అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సిఐడి అరెస్ట్ చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు చేసిన సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడారు. ఆధారాలున్నప్పుడు అరెస్టు చేయడం సహజమేనని, ఈ కేసులో అసలు విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. బలమైన సాక్ష్యాల ఆధారంగానే బాబును సిట్ అరెస్ట్ చేసిందని, బాబు చేసిన తప్పుడు పని దేశంలో మరెవరూ చేయలేదని దుయ్యబట్టారు. షెల్ కంపెనీల పేర్లను సృష్టించి భారీగా దోపిడి చేశారని, ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు ఉందని, 2017-18లోనే బాబుకు సంబంధం ఉందని పూణేలో జిఎస్‌టి గుర్తించిందని, ఆ తరువాత తమ ప్రభుత్వం వచ్చినా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసును అధికారులే విచారిస్తారని, సమాధానం చెప్పమని అధికారులు నోటీసులు ఇస్తే ఉరితీయమంటూ చంద్రబాబు దబాయిస్తున్నారని సజ్జల రామకష్ణారెడ్డి దుయ్యబట్టారు. బాబు దబాయిస్టుంటే కుదరదని, ఆరోజులు పోయాయని, తప్పు చేస్తే ఎవరైనా కేసులు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.
బాబు పెట్టిందే స్కామ్ కోసం అన్నట్టుగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ని ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును కాజేసిన వ్యవహారం రుజువు ఉందని, చంద్రబాబు ఆదేశాల మేరకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నట్టు నోట్ ఫైల్‌లో కూడా రాసి ఉందని, తనని అరెస్ట్ చేస్తారా? కాపాడుకోండని నాలుగు రోజులుగా చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని సజ్జల చురకలంటించారు. అరెస్ట్ చేయకపోతే ఎలాంటి ఆధారాలు లేవని బాబు చెప్పుకోవాలనుకున్నారని, అరెస్ట్ చేసతే ఒకలాగా చేయకపోతే ఇంకోలా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
బాబు విషయంలో వైసిపి ప్రభుత్వం ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పారు. బాధ్యత కలిగిన రాజకీయనాయకుడు వ్యవహరించాల్సిన తీరు అదికాదని, టిడిపి నేత లోకేష్ తన తండ్రి దగ్గరకు వెళ్తారంటే ఎవరూ అడ్డుకోరని, కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తానంటే కుదరదని, ప్రభుత్వ సొమ్ము కొట్టేశారా? లేదా? అనేది చెప్పకుండా తప్పించుకోవాలంటే కుదరని సజ్జల రామకష్ణారెడ్డి హెచ్చరించారు.