Sunday, November 17, 2024

మూతపడుతున్న చిన్న పరిశ్రమలు

- Advertisement -
- Advertisement -

దేశ పాలకులు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల ఫలితంగా వ్యవసాయ ఆధారిత, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభానికి గురై అనేకం మూతపడుతున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలు ఉపాధికి దూరమవుతున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక ఆదాయంలో, ఉపాధి కల్పనలో కీలకంగా ఉన్నాయి. ఇలాంటి పరిశ్రమలు విస్తృతమై నిలదొక్కుకున్నప్పుడే ఉపాధి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇందుకు పాలకుల విధానాలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి.

చిన్న తరహా పరిశ్రమలు ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉంటాయి. ఇవి వస్తు తయారీకి చిన్న యంత్రాలను ఉపయోగించటం, కొద్ది మంది కూలీలు మాత్రమే వీటిల్లో ఉంటారు. వీటి ఏర్పాటుకు కోటి లేక రెండు కోట్ల వ్యయం సరిపోతుంది. ఈ పరిశ్రమలు దేశ ఆర్ధిక వ్యవస్థకు మూలాధారమైనవే కాకుండా తలసరి ఆదాయాన్ని స్థిరీకరింటానికి దోహదపడతాయి. ఇవి స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగిస్తాయి. ఇవి స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపడేందుకు దోహదపడతాయి. దేశం మొత్తం వస్తువుల, సేవలలో 40% వాటా ఈ రంగం కలిగి ఉంది. ఎగుమతి చేయబడిన మొత్తం వస్తువుల్లో 50% చిన్న పరిశ్రమల ద్వారానే జరుగుతున్నది. ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలక పాత్ర వహిస్తున్నాయి.

పేపర్ బ్యాగ్‌లు, లెదర్, చిన్న బొమ్మల తయారీ పరిశ్రమలు, వాటర్ బాటిల్స్, బేకరీ, ఊరగాయల తయారీ, అగర్ బత్తుల తయారీ, పేపర్ పేట్ల తయారీ, కొవ్వుత్తుల తయారీ పరిశ్రమలు చిన్న పరిశ్రమలగా ఉన్నాయి. చెరకు, జిన్నింగ్, జీడి, బాయిల్ రైస్ మిల్లులు, దాల్ మిల్లులు, వ్యవసాయ ఆధారిత మధ్య తరహా పరిశ్రమలగా ఉన్నాయి. దేశంలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమల రంగంలో 36 మిలియన్ యూనిట్లు ఉండగా, 80 మిలియన్ల (8 కోట్లు) మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 6 వేల ఉత్పత్తులతో జిడిపిలో 8% వాటా కలిగి ఉంది. ఎగుమతుల ద్వారా 2013 -14లో రూ. 1400 కోట్లు, 2015- 16లో రూ. 1900 కోట్లు గడించింది. మొత్తం పారిశ్రామిక ఉద్యోగాల్లో 60% ఈ పరిశ్రమలే కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి సంస్థలగా ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత గల చిన్న పరిశ్రమల రంగం నేడు ఎందుకు సంక్షోభంలో ఉంది?

అధికారాన్ని చేతులు మార్చుకున్న దేశీయ పాలకులు దేశ ప్రజల అవసరాలను తీర్చే పారిశ్రామిక విధానాలు అమలు జరపకుండా సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు అనుగుణంగా భారీ పరిశ్రమల వైపు మొగ్గు చూపారు. చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాన్ని విస్తరించే విధానాలను మాటలకే పరిమితం చేశారు. దేశంలో పారిశ్రామిక విధాన నివేదిక (ఐపిఆర్) దేశం మొత్తం పారిశ్రామిక విధానం ప్రకటించింది. దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను అమలు జరుపుతామని అందులో చెప్పారు. అందుకు అనుగుణంగా తొలి పారిశ్రామిక తీర్మానాన్ని 1948 ఏప్రిల్ 6న పరిశ్రమల మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రకటించారు. ఇందులో పరిశ్రమలను నాలుగు రకాలగా వర్గీకరించారు. ఒకటి ప్రభుత్వ పరిశ్రమలు: దేశ రక్షణ, దాని అనుబంధ పరిశ్రమలు ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, అణుశక్తి, రైల్యేలు ప్రభుత్వ పరిశ్రమలగా ఉంటాయి. మిశ్రమ రంగలో పరిశ్రమలు: టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్లెస్, ఇనుము, ఉక్కు, బొగ్గు, విమానాల ఉత్పత్తి, నౌకా నిర్మాణం, మినరల్ ఆయిల్స్. వీటిని పది సంవత్సరాల వరకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలే నిర్వహిస్తాయి. ఆ తర్వాత జాతీయం చేయటం గురించి పరిశీలిస్తారు. ప్రభుత్వ రంగ అజమాయిషీ పరిశ్రమలు: భారీ రసాయనాలు, భారీ యంత్రాలు, యంత్ర పరికరాలు, పంచదార, సిమెంట్, కాగితం మొదలగు 18 పరిశ్రమల్లో ప్రైవేట్ రంగాన్ని అనుమతించినా, ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది.

