Monday, October 28, 2024

బౌద్ధ ధర్మంతోనే సామాజిక రుగ్మతలు దూరం: మంత్రి జూపల్లి కృష్ణారావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః సామాజిక రుగ్మతల నివారణకు గౌతమ బుద్ధుని బోధనలు ఒకటే శరణ్యమని, గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా మానవ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కఠిన చీవర దానోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను మంత్రి ఆదివారం సందర్శించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ఆయన ప్రారంభించారు. మహా బోధి దయక మండలి, మహా బోధి బుద్ధ విహార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కఠిన చీవర దానోత్సవంలో మంత్రి పాల్గొని, ప్రాచీన బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం వర్షావాసం ముగించిన బౌద్ధ భిక్షువులకు వస్త్రాలను దానం చేశారు.

అంతకుముందు మంత్రి జూపల్లిని బౌద్ధ భిక్షువులు ఆశీర్వదించారు. అనంతరం డా. శివనాగిరెడ్డి పాళీ భాష నుంచి తెలుగులోకి అనువదించిన బుద్ధ వంశం అనే గ్రంధాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. బుద్దిస్ట్ సాంస్కృతిక, వారసత్వ ఉత్సవాలు, త్రిపీటిక పఠన వేడుకలు, త్రిపీటికలను తెలుగులో అనువదించడానికి ఆర్థిక సహాయం చేయాలని మహాబోధి బుద్ధ విహార్ భిక్షువులు మంత్రిని కోరగా వెంటనే స్పందించిన ఆయన రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మహా బోధి సోసైటీ, లైట్ ఆఫ్ బుద్ధధర్మ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఇండియా సంయుక్తంగా బుద్ధిస్ట్ సాంస్కృతిక, వారసత్వ ఉత్సవాలు నిర్వహించనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు నాగర్జున సాగర్‌లోని బుద్ధవనం, హైదరాబాద్‌లోనూ జరిగే ఈ వేడుకలకు వివిధ దేశాల బౌద్ద భిక్షవులు హాజరుకానున్నారని తెలిపారు.

బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం

మంత్రి జూపల్లి మాట్లాడుతూ సమస్త జీవరాసుల పట్ల ప్రేమ, కరుణ, అహింస, శాంతి, సహనంతో ప్రకృతితో మమేకమై జీవించాలనే మహాబోధి గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. అనివార్య ప్రమాదాల నుండి ప్రపంచాన్ని రక్షించుకోవాలంటే బుద్ధుడు బోధించిన ప్రేమ, దయలతో కూడిన సందేశాన్ని అనుసరించడం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా మనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా విలసిల్లిన నాటి బౌద్ధారామాలను పునరుజ్జీవింపచేస్తూ తెలంగాణ కేంద్రంగా బుద్ధుని బోధనలను ప్రపంచానికి అందించాలనే ధృఢ సంకల్పంతో, కార్యాచరణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం ముందుకుసాగుతుందని వెల్లడించారు.

వీటితోపాటు బౌద్ధ సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు అంకితమైన మహాబోధి బుద్ధ విహార లాంటి సంస్థలకు ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తూనే ఉందని, బుద్ధ విహార్ ధ్యాన మందిర నిర్మాణానికి ముఖ్యమంత్రి రూ.2.17 కోట్ల నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ భిక్షువు హిత్తిక భంటేజీ, మహాబోధి సోసైటీ జనరల్ సెక్రటరీ ఆనంద్ భంటేజీ, మహాబోధి బుద్ధ విహార్ డైరెక్టర్ బుద్ధపాల భంటేజీ, బెంగళూర్ ఎంబీఎస్ సెక్రటరీ సుగతనంద భంటేజీ, మహాబోధి రీసెర్చ్ సెంటర్ (బెంగళూర్) డైరెక్టర్ బుద్ధదత్త భంటేజీ, మహాబోధి బుద్ధ విహార్ చీఫ్ పాట్రన్ అంజనేయరెడ్డి, డా.శివనాగిరెడ్డి, బౌద్ధ ఉపాసిక, ఉపాసికలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News