Sunday, September 8, 2024

ప్రధాని పీఠం మళ్లీ మోడీదే: మంత్రి స్మృతి ఇరానీ

- Advertisement -
- Advertisement -

దావోస్ : ఈ ఏడాది ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి గద్దె ఎక్కుతారని ప్రపంచ నేతలు దృఢ నమ్మకంతో ఉన్నారని, మోడీ విధానం, సామాజిక సంస్కరణలు కొనసాగుతాయని వారు ఎదురుచూస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బుధవారం వెల్లడించారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) వార్షిక సమావేశం 2024లో ‘పిటిఐ’కి స్మృతి ఇరానీ ఇంటర్వూ ఇస్తూ, ప్రపంచ నేతలు, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక రంగ నేతలు దావోస్‌లో ప్రధాని మోడీకి తిరిగి స్వాగతం పలికేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తుండడం ప్రశంసనీయమని అన్నారు. దావోస్‌కు వచ్చిన ప్రపంచ నేతలు భారత్‌ను దృఢమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా పరిగణిస్తున్నారని ఆమె చెప్పారు. మోడీ 2018లో డబ్లుఇఎఫ్ వార్షిక సమావేశానికి హాజరయ్యారు. ఆయన 2021, 2022లో కూడా ఆన్‌లైన్‌లో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర మహిళా, శిశు వికాస, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ ప్రస్తుత 2024 వార్షిక సమావేశంలో భారత ప్రతినిధివర్గానికి సారథ్యం వహిస్తున్నారు.

ఈ సమావేశానికి ప్రభుత్వ, వాణిజ్య, విద్యా, కళా, సాంస్కృతిక, పౌర సమాజ ప్రముఖులు సుమారు 3000 మంది హాజరవుతున్నారు. ప్రపంచ నేతలతో తన చర్చల గురించిన ప్రశ్నకు మంత్రి ఇరానీ సమాధానం ఇస్తూ, వారు భారత అభివృద్ధి గాథ గురించి దృఢనమ్మకంతో ఉన్నారని, దేశంలో విధానం, రాజకీయ సుస్థిరత గురించి భరోసాతో ఉన్నారని తెలియజేశారు. ప్రధాని మోడీ 2025లో దావోస్ సమావేశానికి తిరిగి హాజరవుతారని తాను ఆశిస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు (బోర్గె బ్రెండె) కూడాబాహాటంగా ఒక ఇంటర్వూలో చెప్పారని ఇరానీ తెలిపారు. ‘అంటే ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వస్తారని ప్రపంచ సమాజం గట్టి భరోసాతో ఉందని విదితం అవుతోంది’ అని ఆమె చెప్పారు. ‘ప్రధాని మోడీ విధాన సంస్కరణలపైనే కాకుండా సామాజిక రంగాన్నీ మన వృద్ధి గాథలో అలక్షం చేయకుండా చూడాలని పట్టుదలతో ఉన్నారు’ అని ఇరానీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News