నేడు ఎస్కెఎం అధికారిక ప్రకటన
ప్రధాన డిమాండ్లకు హామీ ఇస్తూ కేంద్రం నుంచి లేఖ
న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లన్నిటికీ హామీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆమేరకు ప్రభుత్వం నుంచి ఓ లేఖ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) ఐదుగురు సభ్యుల కమిటీకి అందినట్టు చెబుతున్నారు. దాంతో, ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనను విరమించే ఆలోచనలో ఉన్నట్టు రైతు సంఘం నేత, ఎస్కెఎం సభ్యుడు ఒకరు తెలిపారు. బుధవారం అధికారికంగా ప్రకటన ఉంటుందని ఎస్కెఎం మరోనేత కుల్వంత్సింగ్ సంధూ తెలిపారు. దాదాపుగా తమ డిమాండ్లన్నిటికీ హామీ ఇస్తూ ప్రభుత్వం నుంచి లేఖ అందిందని ఆయన తెలిపారు. తాము ఏకాభిప్రాయానికి వచ్చామని, తుది నిర్ణయాన్ని బుధవారం ప్రకటిస్తామని సంధూ అన్నారు.
ఇప్పటికే మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కి చట్టపరమైన హామీ, ఆందోళన సమయంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, రైతు ఆందోళనకారులపై క్రిమినల్ కేసులు ఎత్తివేయడమనేవి ఎస్కెఎం ప్రధాన డిమాండ్లు. దేశంలోని 40కిపైగా రైతు సంఘాలకు ఐక్యవేదికగా ఉన్న ఎస్కెఎం తమ తరఫున కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఈ నెల 4న ప్రకటించింది. దాంతో, ఎస్కెఎం ఏర్పాటు చేసిన కమిటీకే కేంద్రం తరఫున లేఖ పంపినట్టు భావిస్తున్నారు.