Tuesday, January 7, 2025

జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్.. చీట్ చేసి చిక్కిన టాపర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ సంచలనంగా సృష్టించగా, ఇప్పుడు ఐఐటిల్లో బిటెక్ సీట్ల భర్తీకి దేశ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సికింద్రాబద్‌లోని ఎస్‌విఐటీ సెంటర్‌లో చింతపల్లి చైతన్య కృష్ణ అనే విద్యార్థి తాను రాసిన జవాబులను వాట్సాప్ ద్వారా మిత్రులకు పంపించాడు.

మొత్తం నలుగురు విద్యార్థులకు జవాబులు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. వారంతా కూడా వివిధ సెంటర్లలో పరీక్ష రాస్తున్నవారే కావడం గమనార్హం. అంటే వారు కూడా పరీక్ష కేంద్రానికి సెల్‌ఫోన్లతో వెళ్లినట్లు తెలుస్తోంది. వారు ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు సమాధానాల కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలిసింది. సికింద్రాబాద్, మల్లాపూర్, మౌలాలి, ఎల్బీనగర్ పరీక్ష కేంద్రాల్లో ఇలాంటి మాస్ కాపీయింగ్ జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు.

మొబైల్ వాడుతున్నాడని గుర్తించిన ఇన్విజిలేటర్ వారిని పట్టుకుని వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో మిగతా పరీక్షా కేంద్రాల్లోని ముగ్గురు విద్యార్థులను అధికారులు పట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా కాపీ చేసిన నలుగురు విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం జరిగిన స్మార్ట్ కాపీయింగ్‌పై హైదరబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లాకు చెందిన ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌లో టాపరే ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నట్లు తెలిసింది. కడప విద్యార్థి తన మిత్రుల కోసం స్మార్ట్ కాపీయింగ్ చేసిన ట్టుగా సమాచారం.

దేశంలోని 23 ఐఐటిల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బిటెక్ సీట్ల భర్తీకి గత ఆదివారం జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్ విధానంలో జరిపిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాలైన ఎపి, తెలంగాణ నుంచి సుమారు 35 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా. కాగా, ఈసారి కటాఫ్ మార్కులు సుమారు 60 గా ఉండొచ్చని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. కాగా, జెఇఇ 2023 మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరిగిన విషయం విదితమే. దీనికి సంబంధించిన ఆన్సర్ కీ ని కూడా తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News