Wednesday, January 22, 2025

సామాజిక ఆవిష్కరణలు అవశ్యం

- Advertisement -
- Advertisement -

‘Social innovation refers to the design and implementa tion of new solutions that imply conce ptual, process, product, or organisational change, which ultimately aim to improve the welfare and wellbeing of individuals and communities’ –OECD (The Organization for Economic Cooperation and Development)

దోపిడీ, విద్వేషం, నేరాలు, హింస, ప్రకృతి విధ్వంసం, ఉగ్రవాదం, ప్రాణాంతక రుగ్మతలు, అకృత్యాలు నానాటికీ ప్రబలుతున్న ఈ ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా ఉత్తమ ప్రదేశంగా మార్చలేమా? మార్చగలిగితే, ఆ మార్పు దేని ద్వారా సాధ్యం? ఏది ఈమార్పుకు సరియైన విధానం? ఇదే ఇప్పుడు మనందరి ముందున్న పెద్ద ప్రశ్న. ఇదే విషయమై ఒకప్పుడు సువెర్నో సుజుకి ఇప్పుడు గ్రెటా థంబర్గ్ లాంటి చిన్నారులు కూడా పెద్దల సమాజాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులుగా విద్యావరణంలో మనం నిర్వహించవలసిన పాత్ర ఏమిటి? అనేది కూడా టీచర్లు తమకు తాము సంధించుకోవాల్సిన ప్రశ్న. ఇదే అంశంలో మార్నింగ్ వాక్‌లో యోచనాపరుల మధ్య వాగ్వాదం కూడా చూస్తుంటాం. అయితే ప్రశ్న ఏదైనప్పటికీ అది మొదట మనుషుల అవగాహన లేదా గ్రాహ్యత (Perception) పరిధిలోని ఏ విభాగానికి సంబంధించిందో మనం స్పష్టతకు రావాలి. లేదంటే ప్రశ్నలకు తగిన సమాధానం దొరకదు గాక దొరకదు.
మానవాళి గ్రాహ్యత రెండు రకాలు అంటారు సైకాలజిస్టులు. అవి 1. స్వీయ గ్రాహ్యత (Self perception), 2. సామాజిక గ్రాహ్యత (Socail perception). వ్యక్తి సొంతానిది కాకుండా బయటి విషయానికి సంబంధించిన ప్రశ్న ఏదైనా సామాజిక గ్రాహ్యతకు సంబంధించినదే. సామాజిక గ్రాహ్యత మూలంగానే సామాజిక స్పృహ, సామాజిక సామర్థ్యం, సామాజిక విజయాలు వ్యక్తులను వరిస్తాయి. సామాజిక గ్రాహ్యత నుండే సామాజిక ఆవిష్కరణ (Socail innovation) కూడా మొదలవుతుంది. ప్రపంచాన్ని మెరుగైన ప్రపంచంగా మార్చడమెట్లా అనే ప్రశ్నకు సామాజిక ఆవిష్కరణ ద్వారానే మాత్రమే పరిష్కారం సాధ్యం. సామాజిక ఆవిష్కరణ వనరులు, సాంకేతికతలకు సంబంధించినది ఎంతమాత్రం కాదు. పౌరులుగా, ప్రభుత్వాలుగా మనం సమ్మిళితంగా పని చేయాల్సిన విధానానికి సంబంధించింది.

