నిజామాబాద్ : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి సంకల్ప యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రైతులు కేవలం వ్యవసాయం చేయడమే కాదు.. ఆధునిక భారత నిర్మాణంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని, రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతాల ప్రజలు ఉపాధి అవసరాల కోసం పల్లెలకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రైతులు ఇప్పుడు పంటలు పండించడమే కాదు..చెకు ఉత్పత్తులతో ఇథనాల్ తయారీ చేస్తున్నారని అన్నారు. బియ్యం, మొక్కజొన్న బార్లీ నుంచి ఇథనాల్ తయారీ జరుగుతుందన్నారు. తన వద్ద ఇథనాల్‌తో నడిచే ఆధునిక వాహనాలున్నాయని గడ్కరీ తెలిపారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతి తగ్గి ఆ ఆదాయం రైతుల చేతిలో వెల్లబోతుందన్నారు. నీటి నుంచి కూడా నైట్రోజన్ తయారవుతుందంటే ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా ఎదగాలనే మోదీ కలలు నెరవేరబోతున్నాయని అన్నారు.
గతంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందక ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. మహారాష్ట్రలోని ఇంగోలి వద్ద ఎంపి స్వయంగా పసుపు ఫ్యాక్టరీ స్థాపించారని, ఆ ప్రాంతంలో పసుపు సాగు బాగా పెరిగిందని అందుకే అక్కడ డ్రై పోర్టు నిర్మిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో రవాణా వ్యవస్థను మరింత ఆధునికరిస్తున్నామని, కశ్మీర్ నుంచి కన్యా కుమారి దాకా వేలాది కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రహదారుల కోసం గడిచిన పదేళ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించామని గుర్తు చేశారు. వాజపేయి హయాంలో తానిచ్చిన నివేదిక ఆధారంగానే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన అమల్లోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్రామీణ వ్యవస్థ కుప్పకూలిందని, గ్రామాల నుంచి యువత ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లారని ఆయన గుర్తు చేశారు. స్థానిక ఎంపి ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ .. జిల్లా రైతుల 35 ఏళ్ల పసుపు బోర్డు కలను మోదీ సర్కార్ నెరవేర్చిందని అన్నారు. దేశంలో మూతపడిన అనేక చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించారని, అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ సైతం తెరిపించాలని కేంద్ర మంత్రిని కోరారు.