Thursday, December 19, 2024

నిరాశ వద్దు… నైపుణ్యమే హద్దు

- Advertisement -
- Advertisement -

దేశంలో యువకుల్లో 25% మంది చదువు, శిక్షణ, కొలువులు లేకుండా కొట్టుమిట్టాడుతున్నట్టు ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ద్వారా వెల్లడైంది. వీరిలో అమ్మాయిలైతే 38.1% వరకు ఉన్నట్టు తేలింది. ఏం చేయకుండా వీరంతా ఎలా గడుపుతున్నారు? అని పరిశీలిస్తే ఇంటిపనుల్లో తలమునకలై ఉండడమో, లేక నిరాశా నిస్పృహల్లో కుంగిపోతుండడమో కనిపిస్తోంది. ఇటువంటి వారికి సాంకేతిక నైపుణ్యం అందించే అవకాశాలు ఇప్పుడు ఎన్నో ఉంటున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే ఉపాధికి లోటు ఉండదు. అవసరాలకు తగినట్టు సాంకేతిక నైపుణ్యం లభిస్తుంది. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో డ్రోన్ల వినియోగం గురించి తెలియని వారుండరు. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌గాజా హమాస్ యుద్ధాలలో డ్రోన్లతో దాడులు విపరీతంగా సాగుతుండడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రణ రంగానికే కాదు, సరిహద్దుల్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్ల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ, పైప్‌లైన్లు, ఆనకట్టల తనిఖీలు, ఇతర సర్వేలన్స్‌లకు డ్రోన్లు వినియోగమవుతున్నాయి. ఈ డ్రోన్లు ఆన్‌బోర్డ్ కెమెరాలతో అమర్చి వినియోగిస్తే లైవ్‌ను నేరుగా ఆపరేటర్ డివైస్‌కు అంటే గాగుల్స్‌కు లేదా స్మార్ట్ ఫోన్లకు పంపిస్తాయి. సకాలంలో కచ్చితంగా లక్షాలను గుర్తిస్తాయి. హైదరాబాద్, బెంగళూరుకు చెందిన కొన్ని స్టార్టప్‌లు ఇప్పుడు డ్రోన్ల తయారీయే కాకుండా, యువతకు డ్రోన్లు నడపడంలో పైలట్లుగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం విరివిగా సాగుతున్నందున డ్రోన్ పైలట్లుగా యువతకు ఉపాధి మార్గాలు పుష్కలంగా ఉంటున్నాయి. విత్తనాలు జల్లడం నుంచి రసాయనాలను పిచికారీ చేయడం వరకు అన్ని పనులను డ్రోన్లచే చేయిస్తున్నారు. అయితే డ్రోన్లను నడిపే పైలట్లుగా శిక్షణ పొందడం తప్పనిసరి. డ్రోన్ల పైలట్లుగా శిక్షణ ఇచ్చే సంస్థలు హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. పొలాల్లో రసాయన మందులు జల్లడానికి డ్రోన్లను నడిపై పైలట్లకు నెలకు రూ. 60 వేలు వరకు ఆదాయం లభిస్తుంది.

అయితే డ్రోన్ పైలట్లకు డిమాండ్ బాగా ఉన్నప్పటికీ వీరి సంఖ్య చాలా తక్కువగాఉంటోంది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 24000 మంది మాత్రమే రిజిస్టర్డ్ పైలట్లు ఉన్నారు. కానీ వీరి అవసరం లక్షల్లో ఉంది. సప్లయి, డిమాండ్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటోందని హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ల పైలట్ శిక్షణ సంస్ధ మారట్ డ్రోన్స్ కో ఫౌండర్, సిఇఒ వి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో లక్ష డ్రోన్లు ఆపరేషన్‌లో ఉన్నాయి. కానీ 2027 నాటికి వివిధ రంగాలకు ఈ డిమాండ్ సంఖ్య మిలియన్‌కు చేరుకుంటుంది. ఈ విధమైన అభివృద్ధి కనిపిస్తున్నా నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్ల కొరత తీవ్రంగానే ఉంటోందని ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డ్రోన్ నిబంధనలు 2021 ప్రకారం ఎవరైనా సరే చిన్నపాటి నుంచి మధ్యతరహా వాణిజ్యపరమైన డ్రోన్‌పై విహరించాలంటే రిమోట్ పైలట్ సర్టిఫికేషన్, లైసెన్సు కలిగి ఉండాలి. ప్రతి డ్రోన్‌కు ఏకైక సీరియల్ నంబర్ ఉంటుంది. కానీ ఆపరేషన్‌లో ఉంటున్న చాలా డ్రోన్‌లకు ఈ నంబర్లు ఉండడం లేదు. రిజిస్టర్ అయిన డ్రోన్లు కన్నా రిజిస్టర్ కాని డ్రోన్ల సంఖ్యే ఐదు నుంచి పదింతలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఈ డిమాండ్‌ను నెరవేర్చడం కోసం మారట్ డ్రోన్లు, ఇతర కంపెనీల డ్రోన్లు సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా వ్యవసాయంలో రోజూ వివిధ పనులకు లక్షల డ్రోన్లు అవసరమవుతున్నాయి. హైదరాబాద్ డ్రోన్ శిక్షణ సంస్థలు అనేకం పుట్టుకొస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్శిటీతో మారట్ డ్రోన్ అకాడమీ భాగస్వామ్యం చెంది డ్రోన్ ట్రయినింగ్ అకాడమీని నడుపుతోంది. ఇది కాక, తెలంగాణ అకాడమీ, ఇండియా డ్రోన్ అకాడమీ, ద్రోణాచార్య వంటి సంస్థలు కూడా ఉంటున్నాయి. ఈ శిక్షణా కార్యక్రమాలు రైతులను, వుమెన్ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులను, యువ రైతులను, వ్యవసాయ పట్టభద్రులను సాధికారత చేయడంపై దృష్టి పెట్టాయి.

వ్యవసాయానికి సంబంధించి డ్రోన్ టెక్నాలజీలో మంచి సామర్ధం పెంపొందించడమే ఈ శిక్షణ లక్షం. ఇంతవరకు 700 డ్రోన్ పైలట్లు తమ శిక్షణ పూర్తి చేసుకున్నారని ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. డ్రోన్ ఏవియేషన్, పేలోడ్ వంటి అడ్వాన్స్‌డ్ ఆపరేషన్స్, స్ప్రేయింగ్ సిస్టమ్స్ తదితర అంశాల్లో శిక్షణ సమగ్రంగా ఇస్తారు. అగ్రికల్చర్ నుంచి మైనింగ్, కన్‌స్ట్రక్షన్ రంగాల వరకు గ్రాడ్యుయేట్లకు ఇందులో నెలకు రూ. 60 వేలు నుంచి రూ. 70 వేలు వరకు ఆదాయం లభిస్తుంది. శిక్షణ పొందిన పైలట్లు డ్రోన్ల కోసం రూ. 6 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. రైతులు వీటిని ట్రాక్టర్ల మాదిరి బాడుగకు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. రసాయన మందులు చల్లడానికి సాధారణంగా తీసుకున్న సమయం కూడా డ్రోన్ల వినియోగం వల్ల చాలా తగ్గుతుంది. అదీకాక రైతులకు రసాయనాల ప్రభావం నుంచి ఆరోగ్యానికి ముప్పు తప్పుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News