Friday, November 22, 2024

ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్‌లోకి తుమ్మల

- Advertisement -
- Advertisement -
ఆయనతో పాటు వివిధ జిల్లాల నుంచి
సుమారు 15 మంది పలు పార్టీలకు చెందిన నాయకుల చేరిక
తుమ్మలను పార్టీలోకి రావాలని ఆహ్వానించిన ఏఐసిసి నాయకులు

మనతెలంగాణ/హైదరాబాద్:  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఈ నెల 17వ తేదీన ఆయన లాంఛనంగా పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముగిసిన మరుసటి రోజున తుక్కుగూడలో జరిగే విజయభేరి బహిరంగసభలో చేరనున్నట్లు పిసిసి నేతలు తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ప్రచార కమిటీ కో-చైర్మన్ (మాజీ ఎంపి) పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హైదరాబాద్ మాదాపూర్‌లోని తుమ్మల నివాసానికి శుక్రవారం ఉదయం వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి విజయభేరి సభా వేదికగా చేరనున్నట్లు వారికి హామీ ఇచ్చినట్లుగా తెలిసింది.
ఖమ్మం లేదా పాలేరు నుంచి పోటీ ?
తుమ్మల నాగేశ్వరరావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మూడు మాత్రమే జనరల్ సీట్లు. గతంలో పాలేరు నుంచి ప్రాతినిథ్యం వహించడంతో ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన ఆసక్తి చూపుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ తరఫున పోటీలోకి దిగనున్న నేపథ్యంలో అక్కడి స్థానిక లీడర్లు, జిల్లా నేతల అభిప్రాయాలను తెలుసుకుని, సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. తుమ్మల సేవలు ఎక్కడ ఎక్కువ అవసరమవుతాయో గుర్తించడంతో పాటు, ఏ నియోజకవర్గంలో ఆశించిన ఫలితాన్ని కచ్చితంగా పొందుతామో దాని ఆధారంగా ఆయన పోటీ చేసే స్థానాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం టిపిసిసికి సూచించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే తుమ్మల ఆశిస్తున్నట్టుగా ఖమ్మం లేదా పాలేరు నుంచి తుమ్మలకు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలిసింది.
పువ్వాడకు పోటీ ఇచ్చేలా….
పాలేరులో బిఆర్‌ఎస్ తరఫున రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి బరిలో ఉన్నందున అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపి, ఖమ్మంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన పువ్వాడ అజయ్ పోటీ చేస్తున్నందున ఆయనకు గట్టి పోటీ ఇచ్చేలా అదే కమ్యూనిటీకి చెందిన తుమ్మలను రంగంలోకి దించాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత లోతుగా అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత తుమ్మలతో పాటు జిల్లాలోని పార్టీ నేతలు, సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
దాదాపు 15 మంది చేరిక
తుమ్మలతో పాటు పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌లో చేరే వారిలో బిఆర్‌ఎస్, బిజెపికి చెందిన దాదాపు 15 మంది నాయకులు ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లాల ఓదెలు తదితరులతో పాటు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పీ చైర్మన్లు తదితరులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు వివరించాయి.
టికెట్ కావాలంటే ఏఐసిసి నుంచి గ్రీన్‌సిగ్నల్
పార్టీలో చేరే వారిలో టికెట్ డిమాండ్ లేకుండా ఉంటేనే వెంటనే వారిని పార్టీలో చేర్చుకోవాలని పిసిసి నిర్ణయించింది. అయితే టికెట్ కోసం వచ్చే వారి విషయంలో ఏఐసిసి నుంచి స్పష్టత వచ్చాకే గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News