ఈ పారిశ్రామిక విధానాన్ని పరిశీలించినప్పుడు రక్షణ రంగ పరిశ్రమలు తప్ప మిగతా కీలక పరిశ్రమలను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయి. ఫలితంగా దేశ పారిశ్రామిక రంగం సామ్రాజ్యవాదులకు, వారికి దళారీలుగా ఉన్న టాటా, బిర్లాల వంటి వారికి పాలకులు అప్పగించారు. 1948 నివేదిక కొనసాగింపుగానే 1956 చేసిన పారిశ్రామిక నివేదిక ఉంది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వ పరిశ్రమల మంత్రి జార్జి పెర్నాండెజ్ ప్రవేశపెట్టిన నివేదికలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పబడింది. 50 వేల జనాభా కంటే తక్కువ జనాభా గల పట్టణాల్లో లక్ష రూపాయల పెట్టుబడి పరిమితి గల పరిశ్రమలను సూక్ష్మ పరిశ్రమలగా పేర్కొంది.

చిన్న పరిశ్రమల పెట్టుబడిని రూ. 10 లక్షలకు, దాని అనుబంధ పరిశ్రమల పెట్టుబడిని రూ. 15 లక్షలకు పెంచారు. వీటికి కేటాయించిన పరిశ్రమలను 180 నుంచి 807 కు పెంచారు. 1980లో ఇంధిరా గాంధీ ప్రభుత్వం విదేశీ ప్రైవేట్ పెట్టుబడిని ఆహ్వానించింది. సూక్ష్మ పరిశ్రమలకు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలు, చిన్న పరిశ్రమలకు రూ. 10 నుండి రూ. 20 లక్షలకు, అనుబంధ పరిశ్రమలకు రూ. 15 నుంచి రూ. 25 లక్షలకు పెట్టుబడిని ప్రకటించింది. 1991లో పివి నరసింహరావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి మన్‌మోహన్ సింగ్ ద్వారా పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఇందులో లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ రంగానికి కేటాయించిన 17 పరిశ్రమలను 8కి తగ్గించింది. పరిశ్రమల్లో ప్రభుత్వ రంగ పెట్టుబడిని తగ్గించి ప్రైవేట్ పెట్టుబడిని పెంచింది.

1977 జనతా ప్రభుత్వ పాలనలో చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పినా వాటి పెట్టుబడిని రూ. 10 నుంచి రూ. 15 లక్షలకు పెంచడం వలన అంత పెట్టుబడి పెట్టలేక చాలా మంది పరిశ్రమలకు ఏర్పాటుకు దూరమయ్యారు. 1985లో రాజీవ్ గాంధీ నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడం వలన చిన్న పరిశ్రమల్లో సంక్షోభం ప్రారంభమైంది. 1991లో పివి నరసింహరావు పాలనలో చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేట్ పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ రంగానికి కేటాయించిన 17 పరిశ్రమలను ఎనిమిదికి కుదించటం, లైసెన్స్ విధానాన్ని రద్దు చేయటం ద్వారా పారిశ్రామిక రంగం ప్రైవేట్ రంగం ఆధీనంలోకి వెళ్ళింది. విదేశీ పెట్టుబడి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశ్రమల్లోకి ఎక్కువగా ప్రవేశించింది. చిన్న పరిశ్రమలు మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రపంచ వాణిజ్య ఒప్పందం, సరళీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా దేశంలోకి ప్రవేశించి చిన్న పరిశ్రమలు తయారు చేసే రంగంలోకి ప్రవేశించాయి. ఫలితంగా వీటి పోటీకి తట్టుకోలేక చిన్న పరిశ్రమల దారులు సంక్షోభంలో పడ్డారు. మూడు సంవత్సరాల వ్యవధిలో 20 వేల సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమలు మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన పౌల్ట్రీ, జీడి పరిశ్రమలు, జిన్నింగ్, పంచదార, బాయిల్ రైస్ మొదలైన మిల్లులు అనేకం మూతపడటం వలన కార్మికులు నిరుద్యోగులుగా మారటంతో పాటు రైతాంగం నష్టపోతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఇలాగే చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి.

