Tuesday, January 21, 2025

బిసి హాస్టల్‌లో విద్యార్థిని కాటేసిన పాము

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, గాలిపెల్లి బిసి బాలుర హాస్టల్ విద్యార్థి రమావత్ రోహిత్‌ను శుక్రవారం పాము కరిచింది. దీంతో వెంటనే సిబ్బంది, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గాలిపెల్లి బిసి బాలుర హాస్టల్‌లో ఉంటున్న ముస్తాబాద్ మండలానికి చెందిన రమావత్ రోహిత్ అనే విద్యార్థి అదే గ్రామంలోని హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. రోజువారీగా ఉదయాన్నే లేచి పాఠశాలకు రెడీ అయ్యే క్రమంలో పాము అతనిని కరిచింది.

దీంతో బిగ్గరగా కేకలు వేయడంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది అతని వద్దకు వెళ్లారు. పాము కరిచిందని విద్యార్థి తెలపడంతో వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో వెంటనే అక్కడకు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడ వైదం చేయించమని, ఎల్లారెడ్డి పేటలోని అశ్విని ఆసుపత్రికి తీసుకువెళ్తామని చెప్పడంతో అధికారులు, అక్కడికి తరలించారు. ఇదిలా ఉంటే హాస్టల్‌లోకి పాము రావడంతో విద్యార్థులు భయందోళన చెందుతున్నారు.

నాగుపామును చంపిన పంచాయతీ సిబ్బంది
విద్యార్థి రమావత్ రోహిత్‌ను కరిచిన పామును హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు గుర్తించారు. వెంటనే స్థానికులకు సమాచారం అందజేశారు. పంచాయతీ సిబ్బంది సహాయంతో పామును గుర్తించి చంపివేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కదిరే శ్రీకాంత్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థులు ఎవరు కూడా భయందోళన చెందవద్దని సూచించారు.

అందుబాటులో లేని హాస్టల్ ఇన్‌ఛార్జి వార్డెన్
బిసి బాలుర హాస్టల్‌లో సుమారుగా 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. అయితే హాస్టల్‌లో అందుబాటులో ఉండాల్సిన వార్డెన్ లేకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి వార్డెన్ కాకుండా శాశ్వత ప్రాతిపదికన వార్డెన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, సంఘటన జరిగిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ‘మన తెలంగాణ’ విలేఖరి వార్డెన్ గంగయ్యకు ఫోన్ చేసి వివరణ కోరగా , తాను రెండు రోజుల పాటు సెలవులో ఉన్నానని తెలిపారు. తమ హాస్టల్ విద్యార్థికి పాము కరిచిన విషయం తెలిసిందని, వెంటనే తోటి సిబ్బందిని అలర్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News