Sunday, December 22, 2024

ప్రగతికి చుక్కాని…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు సత్ ఫలితాలను ఇచ్చాయని సామాజిక, ఆర్థిక సర్వే 2023 స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ్యవసాయ రంగంలోని పలు పథకాలు, రైతుబంధు, దళితబంధు, ఉచిత విద్యుత్, పారిశ్రామిక విధానం, ఐటి, ఫార్మారంగాల్లో సాధించిన అభివృద్ధి రా ష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగు పరిచాయని 2022 సంవత్సరానికి రా ష్ట్ర ప్రణాళిక శాఖ నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ మేరకు ప్రణాళిక శాఖ రూపొందించిన సామాజిక, ఆర్థిక సర్వే 2023 నివేదికను సోమవారం శాసనసభ కమిటీ హాల్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.

కులవృత్తులను ప్రోత్సహిస్తూ గొర్రెలు, చేపల పెంపకం, పేదల కోసం అమ లు చేస్తున సంక్షేమ పథకాలు,ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, పోషకాహార పంపిణీ, ఆరోగ్య లక్ష్మీతో పాటు అభివృద్ధి పథకాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ప్రజలకు ఆర్థికంగా చేయూతనిచ్చే పథకాలు అన్ని విజయవంతంగా అమలు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆర్థిక కార్యకలపాలు భారీగా పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడం… రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడిందని సర్వే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని సర్వే వెల్లడించింది. ఎనిమిదన్నరేండ్ల రాష్ట్ర అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచింది.

మూడేళ్ల అభివృద్ధి వ్యయం 78.1 శాతం..

రాష్ట్ర ఆర్థిక వృద్ధిని సూచిస్తూ, ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) 2022 -23లో రూ .13.27 లక్షల కోట్లు, ఇది 2021 -22 అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 15.6 శాతం పెరిగింది. 2018 –21 మధ్య రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధి వ్యయం యొక్క వాటా 78.1 శాతం, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలలో అత్యధికం, దీని సగటు అభివృద్ధి 68.4 శాతం వ్యయం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం (పిసిఐ) 2022 -23లో రూ .3.17 లక్షలు, ఇది రూ. జాతీయ తలసరి ఆదాయం రూ .1.71 లక్షల కంటే 1.46 లక్షలు ఎక్కువ. తెలంగాణలోని ప్రతి జిల్లా యొక్క పిసిఐ 2020 -21లో దేశ పిసిఐ రూ .1,26,855 కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో సగటు పౌరుడి ఆదాయం ఆరేళ్లలో రెట్టింపు కానున్నది. సామాజిక, ఆర్థిక సర్వేలో దృక్పథం ప్రకారం, సేవల రంగం రాష్ట్ర స్థూల విలువలో (జిఎస్‌విఎ) 62.8 శాతం వాటాను కలిగి ఉంది. పరిశ్రమల రంగం 19 శాతం, వ్యవసాయం, ఇతర రంగాలు 18.2 శాతం దక్కింది.

వినూత్న పద్ధతులను అవలంభించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధించింది. పారిశ్రామిక రంగం అనేక కొత్త పరిశ్రమల స్థాపనతో ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఇప్పటికే ఉన్న వాటి విస్తరణతో రాష్ట్రంలో విపరీతమైన వృద్ధిని సాధించింది. టిఎస్- ఐపాస్ విధానం కొత్త పరిశ్రమలకు రాష్ట్రంలో కార్యకలాపాలను ఏర్పాటు చేయడాన్ని సులభతరం చేసింది. 2021 -22తో పోల్చితే వృద్ధి పరంగా, ప్రస్తుత ధర స్థూల విలువ (జివిఎ) వ్యవసాయం, అనుబంధ రంగం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జనాభాలో 45.8 శాతం మంది ఈ రంగంలో ఉన్నారు, నూనె ఉత్పత్తుల దిగుబడిని సాధించేందుకు రాష్ట్రంలో అయిల్ ఫాం సాగు చేపట్టేందుకు ప్రత్యేక రాయితీలను కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నర్సరీలను ఏర్పాటు చేసి 2.67 కోట్ల మొక్కలు లక్షంగా గతేడాది లక్షం నిర్ధేశించుకున్నారు.

రైతులకు భరోసా కల్పించేందుకు రైతుబీమా, చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు చేనేత బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది. మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 7289.54 కోట్లతో మూడు దశల్లో 26065 పాఠశాలలను అభివృద్ధికి కార్యచరణ చేశారు. దీంతో 19.84 లక్షల విద్యార్థులకు మెరుగైన వసతులను సమకూర్చనున్నారు. ప్రతి బడ్జెట్‌లో 3497 కోట్లతో 9123 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు పథకంలో భాగంగా 1500 మందికి స్వయం ఉపాధి కల్పించనున్నారు. వివిధ వర్గాలకు సామాజిక భరోసా కల్పించేందుకు వీలుగా ఆసరా పథకంలో 44. 43 లక్షల మందికి పింఛన్‌ను అందిస్తున్నారు. కల్యాణలక్ష్మీ,షాదీముబారక్ పథకాల ద్వారా అన్ని వర్గాల్లోని పేదింటి యువతుల పెండ్లిలకు రూ.100116 నగదును అందిస్తున్నారు.

తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 270 కోట్ల మొక్కలు నాటారు. 117 శాతం లక్షాన్ని చేరారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 135 విభాగాల్లో నియామకాలను చేపట్టారు. దాదాపు 55144 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2023 జనవరి నెల వరకు 17134 పోస్టులను భర్తీ చేశారు. పరిపాలన సంస్కరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన 29 జిల్లా కేంద్రాల్లో సమీకృత పరిపాలన కార్యాలయాల భవనాలను ప్రారంభించారు. వెనుకబడిన తొమ్మిది జిల్లాలో న్యూటిషన్ ప్రోగాంతో పాటు ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలను పెంచేందుకు వీలుగా కెసిఆర్ కిట్ పథకంలో భాగంగా ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ప్రోత్సాహకంగా అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News