2014లో ఎన్‌డిఎ కూటమి మోడీ ప్రధానిగా ప్రభుత్వ ఏర్పాటు చేసింది. మోడీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి సామ్రాజ్యవాదుల, దేశీయ బడా పెట్టుబడిదారుల, బహుళ జాతి సంస్థల ప్రయోజనాలే ముఖ్యంగా భావించింది. పారిశ్రామిక రంగాన్ని వీరి ప్రయోజనాలకు అనుగుణంగా మార్చింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడికి ద్వారాలు తెరిసింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్ట్టింది. అనేక పరిశ్రమలను మూసివేసింది. వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూత పడ్డాయి. అదానీ, అంబానీ వంటి బడా పెట్టుబడిదారుల సంపదల పెరుగుదలే లక్ష్యంగా పెట్టుకున్నది. గత తొమ్మిది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవ చేస్తున్నది.

ప్రధాని మోడీ ప్రభుత్వ విధానాల వలన 60 లక్షల చిన్న, సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలు, వ్యవసాయ ఆధారమైన పరిశ్రమలు, దుకాణాలు మూతపడ్డాయి. నిరుద్యోగం 45 సంవత్సరాల నాటి గరిష్టానికి చేరింది. ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. దేశంలో వంద మంది ధనవంతులు అత్యంత ధనవంతులయ్యారు. 2022లో 100 మంది ధనవంతుల ఆస్తి రూ. 2 లక్షలు కోట్లు పెరిగి వారి ఆస్తి మొత్తం రూ. 65 లక్షల కోట్లకు చేరింది. దేశంలో 10 మంది కోటీశ్వరుల ఆస్తులు రూ. 31.70 లక్షల కోట్లుకు చేరింది. గౌతమ్ అదానీ ఆస్తి రూ. 12.3 లక్షల కోట్లు ఉండగా, ముఖేశ్ అంబానీ ఆస్తి రూ. 7.21 లక్షల కోట్లుగా ఉంది. తొమ్మిదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం రూ. 120 లక్షల కోట్లు అప్పు చేసింది. మోడీ విధానాల ఫలితంగా 84% ప్రజల ఆదాయం తగ్గింది. 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. విదేశీ అప్పులకు దేశం తాకట్టు పెట్టబడింది. 1948 నుంచి నేటి వరకు ప్రభుత్వాలు అనుసరించిన పారిశ్రామిక విధానాలు దేశ ప్రయోజనాలకు అనుకూలమైనవి కాదు. సామ్రాజ్యవాదుల, స్వదేశీ, విదేశీ బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూలమైనవి. దేశ ప్రజల అవసరాలను తీర్చే వ్యవసాయ ఆధారిత, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కాకుండా, బడా పరిశ్రమల ఏర్పాటు అంటున్నది. దీని ఫలితమే చిన్న పరిశ్రమల మూసివేత, నిరుద్యోగం. దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ ఆధారిత, ప్రజల అవసరాలను తీర్చే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పాలి. పారిశ్రామిక రంగంలో విదేశీ పెట్టుబడులను నియంత్రించాలి. అందుకు విశాల ప్రజా ఉద్యమం అవసరం.

-బొల్లిముంత సాంబశివ రావు, 9885983526.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News