులో వుండే స్థాయికి దించకుండా ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా ఏమి ప్రయోజనం? మన విదేశీ అప్పు ప్రధాని మోడీ హయాంలో 50 శాతానికి పైగా పెరిగిపోయి 80 లక్షల కోట్లకు చేరిందని అధికారిక గణాంకాలే చాటుతున్నాయి. ప్రజలను అన్నార్తులను చేసేది ప్రగతి ఎలా అవుతుంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News