పసులను మేపుతూ/ కంచెలో నిద్రపోయి అర్దరాత్రి అధాటున మేల్కొని /భయం రాగంలో అమేయంగా ఉచ్చైస్వరమెత్తి/ దిగులుగా దిగులుగా చీకటి బాయిడొంకల నడుస్తున్నప్పుడు దేవులాడుకుంటూ వచ్చి/ అభయమై నన్ను గుండెలకు హత్తుకున్న నాన్న/కలలో ఒకసారి అగుపడితే బాగుండును-/ పచ్చగా ప్రాచీనావతారమెత్తిన చెట్లు
ఆకు తలలతో జీవాల క్షుత్తులార్చిన ఆహారపర్వంలో
భూశాస్త్రజ్ఞులై సమస్త గడ్డిమైదానాలపై
నన్నో పూలగొంగడిలా పరచిన
మా సారిగొల్లలు నర్సయ్య తిరుపతయ్యతాతలు
కలలో ఒకసారి ఎదురుపడితే బాగుండును-
ఎన్ని పుణ్యాలు చేస్తేనో సాధ్యంకాదు
ఆమెకు మనవడుగా పుట్టడం/ అక్కా! నీ చేయి మంచిది సదా రక్షాబంధనం/లేవనకు బారాణాపైసలు చాలు
ఇది కొత్త తాను తొల్త ముక్క మీ నర్సింహులుకేనని
సాలె శివకోటి కుట్టిచ్చిన చమ్కీల అంగీ తీసుకుని
కొయిగూరోల్ల మూలమలుపు తిరిగే దేవప్రతిమ
కలలో అమ్మమ్మ ఒకసారి కనపడితే బాగుండును-
ఊరు వర్ధమానుకోట పేరు నర్సమ్మ రామయ్య
మనసు మందగంప నిండా బెల్లప్పలు పేర్చుకొని
బస్తాలో రెండు పెద్దకోడిపుంజుల్ని చుట్టుకొని
ఏటవతలి ప్రేమను నెనరు శిఖరాలై/ ప్రతి ఎండాకాలం ఇంటికి తోలుకొచ్చే / పెద్దమ్మ పెద్దనాయన కలలో /ఒకసారి బండిడిస్తే బాగుండును-/ టెన్త్ పరీక్షల యుద్ధం ముగిసినంక
లింగక్క ఎన్నాళ్లనుంచో రమ్మంటుందని
మురిపెం సైకిలెక్కి ఇమాంపేటకు పోతుంటే
సూర్యాపేట పోస్టాఫీస్ పక్కన స్టార్ బుక్ స్టాల్
అక్షర సమ్మోహనం/ ఏం అబ్బాయ్ ! చదివే అలవాటుందా ఇవి ప్రపంచాన్ని మార్చిన పుస్తకాలంటూ కితాబిస్తూ
మారక్స్‌ఎంగెల్స్ సంకలిత రచనల్ని చేతికిచ్చిన
ఎన్.జి.రెడ్డి ఎర్రగొంతు/ కలలో ఒకసారి చేరదీస్తే బాగుండును-/ నాటకమే అద్భుతం/ అందునా ’నరకంలో లంచం’ మహాద్భుతం/ఓ ముసల్దాన ! రాత్రి యమునోడు ఊళ్లెకు వచ్చిండు కద ఇన్నాళ్లు మంచిగున్న పెద్దముసలోడు
ఇయ్యాల మనిడిసింది అందుకేనని నటనాభిమాని
కల్పితం చెప్పంగ నమ్మి ఇదేం పాపం? నా బొట్టుతుడిచినవని/ నిలదీసిన నిలువెత్తు ప్రకోపం తిమ్మాపురం అవ్వ
కలలో ఒకసారి కయ్యానికి దిగితే బాగుండును-
కుల పురాణాలు మహిమాన్వితాలు
పొద్దూకాల పొడపోతుల అంజయ్య కొమ్ము ఊదినాడంటే కాటమరాజు కచ్చీరు ఎక్కినట్టే/ ఉరుకొచ్చి వెన్నెల కింద కూర్చునే జనం/ ఊకొట్టి లింగని కథకు వంతపాడే ముత్తమ్మ హాస్యం/దరువు మధ్యలో వంశకీర్తనకు తెరలేపి
దండెకడెంతోపాటు పిల్లగొర్రెను చదివించిన
వల్లాల తాత ్ యుగదాతృత్వం/ కలలో ఒకసారి తారసపడితే బాగుండును -/ ’ఇక్కడి పిడికెడు మట్టిని పిండిచూడు
కడివెడు కన్నీళ్లో రక్తమో కారుతుంటాయి’ వాక్యాల్ని మెచ్చి/ ’నేలకు తగిలిన వేలగాయాల సంస్మరణ’ఇతని కవిత అంటూఆనం కళాకేంద్రం అశేషజన సంద్రంలో
మయూరి కళాసమితి ఉత్తమ కవితా పురస్కారాన్నందించిన ’వెలుతురు పిట్టల’ కవిముని కొత్తపల్లి
రాజమహేంద్రవర సత్యాలింగనం స్వస్థానమిత్రుడు
కలలో ఒకసారి ్‌ఆశీర్వదిస్తే బాగుండును-
కాలం చాలా వెనక్కి వెళ్లిన/ కల ఒకటి వస్తే బాగుండును
డాలర్ ముంపులో రూపాయి అలజడిలా కాకుండా
మెట్రోలిఫ్ట్ లో హైటెక్ సిటీ వెక్కిళ్లలా కాకుండా
మనుషులు మునుంపట్టి కోసే పొలం/ మమతలు తీగసాగి ఎదిగే కులం/ కోటబురుజు దాపున జుర్రిన జుంటితేనె
కుమ్మరికుంట సోల్పు వరదల పట్టిన బుడ్డపరకలు
గోగులష్టం నాడు ఎగిరి కొట్టిన ఉట్టి/ గుడివాడ తిరునాలలో తగిలిన దిష్టి/ ఇత్తడిచెంబు అంచులు దుంకిన ఎల్లావుపాలు
ఇడుపుల మొగురాలకు ఊయలైన అమ్మపాట/ ఇట్లా నా అనేకానేకంలో/ కాలం చాలా వెనక్కి వెళ్లి ఈ రాత్రి/ ఏదైనా ఒక కల వస్తే బాగుండును.
—