Monday, December 23, 2024

పాక్ లోని ముర్రేలో మంచుకురిసి ఊపిరాడక 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Snowfell in Murray killing at least 21 people

చిక్కుకు పోయిన వాహనాల్లో 2300 వెలికి తీత
ఇస్లామాబాద్ నుంచి ముర్రేకు రోడ్లన్నీ బంద్
శుక్రవారం రాత్రి నుంచి ముర్రే లోకి ప్రవేశం నిషేధం

లాహోర్ : పాకిస్థాన్‌లో శనివారం తీవ్ర విషాద సంఘటన సంభవించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం ముర్రేలో అనూహ్యంగా భారీ మంచు వర్షం కురిసి వాహనాలు చిక్కుకుపోవడంతో ఊపిరాడక దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది పిల్లలున్నారు. మృతుల్లో ఇస్లామాబాద్ పోలీస్ అధికారి అతిఖ్ అహ్మద్‌తోపాటు ఆయన కుటుంబీకులు ఎనిమిది మంది ఉన్నారు. వీరంతా హైపోథెర్మియాతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మంచు వర్షంలో దాదాపు వెయ్యివరకు వాహనాలు చిక్కుకు పోయాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు 45 కిమీ దూరంలో రావల్పిండి జిల్లాలో ఉన్న ముర్రేకు శీతాకాలంలో ఏటా లక్షలాది మంది పర్యాటకులు రావడం పరిపాటిగా వస్తోంది.

శుక్రవారం ఇక్కడ మైనస్ 8 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. దట్టంగా ముంచుకురిసి రోడ్లపై నాలుగు అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. పర్యాటకుల వాహనాలన్నీ ముంచులో చిక్కుకుపోవడమే కాక, రాత్రంతా మంచు వర్షం వాహనాలను కప్పేసింది. కారు విండోలను కూడా ప్రయాణికులు తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడడంతో వాహనాల్లోనే ప్రయాణికులు ఊపిరాడక గడ్డకట్టుకు పోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 2300 వాహనాలకు పైగా మంచునుంచి బయటకు తీసుకురాగా ఇంకా మరో వెయ్యి వాహనాలు మంచులో చిక్కుకుని ఉన్నాయని పాక్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చెప్పారు. ముర్రేలో ఎమర్జెన్సీ ప్రకటించారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి

ఈ ఘోర విషాద సంఘటనకు పాక్ ప్రధాని ఇమ్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనూహ్యంగా మంచుకురియడం, వాతావరణ పరిస్థితిని ముందుగా అంచనా వేయలేకపోవడంతో జిల్లాయంత్రాంగం ఎలాంటి ముందస్తు సిద్ధం కాలేక పోయిందని చెప్పారు. ఇలాంటి విషాద సంఘటనలు మళ్లీ జరగకుండా నియంత్రణ నిబంధనలు అమలు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

సహాయ కార్యక్రమాలు

పాక్ మిలిటరీ రంగం లోకి దిగి ముర్రే వెళ్లే రోడ్లన్నీ మంచునుంచి ఖాళీ అయ్యేలా చర్యలు చేపట్టింది. చిక్కుకు పోయిన కొందరిని రక్షించ గలిగింది. దాదాపు 15 20 ఏళ్ల తరువాత ఇంత పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడకు రావడంతో ఈ విపత్కర పరిస్థితి ఎదురైందని మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చెప్పారు. ఇస్లామాబాద్ నుంచి ముర్రే వెళ్లే రోడ్డును మూసివేసినట్టు ఆయన తెలిపారు. ఇస్లామాబాద్, రావల్పిండి, డిప్యూటీ కమిషనర్లు, పోలీస్, రిస్కు ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్నారు. కార్లలో చిక్కుకుపోయిన వారికి స్థానికులు దుప్పట్లు, ఆహారం అందించారు. పర్యాటకుల ఆశ్రయానికి ప్రభుత్వ కార్యాలయాలు, విశ్రాంతి గృహాలను తెరిచే ఉంచాలని పంజాబ్ సిఎం బుజ్దార్ అధికారులను ఆదేశించారు.

పాకిస్థాన్ వాతావరణ విభాగం ముర్రే, గలియత్‌లో జనవరి 6 నుంచి 9 వరకు భారీ మంచువాన కురుస్తుందని ముందుగానే హెచ్చరించింది. మంగళవారం రాత్రి నుంచి ఈ ప్రాంతంలో మధ్య కాస్త విరామాలతో మంచు కురుస్తూనే ఉంది. వేలాది మంది పర్యాటకులు దీన్ని సందర్శించడానికి ఎగబడ్డారు. దాదాపు లక్ష వాహనాలు ముర్రే కొండ ప్రాంతంలో ప్రవేశించినట్టు అనధికారిక లెక్కల బట్టి తెలుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ముర్రేలోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించినట్టు చీఫ్ ట్రాఫిక్ ఆఫీసర్ తైమూర్ ఖాన్ తెలియచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News