శుక్రుడు, శని, నెలవంక అతి సమీపంలోకి రానుండడంతో ఏర్పడనున్న ‘స్మైలీ ఫేస్’
ఈ మేరకు సైన్స్ వెబ్‌సైట్ ‘లైవ్‌సైన్స్’ వెల్లడి
ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వీక్షించే అవకాశం
న్యూయార్క్ : ఈ నెల 25న గగనతలంలో ఒక అందమైన, మహా అద్భుతం ఆవిష్కృతం కానున్నది. సౌర కుటుంబంలోని రెండు గ్రహాలు, నెలవంక (చంద్రుడు) సమీపంలోకి రానుండడంతో గగనతలంలో ‘స్మైలీ ఫేస్’ ఏర్పడనున్నది. ఈ మేరకు సైన్స్ వెబ్‌సైట్ ‘లైవ్‌సైన్స్’ వెల్లడించింది. 25న తెల్లవారు జాముకు ముందు శుక్రుడు, శని చందమామ (నెలవంక)కు అతి సమీపంలోకి రానున్నాయి. ఒక దగ్గరే కనిపించనున్న ఆ మూడూ ‘స్మైలీ ఫేస్’ ఆకృతిని ప్రతిబింబించనున్నాయి.
సూర్యోదయానికి ముందు అతి తక్కువ సమయం మాత్రమే కనిపించనున్న ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వీక్షించేందుకు అవకాశం ఉన్నది. రెండు గ్రహాలు నయనాలుగా, నెలవంక చిరునవ్వుతో ఉన్న పెదాలుగా కనిపించనున్నాయి. ఈ వివరాలను అమెరికా అంతరిక్షసంస్థ నాసా సోలార్‌సిస్టమ్ అంబాసడర్ బ్రెండా కల్‌బర్టన్ వెల్లడించారు. శుక్రుడు, శని ప్రకాశమంతంగా ఉండడంతో వాటిని మామూలుగా వీక్షించవచ్చు. అయితే, స్మైల్ ఇమేజ్‌ను చూసేందుకు మాత్రం స్టార్‌గేజింగ్ బైనాక్యులర్, టెలిస్కోప్ అవసరం కానున్నాయి.