హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాన మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రీ ట్రస్ట్ ఢిల్లీ ఆధ్వర్యంలోని నైపుణ్య అభివృద్ధి సంస్థ ( స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ) ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఆ ట్రస్ట్ చైర్మన్, స్వర్గీయ లాల్ బహద్దూర్ శాస్త్రీ కుమారుడు అయిన అనిల్ శాస్త్రీ ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు సహా విద్యా రంగానికి, నూతన ఆవిష్కరణలకు చేయూతను అందిస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి ఈ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ చైర్మన్ అనిల్ శాస్త్రీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో మంగళవారం బి.ఆర్.కె. భవన్ లో సమావేశమయ్యారు.
జాతీయ స్థాయి నైపుణ్య అభివృద్ధి సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అనిల్ శాస్త్రీ ముందుకు రావడం పట్ల సోమేశ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సిఎస్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమే కాకుండా వివిధ కోర్సులను ఈ జాతీయ సంస్థ నిర్వహించనుందని అనిల్ శాస్త్రీ తెలిపారు. అందుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనువైన ప్రాంతంగా తాము గుర్తించామన్నారు.
పలుమార్లు చర్చలు జరిపిన నేపథ్యంలో లాల్ బహద్దూర్ శాస్త్రీ నైపుణ్య అభివృద్ధి సంస్థను హైదరాబాద్ లో నెలకొల్పేందుకు అనిల్ శాస్త్రీ ముందుకు వచ్చారని, ఇది హర్షించదగిన పరిణామం అని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని వినోద్ కుమార్ హామీనిచ్చారు. ఈ ట్రస్ట్ సింగపూర్ లోని ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( ఐ.టీ.ఈ ) సంయుక్త నిర్వహణలో జాతీయ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని ఆ ట్రస్ట్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సమావేశంలో ఆ ట్రస్ట్ సలహాదారులు పాండు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.