Wednesday, January 22, 2025

కెసిఆర్‌కు చిన్న గది

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ లాబీలో ప్రతిపక్ష నేత కెసిఆర్ ఛాంబర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసింది. ఇన్నర్ లాబీల్లోకి వెళ్లే ద్వారం వద్ద ప్రతిపక్షనేతకు గది ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా ఏళ్లుగా ఇది కొనసాగుతూ వస్తోంది. డిసెంబర్‌లో జరిగిన సమావేశాల సమయంలోనూ ప్రతిపక్ష బిఆర్‌ఎస్ సభ్యులు ఈ గదిని ఉపయోగించుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్ష నేతకు ఆ గది కాకుండా చిన్న గదిని కేటాయించారు. మొ దటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన ఛాంబర్‌ను రెండో సమావేశాలలోపే మార్చారు. విపక్షనేత హోదాలో కెసిఆర్‌కు ఒక గదిని, ఆ పక్కనే భారత్ రాష్ట్ర సమితి శాసనసభ పక్షానికి మరొక గదిని కేటాయించారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే కెసిఆర్ ఛాంబర్‌ను మార్చారంటూ అసెంబ్లీ లాబీలో చర్చ జరుగుతోంది. కాగా.. 39 మంది ఎంఎల్‌ఎలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రతిపక్ష కార్యాలయం కంటే ఇప్పు డు ఇచ్చినది చాలా చిన్నదిగా ఉన్నదని అన్నారు. ప్రతిపక్ష నేతను అవమానించేలా ప్రభుత్వ చర్య ఉందని విమర్శించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత హోదాను తగ్గించే విధంగా వ్యవహరించడం తగదని అన్నారు. స్పీకర్ కోరిక మేరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు ఇచ్చే ఛాంబర్‌ను వదులుకున్నామని దానికి ప్రతిగా ఒక చిన్న గది ఇవ్వటం సమంజసం కాదన్నారు. క్షేత్రస్థాయిలోనూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు ప్రొటోకాల్, ఎస్కార్ట్ ఇవ్వట్లేదని సభాపతికి ఫిర్యాదు చేశారు. గెలిచిన ఎంఎల్‌ఎలను కాదని, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News