Saturday, November 23, 2024

పాముకాటుకు 8 నెలల బాలుడు బలి

- Advertisement -
- Advertisement -

నిద్రిస్తున్న బాలుడిని కాటువేసిన పాము
వైద్యం అందకనే బాలుడు మృతి చెందాడంటున్న తల్లిదండ్రులు,బంధువులు

మన తెలంగాణ/హుజూర్‌నగర్‌: పాముకాటుకు ముక్కుపచ్చలారని 8 నెలల పసికందు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో అర్ధరాత్రి వేళ ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న 8 నెలల హర్షవర్ధన్ అనే పసిబాలుడును పాము కాటువేసింది. బాలుడు కొద్దిసేపటి నుండి ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నాడో అర్ధం కాకపోవడంతో ఎటూ పాలుపోలేని పరిస్ధితిలో తల్లిదండ్రులు ఉండగా, సమీపంలోనే ఉన్న పామును గుర్తించారు.

వెంటనే ఆ పామును కర్రలతో కొట్టి చంపారు. బాబుతో పాటు పామును తీసుకొని హుటాహుటిన హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీలో ఉన్న నర్సులను బాబుకు వైద్యం అందించాలని కోరగా, ఆసమయంలో డ్యూటీలో ఇద్దరే నర్సులు ఉన్నారని, డ్యూటీ డాక్టర్ లేరని తమకు వైద్యం చేయడం రాదని, వేరే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని సదరు నర్సులు ఉచిత సలహాలు ఇచ్చినట్లు బాలుడి బంధువులు రోదిస్తూ చెప్పారు.

చేసేదేమీలేక పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు బాబును తీసుకువెళ్ళారు. అక్కడ వైద్యుడు కోదాడ తీసుకుపొమ్మని చెప్పడంతో, కోదాడ లోని ఒక ఆసుపత్రికి పోగా అక్కడి డాక్టర్ ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్ళాలని సూచనలు చేశారు. అక్కడి నుండి బాబును ఖమ్మం తీసుకుని పోయారు. అప్పటికే బాబును పాముకరిచి రెండు గంటలు దాటిపోవడంతో జరగాల్సిన నష్టం కాస్త జరిగింది. పాముకాటుకు అభం,శుభం తెలియని పసిబాలుడు బలైపోయాడు. హుజూర్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో పాముకాటుకు ఇంజక్షన్‌లు ఉన్నా డ్యూటీ డాక్టర్ లేకపోవడంతోనే బాబు ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు, వారి బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News