డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలతో ఎస్‌ఎల్‌బిసి
సొరంగంలోకి వెళ్లిన సహాయక బృందాలు
వాకీటాకీ సిగ్నల్ పరికరాలు, అక్వాఐ, ప్రోబ్
తీసుకెళ్లిన రెస్కూ టీం సమయం గడుస్తున్న కొద్దీ కఠినంగా మారుతున్న సహాయక చర్యలు
200 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, నీరు
వారంతా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నా..
సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు
విశ్వప్రయత్నాలు రెస్కూ టీంకు ఆటంకాలు
వస్తాయనే సిఎం రాలేదు : మంత్రి కోమటిరెడ్డి
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః నాగర్‌కర్నూల్ జిల్లా, దోమల పెంట వద్ద శనివారం ఎస్‌ఎల్‌బిసి సొరంగంపై కప్పు మూడురోజులైనా..అందులో చిక్కుపడిన ఎనిమిది మంది అతీగతీ తెలియడం లేదు. మూడవ రోజు కూ డా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గ ల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడానికి రెస్కూ టీమ్‌లు హైటెక్ సాంకేతిక పరికాలను ఉపయోగిస్తున్నాయి. డ్రో న్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీటాకీలు, అక్వాఐ లాంటి అధునాతన సాంకేతిక పరికరాలతో అన్వేషణ కొనసాగిస్తున్నాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్, మిలటరీ, హై డ్రా బృందాలకు తోడు సోమవారం సాయంత్రం ఆరుగు రు నేవీ సిబ్బందితో కూడిన బృందం దోమలపెంట వద్ద కు చేరుకున్నది.
ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జెపి, నవయుగ కంపెనీలకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఇప్పటివరకు ఏడుసార్లు టన్నెల్‌లో సోమవారం రాత్రి వరకు తనిఖీలు నిర్వహించాయి. ఈ బృందంలో దాదాపు 584 నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తులలో ఈ బృందాలు రెస్కూ ఆపరేషన్‌లను సమర్థవంతంగా నిర్వహించాయి. వీరితో పాటు 14 మంది ర్యాట్ (ర్యాట్ హోల్ టీం) మైనర్ల సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు. సొరంగ మార్గంలో పేరుకుపోయిన బురద, నీటిని తోడే పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ సహాయక బృందాలు ముందుకు సాగుతున్నాయి. సొరంగంలో నీటి ఊట పెరుగుతుండడం, కూలిన మట్టి బురదగా మారి సొరంగంలో పేరుకుపోతుండడం వల్ల సహాయక చర్యలకు ఇబ్బందులు తప్పడం లేదు. సోమవారం ఉదయం లోకో ట్రైన్ ద్వారా జెసిబిని సొరంగంలోకి తరలించే క్రమంలో సాధ్యం కాకపోవడంతో వెనుతిరగాల్సి వచ్చింది.
కన్వేయర్ బెల్ట్ ద్వారానే సాధ్యం
సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించాలంటే కన్వేయర్ బెల్ట్ సహాయమే తప్పనిసరిగా మారింది. టిబిఎం తవ్విన మట్టిని 13.9 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన కన్వేయర్ బెల్ట్ సహాయం ద్వారానే తవ్విన మట్టిన బయటికి పంపిస్తున్నారు. శనివారం జరిగిన ఘటనలో కన్వేయర్ బెల్ట్ సైతం పూర్తిగా ధ్వంసమైంది. కన్వేయర్ బెల్ట్‌ను నడిపే భారీ యంత్రాలు సైతం మట్టిలో కూరుకుపోయాయి. ప్రధానంగా ఇంజనీరింగ్ బృందం కన్వేయర్ బెల్ట్‌ను మరమ్మతు చేయడానికే మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు సమాచారం. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఆదివారమే భారీ జనరేటర్‌ను సొరంగంలోకి తరలిచారు. మన్నెవారిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎల్‌బిసి ఫేజ్ 2 పనుల వద్ద నుండి కన్వేయర్ బెల్ట్‌తో పాటు వాటిని నడిపే భారీ యంత్రాలను సైతం తరలించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం నాటికి కన్వేయర్ బెల్ట్ పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. టన్నెల్ బోరింగ్ మెషీన్‌కు ఆనుకుని ఉన్న భారీ ఉక్కు పైపులు పూర్తిగా ధ్వంసం కావడంతో సొరంగ మార్గంలో టిబిఎం మెషీన్ వద్దకు వెళ్లడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారీ గ్యాస్ కట్టర్ల ద్వారా వాటిని తొలగించే పనులు కూడా సాగుతున్నట్లు సమాచారం.
