కరోనా కల్లోలంలో విశ్వమానవాళి జీవన శైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్‌లైన్ విద్యా బోధనలు, వర్క్‌ఫ్రమ్ హోం, ఆన్‌లైన్ జూమ్ సమావేశాలు మానవ జీవితంలో ప్రవేశించాయి. విద్యాలయాల మూసివేత, ఆన్‌లైన్ చదువులతో విద్యార్థి లోకం చేతికి సెల్‌ఫోన్ తనంత తానే వచ్చి పడింది. స్మార్ట్‌ఫోన్ అలవాటు కూడా లేని యువత అరచేతిలో వైకుంఠం వెలసింది. చరవాణి చమత్కారాలకు (మిత్రులతో ఛాటింగ్, వీడియోలు, గేమ్స్, సామాజిక మాధ్యమాలు లాంటివి) పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రజలు అబ్బురపడడం, మొబైల్ అలవాటుకు బానిసలు కావడం మనకు తెలియకుండానే జరిగిపోయింది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల చేతికి స్మార్ట్‌ఫోన్ చేరడంతో ఆ చిన్నారులకు ఫోన్ వినియోగం దురలవాటుగా కూడా మారిందని తల్లిదండ్రులు ఆందోళనపడే వరకు పరిస్థితులు దిగజారడం ప్రమాద హెచ్చరికగా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.
భారత యువతలో మొబైల్ అలవాటు పట్ల దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించిన ‘లోకల్ సర్కిల్స్’ స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పట్టణ ప్రాంత పిల్లలు, కౌమార దశ యువత (917 ఏండ్ల లోపు) లో దాదాపు 40% మంది స్మార్ట్‌ఫోన్ వినియోగాలకు బానిసలుగా మారారని తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. 9 -13 ఏండ్ల పిల్లలు ప్రతి రోజు అధిక సమయం స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లు 55 % పట్టణ తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. 13-17 ఏండ్ల లోపు యువత సమయం దొరికిన ప్రతి క్షణం ఫోన్‌లో దూరుతున్నట్లు 71% పేరెంట్స్ భయపడుతూ విచారం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు(13-17 ఏండ్ల) రోజుకు 3 గంటలకు పైగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారని 62% పేరెంట్స్ అంటున్నారు. 09- 13 ఏండ్ల పిల్లలు రోజుకు 3 గంటలకు పైగా ఫోన్లను వాడుతున్నట్లు 49 శాతం తల్లిదండ్రులు తెలుపుతున్నారు. పిల్లల్లో స్మార్ట్‌ఫోన్లను 35%, టాబ్స్‌ను 31% వాడుతున్నట్లు తేలింది. కోవిడ్- 19 కాలంలో నిర్వహించిన ఆన్‌లైన్ బోధనలతో ప్రారంభమైన స్మార్ట్‌ఫోన్ వినియోగం నేడు దురలవాటుగా మారిందని వివరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ నీలి తెరల్లో మునిగిన యువత తమ లక్ష్యాలను, విద్యను మరిచి దారి తప్పే పరిస్థితులు దాపురించాయి. 9 ఏండ్ల చిన్నారులు కూడా సామాజిక మాధ్యమాల్లో దూరడం పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తున్నది.
అధిక సమయం ఫోన్ వినియోగాలతో యువతలో నిద్ర లేమి, చికాకు, ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆత్మవిశ్వాస లోపం, ఏకాగ్రత సడలడం లాంటి పలు శారీరక, మానసిక అనారోగ్యాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీస వయసు 13 ఏండ్లు ఉంటున్నదని, దీనిని కనీసం 16 ఏండ్లకు పెంచాలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. యువకులు, పెద్దలు రోజుకు 150 సార్ల వరకు ఫోన్లను ఓపెన్ చేస్తున్నారని, రానున్న రోజుల్లో సోషల్ మీడియా అడిక్షన్ (సామాజిక మాధ్యమ దురలవాటు) సంక్షోభం రావచ్చని తెలుపుతున్నారు. యూ ట్యూబ్, వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, స్నాప్ షాట్, ఇన్‌స్టాగ్రామ్, డిస్కార్డ్ లాంటి పదాలు పిల్లల నోట్లో ఊత పదాలుగా నానడం వింటున్నాం. సామాజిక మాధ్యమాల వినియోగానికి కనీస వయస్సును 13 నుంచి 15 ఏండ్ల వరకు పెంచడానికి ప్రభుత్వాలు నిబంధనలు తేవాలని 82% తల్లిదండ్రులు కోరుతున్నారు. 13-17 ఏండ్ల యువత ఫోన్ దురవాటుకు లోనైనారని 80 %, 09- 13 ఏండ్ల లోపు పిల్లలు 87 శాతం స్మార్ట్ ఫోన్ దురలవాట్లకు లోనవుతున్నారని తల్లిదం డ్రులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్ దురలవాటుకు కారణాలుగా ఇంట్లో ఒకటి కన్న ఎక్కువ ఫోన్లు ఉండడంతో పాటు ట్యాబ్‌ల సులభ అందుబాటు, సహచరుల ప్రభావం, ఆన్ పాఠాల కొనసాగింపు, తల్లిదండ్రులు కూడా ఫోన్ దురలవాట్లకు గురికావడం లాంటివి గుర్తించబడ్డాయి.
దేశ వ్యాప్తంగా 287 జిల్లాల్లో 65,000 మంది పౌరులను (67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు) అభిప్రాయాలను సర్వేలో పొందుపరిచారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 51 శాతం మెట్రో నగరాల పౌరులు, 37 శాతం 2- టైయర్ జిల్లాలు, 12 శాతం 3- టైయర్ జిల్లాలు తీసుకోవడం జరిగింది. నేటి స్మార్ట్‌ఫోన్ భూమిని కుగ్రామంగా మార్చి దూరాలను చెరిపేసింది. ఇంటర్‌నెట్ విప్లవం డిజిటల్ వెలుగులను చిమ్ముతోంది. గూగుల్ ఒడి సమస్త జ్ఞాన బాంఢాగారంగా మారిపోయింది. విజ్ఞాన వినోదాల రుచులతో పాటు అభ్యంతరకర, అశ్లీల వీడియోలు/ ఫోటోలు అడిగిందే తడవుగా చక్కర్లు కొడుతున్నాయి. నేటి స్మార్ట్‌ఫోన్ ఉపకరణం మనిషికి వరంగానే కాకుండా శాపంగా కూడా మారుతున్నది. ముఖ్యంగా నేటి చిన్నారులు ఫోన్/ ట్యాబ్ దుర్వినియోగంతో శారీరక మానసిక రుగ్మతలతో బతుకులను విచ్ఛిన్నం చేసుకునే దుస్థితి దాపురించింది. పిల్లలకు ఫోన్ వాడకాన్ని క్రమబద్దం చేయడం, క్రమశిక్షణను నేర్పడమనే గురుతర బాధ్యత తల్లిదండ్రుల మీదనే అధికంగా ఉంటుందని నమ్మాలి. స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్ అవసరాలకు మాత్రమే వాడే దిశలో నేటి చిన్నారులకు నచ్చజెప్పాలి.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037