Wednesday, January 22, 2025

ప్రతిపక్షాల ఐక్యతా నినాదం!

- Advertisement -
- Advertisement -

Slogan of unity of the opposition

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి బిజెపి ఎన్నిక కావడం దేశంలోని ప్రతిపక్షాలకు ఒకింత నిరాశ కలిగించాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దేశంలో ఇక బిజెపి బలహీనపడుతున్నదని, ఓటర్లపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం తగ్గుతున్నదనే అంచనాతో పరుగులో ఎవ్వరు ముందుండే ప్రధాని పదవిని అందుకోవాలో అనుకొంటూ పలువురు ప్రతిపక్ష నాయకులు తొందరపడ్డారు. ఎవ్వరికీ వారుగా తన నాయకత్వంలో కూటములకు ఎత్తుగడలు వేస్తూ వచ్చారు. మార్చి లోనే బిజెపియేతర ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి వారు ప్రకటించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వారెవ్వరూ ఆ విషయమై మాట్లాడటం లేదు.

బిజెపిని ఓడించాలి అంటే ప్రతిపక్షాలు మరింతగా కసరత్తు చేయాలి అంటూ ఫలితాల అనంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హితవు చెప్పారు. తాజాగా, మరోసారి బిజెపియేతర పార్టీల కూటమి అవసరమంటూ ఒక్కొక్కరు మాట్లాడటం ప్రారంభించారు. మొదటగా కేరళలో జరుగుతున్న సిపిఎం కాంగ్రెస్ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ పిలుపిచ్చారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఒంటరి చేయడం కోసం అందరూ కలవాలని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అప్పటి వరకు వామపక్షాలు ఏవీ ఉమ్మడి కూటమి పట్ల ఆసక్తి చూపడం లేదు.

ఏచూరి ప్రకటన చేసిన రెండు రోజులకు మొదటిసారిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహితం బిజెపియేతర శక్తుల కూటమి ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని, దాని స్వరూపం ఏ విధంగా ఉండాలో చర్చిస్తున్నామని ప్రకటించారు. మొదటిసారిగా కాంగ్రెస్ నుండి అటువంటి ప్రకటన రావడం గమనార్హం. ఇప్పటి వరకు బిజెపి బలహీనపడితే ఎట్లాగూ తమకే అధికారం అనే ధీమాతో కాంగ్రెస్ నేతలు ఉంటూ వచ్చారు. మొదటిసారిగా, యుపిఎ కాకుండా మరో విస్తృత కూటమి అవసరాన్ని గుర్తించినట్లు కూడా ఆయన ప్రకటన వెల్లడి చేస్తుంది. ప్రతిపక్షాల బలహీనతలే బిజెపికి బలంగా మారుతున్నట్లు యుపితో సహా అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తుండటం నుండి వీరు గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ అనుసరిస్తున్న ‘పెద్దన్న’ ఆధిపత్య ధోరణి కారణంగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కెసిఆర్ వంటి వారు తమ దారి తాము చూసుకోవాలనే ఆలోచనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

కేవలం ఈ అవగాహన సీట్ల సర్దుబాటుకు మాత్రమే పరిమితం కాకూడదని, విధానపరంగా ఉమ్మడి వైఖరి అనుసరించడంతో పాటు, ప్రజా సమస్యలపై ఉమ్మడి ఆందోళనలు చేపట్టడం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసం చూరగొనగలరని గ్రహించవలసి ఉంటుంది. పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. భారత్‌లో పరిస్థితులు సహితం అందుకు భిన్నంగా లేవు. ప్రజల నుండి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్‌పిజి గ్యాస్ ధరలు భారత్‌లో ఉన్నాయి. పెట్రోల్, డీసెల్ ధరలు సహితం ఆందోళలనకరంగా ఉన్నాయి. వీటి ధరల ప్రభావం మిగిలిన అన్ని వస్తువులపై పడుతుంది. మరోవంక, ఆర్ధిక వృద్ధి ఆందోళనకరంగా ఉండగా, ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తిలో చెప్పుకోదగిన పురోగతి సాధింపలేకపోతున్నాము. దానితో ఉద్యోగ కల్పన తగ్గిపోతున్నది. ప్రపంచంలో మరే స్వేచ్ఛా ఆర్ధిక విధానాలు అనుసరించే దేశాలలో లేని విధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ‘సరళీకృత’ విధానాలు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు, అంటే ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలలో పారదర్శకత ఉండడం లేదు.

వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, దేశ ఆర్ధిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకువెడతాం అంటూ ఇదివరలో ఘనంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పుడు ఆ విషయాలే ప్రస్తావించడం లేదు. కనీసం నీతి ఆయోగ్ వంటి సంస్థలలో ఎవ్వరు అటువంటి ఆలోచనలు జరుగుతున్నట్లు, ప్రణాళికలు రూపొందించినట్లు కూడా చెప్పడంలేదు. మన ఎగుమతులు 400 మిలియన్ కోట్లకు చేరుకున్నాయని ప్రచారం చేసుకొంటున్న నేతలు దిగుమతులు కూడా పెరగడం గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. చైనాపై వాణిజ్య వ్యవహారాలలో ఆధారపడటం దేశ భద్రత దృష్ట్యా ప్రమాదకరం అని గతంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌తో సహా పలువురు హెచ్చరించారు. కానీ చైనా నుండి దిగుమతులు గరిష్ఠంగా పెరుగుతూనే ఉన్నాయి. వాటిని తగ్గించే వ్యూహం లేదా ప్రణాళిక ప్రభుత్వంలో కనబడటం లేదు. మరోవంక మన విద్యుత్ గ్రిడ్ లపై చైనా హాకర్స్ కన్నుపడినట్లు గత ఏడాదే స్వయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వం నుండి తగు స్పందన ఉండటం లేదు.

తాజాగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని హిందీయేతరులు కూడా వాడాలని హోం మంత్రి అమిత్ షా అంటే డిఎంకె నేతలు తప్ప మరెవ్వరూ తగురీతిలో స్పందించిన దాఖలాలు లేవు. బంగ్లాదేశ్ పాకిస్థాన్ నుండి విడిపోవడానికి ప్రధాన కారణంగావారి బెంగాల్ భాషను కాదని ఉర్దూను అక్కడి ప్రజలపై రుద్దే ప్రయత్నం కర్కశంగా నాటి పాకిస్థాన్ ప్రభుత్వం చేయడమే అనే అంశాన్ని ఈ సందర్భంగా మరచిపోవడం ప్రమాదకరం కాగలదు. హిందీని కేవలం అనుసంధాన భాషగా మాత్రమే రాజ్యాంగంలో పేర్కొన్నారు. రాజ్యాంగంలో గురించిన అన్ని భాషలు కూడా జాతీయ భాషలే. హిందీని ఇతర రాష్ట్రాలపై రుద్దే సమయంలో హిందీ రాష్ట్రాలలో ఇతర భాషలకు ఎటువంటి ఆదరణ లభిస్తుందో గుర్తించవలసి ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే త్రిభాషా సూత్రం ఏర్పాటు చేసుకున్నాం. కానీ క్రమంగా ఆ సూత్రాన్ని సమాధి చేసాము.

ఇటువంటి సున్నితమైన అంశాలపై కూడా ప్రతిపక్షాలు ఉమ్మడిగా విధానాలు రూపొందించుకోగలవా? అదే నేటి అసలు సమస్య. ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మౌనంగా ఉంది, ఎన్నికల ముందు ఎంతగా హడావుడి చేసినా అఖిలేష్ యాదవ్ ప్రయోజనం పొందలేకపోవడం అన్ని రాజకీయ పక్షాలకు ఒక హెచ్చరిక కావాలి. నేడు రాజకీయాలు పార్ట్‌టైం వ్యవహారం కావని గుర్తించాలి. ఇక ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం మొదటి నుంచి సందేహాస్పదంగా కనిపిస్తున్నది. ఆయన ఎక్కడ పోటీ చేసినా బిజెపిని బలోపేతం చేసేందుకు లేదా బిజెపియేతర పక్షాలను బలహీనం చేసేందుకు మాత్రమే దారితీస్తున్నది.

