Sunday, December 22, 2024

సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఐసిసి ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికా మహిళలతో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య భారత జట్టు 143 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేధనకు దిగిన సౌతాఫ్రికా 37.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన సఫారీ టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ లౌరా వల్‌వర్డ్ 4 పరుగులు మాత్రమే చేసి రేణుకా సింగ్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యింది. వన్‌డౌన్‌లో వచ్చిన అన్నెకె బోష్ కూడా నిరాశ పరిచింది.

బోష్ ఐదు పరుగులు మాత్రమే చేసి పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. ఆ వెంటనే మరో ఓపెనర్ తన్జీమ్ బ్రిట్స్ కూడా పెవిలియన్ చేరింది. 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన బ్రిట్స్‌ను దీప్తి శర్మ వెనక్కి పంపింది. ఈ దశలో సూనే లూస్, మరిజానె కాప్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుక తీసుకెళ్లారు. కానీ కుదురుగా ఆడుతున్న కాప్‌ను ఆశా శోభన ఔట్ చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన లూస్ 4 ఫోర్లతో 33 పరుగులు సాధించి దీప్తి శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయింది. చివర్లో వికెట్ కీపర్ సినాలో జఫ్టా 27 (నాటౌట్) తప్ప మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 122 పరుగుల వద్దే ముగిసింది. భారత బౌలర్లలో ఆశా శోభన నాలుగు, దీప్తి శర్మ రెండు వికెట్లను పడగొట్టారు.

ఆదుకున్న మంధాన
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ (7) పరుగులు మాత్రమే చేసి ఔటైంది. వన్‌డౌన్‌లో వచ్చిన హేమలత (12), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (10)లు కూడా విఫలమయ్యారు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ స్మృతి మంధాన తన పోరాటాన్ని కొనసాగించింది. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించింది. ఆమెకు జెమీమా రోడ్రిగ్స్ (17) అండగా నిలిచింది. మరోవైపు చివర్లో దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ 31 (నాటౌట్) కూడా మంధానకు సహకారం అందించారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధాన 127 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఇదే క్రమంలో మంధాన అంతర్జాతీయ కెరీర్‌లో ఏడు పరుగుల మైలురాయిని అందుకుంది. మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన అద్భుత సెంచరీతో భారత్ మెరుగైన స్కోరును నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News