Wednesday, January 22, 2025

విమానంలో మరోసారి మూత్ర విసర్జన ఘటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎయిరిండియా మూత్ర విసర్జన వివాదం ఇంకా మరువక ముందే అదే తరహా ఘటన మరొకటి వెలుగు లోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ లో ఓ ప్రయాణికుడు పక్కనే కూర్చున్న మరో వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. ఎఎ292 నంబర్‌తో ఉన్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ విమానం శుక్రవారం న్యూయార్క్ నుంచి రాత్రి 9.16 గంటలకు బయలుదేరింది. దాదాపు 14 గంటల ప్రయాణం తరువాత ఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. నిందితుడు అమెరికా లోని ఓ విశ్వ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థి. తమకు అందిన ఫిర్యాదు ప్రకారం … మూత్రం పోసిన సమయంలో అతడు తాగిన మైకంతో నిద్రిస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ విమానాశ్రయ అధికారి తెలిపారు.

ఆ మూత్రం పక్కనే ఉన్న తనపై పడ్డట్టు తోటి ప్రయాణికుడు వెంటనే విమాన సిబ్బందికి తెలియజేశాడు. అయితే బాధితుడు మాత్రం దీన్ని పోలీస్‌ల వరకు తీసుకెళ్లాలని భావించలేదని సమాచారం. నిందితుడు క్షమాపణలు చెప్పడంతో పాటు ఇది వివాదంగా మారితే తన కెరీర్‌కే ముప్పని ప్రాధేయ పడ్డట్టు తెలుస్తోంది. కానీ విమాన సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని వెంటనే పైలట్ ద్వారా ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) దృష్టికి తీసుకెళ్లారు. ఏటీసీ అధికారులు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్ కాగానే నిందితుడ్ని సిఐఎస్‌ఎఫ్ అదుపు లోకి తీసుకొని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇరు పక్షాల వాదనలు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు సమాచారం.

పౌర విమానయాన నిబంధనల ప్రకారం ఏ ప్రయాణికుడైనా దురుసుగా ప్రవర్తించినట్టు తేలితే క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అలాగే నిర్ణీత సమయం పాటు విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తారు. 2022 నవంబరు 26 న కూడా ఇదే తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి ఓ పెద్దావిడపై మూత్ర విసర్జన చేశాడు. అయితే ఆ విషయం దాదాపు నెల రోజుల తరువాత వెలుగు లోకి వచ్చింది. తర్వాత నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. దాదాపు నెల రోజులు జైల్లో గడిపిన అతడు ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చాడు. నాలుగు నెలల పాటు విమానాల్లో ప్రయాణించకుండా అతడిపై నిషేధం విధించారు. మరోవైపు ఘటన జరిగిన 12 గంటల్లోగా ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురానందుకు ఎయిరిండియాపై డీజీసీఎ రూ. 30 లక్షల జరిమానా విధించింది.

స్టూడెంట్ భవిష్యత్ ప్రయాణాలపై నిషేధం ..
మూత్ర విసర్జన చేసిన భారత స్టూడెంట్‌ను భవిష్యత్‌లో తమ విమానాల్లో అనుమతించబోమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. మూత్ర విసర్జనే కాకుండా అంతకు ముందు అతడు సిబ్బందితోనూ వాగ్వాదానికి దిగినట్టు పేర్కొంది. సిబ్బంది ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా తోటి ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినట్టు తెలిపింది. మరోవైపు సదరు వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ పోలీసులు సైతం ధ్రువీకరించారు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News