Tuesday, December 24, 2024

మంధాన రికార్డు శతకం

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికా మహిళలతో బుధవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య భారత జట్టు 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలివుండగానే 20 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్ స్మతి మంధాన వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయ శతకంతో కదంతొక్కింది. దీంతో భారత్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 321 పరుగులు చేసి స్వల్ప తేడాతో పరాజయం చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ టీమ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ తంజీమ్ బ్రిట్స్ ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన బోస్చ్(18), తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సూనె లూస్ (12) కూ డా విఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా 67 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న లౌరా, కాప్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ లౌరా వల్వ్‌వర్డ్, మరిజానె కాప్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్ల టీమ్ కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఇటు లౌరా అటు కాప్ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో అలరించారు. కాప్ ధాటిగా బ్యాటింగ్ చేయగా, లౌరా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. ఇద్దరు కుదురుగా ఆడి జట్టును లక్షం వైపు నడిపించారు. లౌరా, కాప్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడడంతో సౌతాఫ్రికా సునాయాస విజయం సాధించడం ఖాయంగా కనిపించింది. దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచిన కాప్ 94 బంతుల్లో 3 సిక్సర్లు, 11 బౌండరీలతో 114 పరుగులు చేసింది. ఇదే క్రమంలో లౌరాతో కలిసి నాలుగో వికెట్‌కు 184 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కాప్ ఔటైనా లౌరా తన పోరాటాన్ని కొనసాగించింది. డి క్లర్క్ (28) అండతో స్కోరుకు పరిగెత్తించింది. అయితే కీలక సమయంలో భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచి పోయింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన లౌరా 135 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

స్మృతి నయా చరిత్ర..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను మరోసారి ఓపెనర్ స్మృతి మంధాన ఆదుకుంది. సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మంధాన స్కోరును పరిగెత్తించింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ 3 ఫోర్లతో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. అయితే మంధాన మాత్రం తన జోరును కొనసాగించింది. తొలుత హేమలత (24) మంధానకు అండగా నిలిచింది. తర్వాత వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పింది. ఈ జోడీని విడగొట్టేందుకు సౌతాఫ్రికా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 120 బంతుల్లోనే 18 ఫోర్లు, రెండు సిక్సర్లతో 136 పరుగులు చేసింది. ఈ క్రమంలో వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు వికెట్ కీపర్ రిచా ఘోష్ 25 (నాటౌట్) సహకారం అందించింది. మంధాన, హర్మన్‌లు సెంచరీలతో కదంతొక్కడంతో భారత్ 325 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News