Monday, March 10, 2025

శ్వేత రుధిరం

- Advertisement -
- Advertisement -

మూలకు కూర్చోవడానికో
ముడుచుకు పడుకోవడానికో
మూడు రోజుల ముట్టుడూ కాదు.
క్రమం తప్పకుండా వచ్చే ఋతుక్రమమూ కాదు..
అక్రమంగా వచ్చే తప్పనిసరి ముప్పు..
అయినవాళ్ళతో నైనా అనలేని అవస్థది..
ఉల్లిపాయ పొరలు ఒలిచినట్టు చిట్లుతున్న చర్మం..
ప్రమాదమని పసిగట్టలేని తెల్ల రక్తం..
క్రిముల మూకుమ్మడి దాడికి
కిక్కురు మనలేక..
దాగుడు మూతల తొండి ఆటలోలాఅందరి కళ్ళు గప్పి నిజానికి నిప్పు పెట్టడమే..
కూర్చున్న చోట కుప్పకూలలేక
నిల్చున్న చోట నిస్త్రాణమవలేక
బట్టి పట్టిన పాఠాల్లా పనులన్నీ పూర్తి చేయడం..
తెలుపు.. తెలుపు.. ఎర్రని కన్నీళ్లను కూడా
రక్తంలో కలిపేసి ఏ రంగులేదనిపించే
వెలిసిన వెలివేతపు తెల్లరక్తపు పూత..
ఒక్కసారి అడిగి చూడు!
వేళాపాళా లేక వేయించుకుతినే
ఈ తిమిరం నీకు తెలియకపోయినా
తప్పేమిలేదు.. అప్పుడప్పుడు అరిస్తే
అర్థం చేసుకో.. ఎప్పుడైనా గోల చేస్తే
కాస్త గోప్యంగా ఉంచు..
ఒక్కసారి గట్టిగా చెవులు మూసి
ఆమె నిశ్శబ్దపు ఘోషను క్షణకాలం విను..
ఓ సన్నని మూలుగు వినిపిస్తుంది కదూ!!
పెనుగొండ సరసిజ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News