మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పరిధిలో నమోదైన నిర్మాణ కార్మికులకు నైపుణ్య శిక్షణ అందించాలని కార్మిక శాఖ నిర్ణయించింది. మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా ఆంధ్రప్రదేశ్ ఉత్పాదకత మండలి ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల ఉభయ తెలుగు రాష్ట్రాలలో అమలు చేయనున్నారు.ఈ మేరకు కార్మికశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ. రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులు కేంద్ర ఉపాధి కల్పన సేవలు (ఎన్సీఎస్ ) వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కార్మికశాఖ తెలిపింది. నిర్మాణ కార్మికులకు వారి ఉత్పాదకత, ఉపాధిని మెరుగుపరచడానికి కొత్త నైపుణ్యాలను కల్పించేందుకు ఎనిమిది కోర్సుల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. లబ్ధిదారులు నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సిఎస్)లో నమోదు చేసుకోవాలని సూచించారు. www.ncs.gov.in, టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1514లో సంప్రదించాలని కోరారు.