పూరీ జగన్నాధ ఆలయ రత్నభాండాగారం రహస్య గదిలో పాములు కాపలాగ ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై రత్న భాండాగారం లోని విలువైన వస్తువులను లెక్కింంచడానికి నియమించిన బృందానికి సారథ్యం వహిస్తున్న ఒడిశా హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ మాట్లాడారు. మెజిస్ట్రేట్ సమక్షంలో గది తాళాలు పగలగొట్టిన తర్వాత తమ బృందం గదిలోకి ప్రవేశించిందని, తెలిపారు. రత్నభాండాగారానికి పాములు కాపలాగా ఉన్నాయంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.
తమ బృందంలో ఏడెనిమిది మంది ఆలయ మేనేజ్‌మెంట్ సభ్యులు ఉన్నారని, వీరంతా బహుదా యాత్ర సన్నాహాల్లో బిజీగా ఉన్నందున తనిఖీలకు , ఆభరణాల తరలింపునకు తగిన సమయం లభించలేదని చెప్పారు. అందువల్ల దేవతామూర్తుల ఆభరణాలు, విలువైన రత్నాల తరలింపునకు మరో తేదీని నిర్ణయిస్తామని తెలిపారు. శ్రీ జగన్నాథ ఆలయ పాలనాధికారి అరవింద పాడి మాట్లాడుతూ అవుటర్ ట్రెజరీలో భద్రపరచిన ఆభరణాలను ఆలయ ప్రాంగణం లోపల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్టు చెప్పారు. ఆ తర్వాత దీనికి మెజిస్ట్రేట్ సమక్షంలో సీలు వేసినట్టు వెల్లడించారు.