Sunday, December 22, 2024

విమానంలో పైలట్ పక్కన పాము.. ఏం చేశాడంటే..

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: అదో చిన్న విమానం. ఆకాశంలో ఎగురుతోంది. విమానంలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. హఠాత్తుగా పైలట్ సీటు పక్కన నాగుపాము ప్రత్యక్షమైంది. పైలట్‌కు గుండె ఆగినంత పనైంది. ఇది ఏ హాలీవుడ్ సినిమాలోని థ్రిల్లింగ్ సన్నివేశమో కాదు. నిజంగా జరిగిన సంఘటన. దక్షిణాఫ్రికా పైలట్ రుడోల్ఫ్ ఎరాస్మస్‌కు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆయన విమానాన్ని సేఫ్ ఎమర్జన్సీ ల్యాండింగ్ చేసి నలుగురు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలసిపోకుండా కాపాడగలిగారు. ఐదేళ్ల ఫ్లయింగ్ అనుభవం ఉన్న ఎరాస్మస్ గత సోమవారం ఉదయం వారెస్టర్ నుంచి నెల్‌స్ప్రూట్‌కు నలుగురు ప్రయాణికులతో ఒక చిన్న విమానంలో బయల్దేరారు.

ఉదయం బయల్దేరడానికి ముందు విమానాన్ని ఆయన చెక్ చేస్తుండగా ఆదివారం మధ్యాహ్నం విమానం రెక్క కింద ఒక పామును తాము చూశామని ఎయిర్‌ఫీల్డ్ సిబ్బంది ఆయనకు చెప్పారు. దీంతో అందరూ కలసి విమానం ఇంజన్ పైభాగాన్ని విప్పి చూశారు. అక్కడ పాము జాడ కనపడకపోవడంతో అది వెళ్లిపోయి ఉంటుందని వారంతా భావించారు. ఆ తర్వాత ఆయన విమానం స్టార్ట్ చేశారు. విమానం బయల్దేరిన కొద్ది నిమిషాల తర్వాత తన సీటు పక్కన ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఏమిటని ఎడమ వైపున కిందకు చూస్తే అక్కడో పాము కనిపించింది. అది ఆయన కదలికలను పసిగట్టి వెంటనే ఆయన సీటు కింద దాక్కుంది. ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పాలా వద్దా అని ఆయన ఆలోచించారు. చెప్పడమే మంచిదని భావించి విమానంలో పాము ఉందని, భయపడాల్సింది లేదని..కొద్ది నిమిషాల్లోనే విమానం కిందకు దిగుతుందని వారికి ఆయన చెప్పారు.

ఆ సమయంలో విమానం వెల్కోమ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉంది. వెంటనే జొహాన్నెస్‌బర్గ్‌లోని కంట్రోల్ టవర్‌కు ఎమర్జన్సీ ల్యాండింగ్ గురించి ఆయన సమాచారం అందచేశారు. వెల్కోమ్ విమానాశ్రయంలో విమానం సేఫ్ ఎమర్జన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే ప్రయాణికులంతా దిగిపోయారు. పైలట్ ఎరాస్మస్ దిగుతూ తన సీటును ముందుకు జరిపి చూడగా పాము చుట్టచుట్టుకుని ఉంది. విమానం దిగిన తర్వాత పాములు పట్టే వారిని రప్పించాలని ఆయన ఎయిర్‌పోర్టు సిబ్బందిని కోరారు. వారు వచ్చేసరికి విమానంలో పాము మాయమైంది. అది మళ్లీ విమానం లోపలకు వెళ్లిపోయి ఎక్కడో దాక్కుంది.

ఆ రోజు సాయంత్రం నుంచి పాము కోసం సాగిన అన్వేషణ చీకటి పడేవరకు సాగింది. అయినా పాము జాడ తెలియలేదు. మళ్లీ మరుసటి రోజు అన్వేషణ ప్రారంభిద్దామని నిర్ణయించుకుని వారు ఆ రాత్రి వెళ్లిపోయారు. మరుసటి రోజు కూడా పాము కోసం అన్వేషణ సాగినా అది కంటపడలేదు. దీంతో ఆ పాము వచ్చినదారినే వెళ్లిపోయి ఉంటుందని వారంతా నిర్ణయించుకున్నారు. తన నాలుగు దశాబ్దాల అనుభవంలో ఇటువంటి సంఘటన గురించి ఎన్నడూ వినలేదని విమానయాన నిపుణుడు, దక్షిణాఫ్రికా ఎయిర్ షో కామెంటేటర్ బ్రియాన్ ఎమ్మెసీన్ అన్నారు. విమానం పైలట్ ఎమరాస్మస్ అద్భుతమైన నైపుణ్యంతో పరిస్థితిని ఎదుర్కొన్నాడని, ఆయన ఏమాత్రం తొందరపడినా విమానంలోని అందరి ప్రాణాలు పోయేవని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News