Wednesday, January 22, 2025

యుపిలో చెల్లని బిజెపి

- Advertisement -
- Advertisement -

రామ మందిర నిర్మాణ ప్రతిష్ట ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ఏ కోశానా కలిసిరాలేదు. ప్రత్యేకించి రాముడి జన్మస్థలం అయిన అయోధ్యలో కానీ మొత్తం మీద ఉత్తరప్రదేశ్‌లో కానీ రామాలయ పునః ప్రతిష్ట బిజెపికి ఏ విధంగా కూడా కలిసిరాని విషయం అయింది. ఏడాది ఆరంభంలోనే అట్టహాసంగా రామాలయ ఉత్సవం జరగడం తరువాత వచ్చిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రత్యేకించి రామాలయం గురించి ప్రస్తావించుకునేందుకు పెద్దగా ఏమీ లేకపోవడం వంటి పరిణామాలతో పాటు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ బుల్‌డోజర్ దూకుడు వైఖరి, ఈ క్రమంలో బాధితులైన పలువర్గాలకు ఎస్‌పి ప్రత్యామ్నాయం, కాపాడే దిక్కు అని ఓ ప్రచారం జరగడం కూడా బిజెపికి యుపిలోనే కాకుండా జాతీయ స్థాయిలో మెజార్టీ సన్నగిల్లడానికి దారితీసిందని విశ్లేషకులు తెలిపారు. అయోధ్య రామాలయం నెలకొని ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో కూడా బిజెపి ఓటమి, ఇక్కడ సమాజ్‌వాది పార్టీకి చెందిన అవదేష్ ప్రసాద్ గెలుపొందడం వంటి పరిణామం కీలకం అయింది.

ఈ స్థానంలో హ్యాట్రిక్ సాధించాలని బిజెపి యత్నించింది. హిందూ సాంస్కృతిక వైభవాన్ని తాము అయోధ్య సంకేతంగా చాటి చెప్పామని బిజెపి తమ ఎన్నికల ప్రచార సభలలో తెలిపింది. ప్రధాని మోడీ ఇటీవలి కాలంలో పలుసార్లు అయోధ్యకు వచ్చి వెళ్లారు. ఈసారి ఎన్నికలలో యుపిలో పెద్ద ఎత్తున బిజెపి ప్రభంజనానికి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కీలకం అవుతుందని మోడీ, అమిత్ షా ఇతర పార్టీ విశ్లేషకులు నమ్మారు. హిందూ ఓట్ల సమీకరణతో అతి ఎక్కువ సీట్ల యుపిలో సత్తాచాటుకుంటామనే విశ్వాసం అతిశయించిందని ఫలితాలతో స్పష్టం అయింది. మరో వైపు యుపి పొరుగున పంజాబ్‌లో రైతుల ఆందోళన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నిరంతరం సాగనిచ్చేలా చేసి, వారి డిమాండ్ల పట్ల చిన్నచూపు చూసిందనే ఆవేశం ప్రత్యేకించి పశ్చిమ యుపిలోని రైతాంగంలో చాలాకాలంగా రగులుకుందని, దేశ రాజధానిలో జరిగిన రైతుల ధర్నాకు యుపి నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడం, వారికి సంఘీభావం తెలియచేయడం వంటి పరిణామాలు కీలకమైనవని భావిస్తున్నారు.

అన్నింటికి మించి ఈసారి యుపికే లడ్కే అనే నినాదం అఖిలేష్, రాహుల్ గాంధీల గురించి బలీయంగా దూసుకువెళ్లింది. యుపివాలాల నినాదం ప్రత్యేకించి అట్టడుగు గ్రామీణ ప్రాంతాలకు బలీయంగా విస్తరించుకుందని, యుపిలోని అసలు సిసలు గ్రామీణ ప్రజలను , తండాలను బాగా తాకిందని, ఈ క్రమంలోనే బిజెపి ఈసారి బిజెపికి దూరం అవుతూ వచ్చిందని, అట్టహాసాల నడుమ తంతుల నేపథ్యంలో అట్టడుగు స్థాయి ప్రజా స్పందనను స్థానిక లేదా కేంద్రీయ బిజెపి నాయకత్వం పసికట్టలేదని, పసికట్టినా పట్టించుకోలేదని ఇప్పటి ఫలితాలతో స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News