కొలంబో: లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్ దనుష్క గుణతిలకను శ్రీలంక క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్స్ దశలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన ధనుష్క గాయపడ్డాడు. దీంతో టోర్ని మొత్తానికి దూరమయ్యాడు. అయితే, ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిచయమైన ఓ 29ఏళ్ల మహిళను ఈ నెల 2న రోజ్‌బేలోని నివాసంలో ధనుష్క కలిశాడు. ఆ సమయంలో ధనుష్క తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శనివారం అర్ధరాత్రి తర్వాత ఒంటిగంటకు సస్సెక్స్ స్ట్రీట్‌లోని హోటల్‌లో ధనుష్కను పోలీసులు అరెస్టు చేసి సిడ్నీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, ఇంగ్లండ్ చేతిలో ఓడిన లంక, సెమీస్ అవకాశాలు కోల్పోవడంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దనుష్క లేకుండానే జట్టు సభ్యులు స్వదేశానికి పయనమయ్యారు. ధనుష్క అరెస్టుపై స్పందించిన లంక క్రికెట్ బోర్డు అతనిపై వేటు వేసింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి ధనుష్కను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు బోర్డు పేర్కొంది. కాగా, 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ ధనుష్క గత ఏడేళ్లుగా శ్రీలంకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
SLC Suspends Danushka from all formats of cricket