Wednesday, January 22, 2025

కూలీల ‘ఉన్నతి’కి శ్రీకారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఉన్నతి కార్యక్రమంలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కొత్త విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలను సిద్ధం చేస్తోంది. కూలీలకు ఈ పథకం కింద పనులే గాక నైపుణ్యశిక్షణ ఇచ్చి సొంతంగా ఉపాధి పొందేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రధానంగా మహిళా కూలీలకూ చేయూతనివ్వనుంది. ప్రస్తుతం ఉపాధి హామీలో నమోదైన కూలీలకు వందరోజుల పాటు పనులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కాలువలు, చెరువుల్లో పూడిక తీయడం. మట్టి ఎత్తిపోయడం వంటి పనులు వారు చేస్తున్నారు. తాజాగా కేంద్రం. ఉపాధి హామీ సంస్కరణల్లో భాగంగా కూలీలకు పనుల విస్తరణపై దృష్టి సారించింది. ఈ మేరకు కార్యాచరణ కోసం తాజాగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

 ప్రతి మండలానికి 50 మంది ఎంపిక..
కూలీలకు కాయకష్టంతో కూడిన పనులకే పరిమితం చేయకుండా వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇతర పనులు చేసేందుకు సన్నద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మండలాల వారీగా వారికి నైపుణ్య శిక్షణ శిబిరాలను నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ శిబిరాల నిర్వహణకు కేంద్రం నిధులను అందిస్తుంది. గత నాలుగు సంవత్సరాలు ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనిదినాలు పూర్తిచేసిన కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఈ శిక్షణ ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఈ ఉన్నతి శిక్షణకు ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. కూలీల జాబ్ కార్డ్ పరిగణనలోకి తీసుకొని.. వారు ఎంచుకున్న వృత్తుల్లోనే గాక ఎలక్ట్రిషియన్, ప్లంబర్, పెయింటర్, మేస్త్రి. హెల్పర్. టీవీ, ఫ్యాన్లు, మోటార్ మెకానిక్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. అనంతరం అవసరమైన పరికరాల కొనుగోలు, దుకాణాలు ఏర్పాటుకు కేంద్రం ’ముద్ర’ తదితర పథకాల కింద రుణసాయం అందిస్తుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ కార్యాల యాల్లో, ప్రభుత్వ శాఖల్లో, పాఠశాలలు, మార్కెట్ యార్డుల్లో పనులను అప్పగిస్తారు.

 మహిళా కూలీలకు ప్రత్యేకంగా శిక్షణ..
మహిళా కూలీలకు సైతం కుట్లు, అల్లికలు, ఎంబ్రా యిడరీ, పచ్చళ్లు, అప్పడాల తయారీ, మొక్కల పెంపకం. పిల్లల సంరక్షణ వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తారు. శిక్షణ పొందినవారు సంఘాలుగా ఏర్పడి షాపులు ఏర్పాటు చేసుకునేందుకు సాయం అందిస్తారు. ఉపాధి హామీ కూలీలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంపై సత్వరమే అన్ని రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
 మండలాల వారీగా ఉన్నతి శిక్షణకు..
రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలలో ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనిదినాలు పూర్తిచేసిన 1,89,913 కుటుంబాలకు చెందిన అభ్యర్థులను గుర్తించి అధికారులు.. 3844 మందిని ఉన్నతి శిక్షణ కార్యక్రమాలకు ఎంపిక చేశారు. వీరికి కెవికె, ఆర్‌ఎస్‌ఈటిఐ, డిడియు-జికెవై సంస్థల ఆధ్వర్యంలో పదిహేను రోజుల వ్యవధి నుంచి మూడు నెలల వరకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నారు. అభ్యర్థుల కనీస విద్యార్హత ఐదో తరగతి నిర్ణయించారు. పదో తరగతి, ఆపై చదువులు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించునున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News