ర్యాట్ హోల్ మైనర్స్…ఆక్వా ఐ…ఫ్లెక్సీ ప్రోబ్‌తో సహాయక చర్యలు
సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడంలో భాగంగా గతంలో ఉత్తరాఖాండ్ తదితర ప్రాంతాల్లో సొరంగం మార్గాలను జరిగిన ఘటనల ఆధారంగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. అక్కడ జరిగిన సంఘటనలు, ఆయా ప్రాంతాలలోని సంఘటనలను అనుగుణంగా ఇక్కడ కూడా వారి సేవలను వినియోగించుకుంటున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో 2023 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో సుమారు 34 మందిని మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం ఆక్వా ఐ, ప్రోబ్ పరికరాలతో బాధితులను గుర్తించి 15 రోజుల తర్వాత కూడా వారిని సురక్షితంగా బయటికి తీసిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ర్యాట్ హోల్ విధానంతో దోమలపెంట వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి వారి సేవలను వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కానీ ఈ విధంగా గట్టిగా ఉన్న మట్టి సొరంగాలు, బొగ్గు గనులలో మాత్రమే వర్తింస్తుందని అభిప్రాయపడుతున్నారు. దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో 8 మంది చిక్కుకున్న ఘటనకు సంబంధించి సొరంగంలో నీటి ఊట అధికంగా ఉండడం, మెత్తటి మట్టి ఉండడంతో కూలిన ప్రాంతమంతా బురదమయంగా ఉంది.
దీంతో ఈ ప్రాంతంలో ర్యాట్ హోల్ మైనర్స్ విధానం అవలంభించడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. సొరంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని ఇంజనీర్లు భావిస్తున్నట్లు సమాచారం. బురదలో ఎలుకలు పెట్టిన విధంగా చిన్నపాటి సొరంగాలు తవ్వుకుంటూ పోవడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ర్యాట్ హోల్ విధానం కూడా ఇక్కడ అనుకూలంగా ఉండదని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఎల్‌బిసి పనుల కార్మికుల ద్వారానే కన్వేయర్ బెల్టులను సరిచేసి పేరుకుపోయిన మట్టితో పాటు లోకో ట్రైన్ ద్వారా గ్యాస్ కట్టర్ల ద్వారా తొలగించిన ఇనుమును బయటికి పంపితే తప్ప టిబిఎం వద్దకు చేరుకుని సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడం సాధ్యం కాదని చెప్పవచ్చు. ఎస్‌ఎల్‌బిసి కార్మికుల ద్వారానే పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఆ ఒక్క మార్గమే సరైనదిగా వారు భావిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా మూడు రోజులుగా టిబిఎం మిషన్ వద్ద చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల పరిస్థితి పైనే సర్వత్రా ఆందోళన నెలకొంది. సొరంగంలోని ఖాళీ భాగంలోనే ఆక్సిజన్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయని మట్టిదిబ్బల ముందు ఇరుకున్న ఎనిమిది మంది పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రెండు రోజులుగా సహాయక చర్యలో నిమగ్నమైన బృందాలకు సోమవారం నేవి బృందం తోడు కావడం మరో ఆరుగురు మంగళవారం రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డితో పాటు జానారెడ్డి, అచ్చంపేట, దేవరకొండ ఎ ంఎల్‌ఎ లు వంశీకృష్ణ, బాలు నాయక్ పర్యవేక్షించారు. టన్నెల్‌లో ఉన్న వా రి ఆచూకి తెలుసుకునేందుకు స్నిప్పర్ డాగ్స్‌లను కూడా రప్పించారు. అయితే నీరు ఉన్నందున ఈ స్నిప్పర్ డాగ్స్ లోపలికి వెళ్లలేకపోయాయి. కాగా, టన్నెల్‌లోపలికి పైనుండి రంధ్రం చేసి లోపలికి వెళ్లాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్) ప్రతిపాదనను తోసిపుచ్చారు. 5 గ్యాస్ కట్టింగ్ మిషన్లు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి.
సహాయ కార్యక్రమాలను మంత్రి కోమటిరెడ్డి దోమలపెంట ప్రాజెక్టు సైట్‌లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సా యంత్రం జెపి కార్యాలయంలో సహాయ కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విపత్తు ల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, స్థానిక ఎంఎల్‌ఎ డాక్టర్ వంశీకృష్ణ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆర్మీ, నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎంఓఆర్‌టిహెచ్, నవయుగ, ఎస్‌సిసిఎల్, జెపి సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం విలేకరులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. టన్నెల్‌లో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికి వారు సజీవంగా ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న ఒక అధికారి మొబైల్ ఫోన్ రింగ్ అయ్యిందని, దాని ప్రకారం సిగ్నల్‌తో వారి లొకేషన్ గుర్తించామన్నారు.