Monday, December 23, 2024

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌ అరెస్టు..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అంతకు ముందు రోజు ఆమెను ముంబైలో అదుపు లోకి తీసుకున్న తరువాత గుజరాత్‌కు తరలించారు. ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, నేర విచారణ వ్యవహారాలను అవమానించడం, గాయపర్చడానికి కారణం కావడం తదితర ఆరోపణలు ఆమెకు వ్యతిరేకంగా తాజా నమోదు కావడంపై ఈ అరెస్టు జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం నాడు గుజరాత్ మాజీ డిజిపి ఆర్‌బి శ్రీకుమార్‌ను కూడా క్రైమ్ బ్రాంచి అరెస్టు చేసింది. మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్‌ను కూడా నిందితుడిగా పేర్కొన్నారు. అయితే వేరే కేసులో ఆయన జైల్లో ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సెతల్వాడ్, శ్రీకుమార్, సంజీవ్ భట్ దర్యాప్తు కమిషన్ సిట్‌కు, కోర్టులకు సమర్పించిన డాక్యుమెంట్లను క్రైమ్ బ్రాంచి సేకరిస్తుందని క్రైమ్ బ్రాంచి డిసిపి చైతన్య మాండలిక్ వివరించారు. ఈ కేసు దర్యాప్తులో ఉందన్నారు. నేరపూరిత కుట్రలో అనేక మంది ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిందితులు శ్రీకుమార్ కానీ, సెతల్వాడ్ కానీ దర్యాప్తుకు సహకరించడం లేదని మాండలిక్ చెప్పారు. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించిన మరునాడే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా సెతల్వాడ్ తన అరెస్టు అక్రమమని వాదించారు. తన ప్రాణాలకు ముప్ప ఉందని ఆరోపించారు.
సెతల్వాడ్ అరెస్టుపై వామ పక్షాల వ్యతిరేకత
ముంబైకి చెందిన సామాజిక ఉద్యమ కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేయడాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు విఘాతమని సిపిఎం ఆరోపించింది. రాష్ట్రాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే ప్రజాస్వామ్య వాదులకు ఇది ప్రమాదకరమైన బెదిరింపుగా పేర్కొంది. న్యాయం కోసం 16 ఏళ్లు సాగిన పోరాటాన్ని అసాధారణమైన అవమానకరమైన పదాలతో విమర్శించడమేనని కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించింది. కేసులన్నీ ఉపసంహరించుకుని సెతల్వాడ్, శ్రీకుమార్ తదితరులను వెంటనే విడుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా కూడా ఈ చర్యను ఖండించారు. గుజరాత్ అల్లర్ల బాధితుల కోసం సెతల్వాడ్ నిర్విరామ పోరాటం సాగించారని, ఆమెను విడుదల చేయాలని, మానవహక్కుల ఉద్యమకారులను వేధించడం ఆపాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య న్యాయాన్ని ఆకాంక్షించేవారు ఇప్పుడు విచారణను ఎదుర్కోవలసి వస్తోందని విమర్శించారు.

Social Activist Teesta Setalvad Arrest

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News