ఈ సందర్భంగా ఎన్‌సిపి అధినేత శరద్‌పవర్ వంటి వారు మాత్రమే సూత్రబద్ధమైన వైఖరి అవలంబిస్తున్నారని చెప్పవచ్చు. వయసు రీత్యా కావచ్చు లేదా తన పార్టీ పరిధి అంత విస్తృతంగా లేకపోవడం వల్లన కావచ్చు యుపిఎకు గాని, మరే ఇతర ప్రతిపక్ష కూటమికి గాని నాయకత్వం వహించబోనని తేల్చి చెప్పారు. వాస్తవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆయనకు చాలా మంది బిజెపి నాయకులకు లేనంతటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా విధానపరంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా చెప్పారు. బిజెపి ఓటమికి తన వంటి కృషి చేస్తానని కూడా చెప్పారు. బిజెపి ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా మహారాష్ట్రలో ప్రస్తుతం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్లకు పైగా, ఒడిదొడుకులు లేకుండా అధికారంలో కొనసాగడానికి ఆయన మార్గదర్శకత్వమే కారణం అని చెప్పవచ్చు.

కేంద్ర నిఘా ఏజెన్సీలను ఉపయోగించి కొన్ని కీలక ప్రతిపక్షాలను బిజెపి దారిలోకి తెచ్చుకోకలుగుతున్నది. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్ లో 2019 ఎన్నికలలో అఖిలేష్ తో కలసి 10 సీట్లు గెల్చుకున్న బిఎస్‌ఫి అధినేత్రి మాయావతి, వెంటనే జరిగిన మూడు లోక్‌సభ ఉపఎన్నికలలో సహితం బిజెపిని ఓడించగలిగారు. యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన ఘోరఖపూర్ లోక్‌సభ స్థానంలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యతతో బిజెపిని ఓడించారు. ఆ వెంటనే ఆమె తమ్ముడిపై ఆదాయపన్ను శాఖ దాడులు జరగడం, ఆ తర్వాత ఆమె అఖిలేష్ తో పొత్తును ఏకపక్షంగా రద్దు చేసుకోవడం చూసాం. మొన్నటి ఎన్నికలలో తన పార్టీకి నాలుగు సీట్లు గెలిపించుకోవడం కోసం కాకుండా ప్రతిపక్ష అభ్యర్థులను ఓడించే విధం గా తన పార్టీ సీట్లు ఇచ్చారు.

కానీ గత ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు మమతా బెనర్జీ మేనల్లుడు, ఇతర ప్రముఖులపై ఇదే విధంగా కేంద్ర ఏజెన్సీలు దాడులు జరిపినా టిఎంసి బెదిరిపోలేదు. తమిళనాడు ఎన్నికల సమయంలో సహితం ఇటువంటి ఎత్తుగడలు కేంద్రం వేసినా డిఎంకె నాయకులు ఖంగు తినలేదు.ఇప్పుడు మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేశారు. అనేక మంది కీలక నాయకులపై కేసులు పెడుతున్నారు. అయినా అక్కడ ఎవ్వరూ భయపడుతున్న దాఖలాలు లేవు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కేంద్ర ఏజెన్సీలు అరెస్ట్ చేయబోతున్నాయని అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తరచూ ప్రకటనలు చేస్తున్నారు. అయినా ఇక్కడ అధికార పక్షం భయపడిన దాఖలాలు లేవు.

కేంద్రం నుండి ఎదురయ్యే వత్తిడులు, బెదిరింపులను ఎదుర్కోవడానికి సహితం ప్రతిపక్షాలు మానసికంగా సిద్ధం కావాలి. ఆయా అంశాలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నించగలగాలి.తాను బిజెపిలో చేరడంతో సుఖంగా నిద్రపోగలుగుతున్నానని మహారాష్ట్రలో ఒక ఎంపి పేర్కొనడం గమనార్హం. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది నాయకులు బిజెపిలో చేరగానే వారిపై ఎటువంటి చర్యలను కేంద్ర ఏజెన్సీలు తీసుకోవడం లేదు. మహారాష్ట్రలో బిజెపి మాజీ ఎంపి కిరీటి సోమయ్యపై కేసు ఏమయినదని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించడంతో రాజ్యసభను చివరి రోజున అర్థాంతరంగా వాయిదా వేశారు. కేవలం బిజెపిని నిందించడం కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల ముందుంచి, వారి విశ్వాసం పొందే ప్రయత్నం ప్రతిపక్షాలు చేయగలగాలి. అప్పుడే కూటముల ఏర్పాటు విజయవంతం కాగలదు.

* చలసాని నరేంద్ర- 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News