ప్రపంచాన్ని మరింత న్యాయమైన, స్థిరమైన సమానమైన ప్రదేశంగా మార్చడానికి ప్రత్యేకమైన దార్శనికత అంతర్ దృష్టిని కలిగిన క్రియాశీల మేధో సమూహాలతోనే ఏ మార్పు అయినా సిద్ధిస్తుంది. క్రియాశీల మేధో సమూహాలనే సామాజిక ఆవిష్కర్తలు అంటారు. ‘పవర్ ఆఫ్ సోషల్ ఇన్నొవేషన్’ గ్రంథకర్త స్టీఫెన్ గోల్ స్మిత్ భావిస్తున్నట్టు సామాజిక ఆవిష్కర్తలు ప్రజల నిజమైన పురోగతికి ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోగలరు. జరగవలసిన మంచి కోసం వ్యవస్థీకృత బలాన్ని పెంపొందించగలరు. పౌర నాయకులుగా మూర్తిమత్వంతో వ్యవహరిస్తూ సమాన అవకాశాల తలుపులు మూసివేస్తున్న అడ్డంకులను అధిగమించేందుకు సృజనాత్మక మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషించి అమలులో పెట్టగలరు.
మానవ వికాసానికి వైజ్ఞానిక ఆవిష్కరణలు ఎంత అవసరమో, సామాజిక ఆవిష్కరణలు అంతే అవసరం. సామాజిక ఆవిష్కర్తలు ఎట్లా ఆవిర్భవిస్తారనేది కూడా ఇక్కడ కీలకమైన ప్రశ్నే. దీనికీ సమాధానం మన వద్దనే ఉంది. అదేమిటంటే, మనం దేన్ని ఇష్టపడతామో ఆ రంగానికి సంబంధించి విద్యార్జన చేయడం ద్వారా మన వైజ్ఞానికాన్వేషణ చేసుకోవచ్చును, ప్రజోపయోగ కార్యక్రమాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించడం ద్వారా సామాజిక ఆవిష్కర్తలుగా మారవచ్చుననేది అందరికీ తెలిసిన సత్యమే. దురదృష్టవశాత్తు మన వ్యవస్థలో చాలా మటుకు వ్యక్తులు స్వతహాగా తమకు మక్కువ ఉన్న రంగంలో పని చేయలేరు. దీనికి కారణాలు అనేకం. ముఖ్యంగా తమ రోజువారీ పనుల నుండి విముక్తి పొందడం, వారికి స్ఫూర్తినిచ్చే సృజనాత్మక వృత్తిలోకి ప్రవేశించడం కష్టంతో కూడుకున్న పనిగా ప్రజలు భావించడమే ఇందుకు ప్రధాన కారణం.

అయితే, జీవనోపాధిని వెతుక్కొని మమ్మల్ని మేం పోషించుకోవడానికే సరిపోతుంది. ఇంక ఆలోచనలకు ఆవిష్కరణలకు సమయం ఎక్కడిది? అనేది కూడా సామాన్య ప్రజల తరఫు వాదన. ఇదిట్లా ఉంచితే, సామాజిక ఆవిష్కరణ అనేది ప్రజా సంబంధ సమస్యలు మొదలుకొని పర్యావరణ సమస్యల దాకా ప్రాపంచిక సమస్యలన్నిటినీ పరిష్కరించే కార్యక్రమం అని, స్థానికంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న సేవా సంస్థలుగా, ఉత్పాదకతా సంస్థలుగా ఏర్పడి సమాజ హితం కోసం పని చేస్తూ ఇప్పటి దాకా కొనసాగుతున్న పద్ధతుల మీద కొత్తవైన సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేసి నిర్వహించే మహత్తర ప్రక్రియ అని విద్యార్థులకు మనం వివరంగా చెప్పాల్సి వుంది. ఈ ప్రక్రియ జాతీయ విధానాల నుండి వచ్చినా, చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల నుండి అంకురించినా,

ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర సంస్థల నుండి ప్రతిపాదించబడినా, పరిష్కారాలు గతం కంటే శక్తివంతంగా సామాజిక అవసరాలను తీర్చాలని సహకార మార్కెటింగ్ నిపుణురాలు డయానా పురంబోయూ అంటోంది. ఈవిడే ‘నేటి హైపర్ కనెక్టెడ్ ప్రపంచంలో ఒక దేశానికి సంబంధించిన సామాజిక సమస్యలు ఆ దేశానివే కాదు. అవి అందరివి. చాలా దేశాలు నెమ్మదిగా ఆర్థిక వృద్ధి భ్రమలో ఆర్థిక అస్థిరత, రాజకీయ గందరగోళం, ఆకలి, పేదరికం, ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొంటున్నాయి. ఇవన్నీ అందరి సామాజిక సమస్యలు. వీటిని అందరం సామాజిక అన్వేషణలో భాగస్వామ్యం కలిగి సామూహికంగా పరిష్కరించాల్సి వుంటుంది’ అని కూడా చెబుతుంది.
ఏ సమాజమైనా ఆర్థిక శ్రేయస్సు, సామాజిక శ్రేయస్సు రెండింటినీ కలిగి ఉన్నపుడే అది ఉత్తమ సమాజం కింద లెక్క. సాంప్రదాయికంగా ఆర్థికం ప్రాతిపదికన ఏదైనా అభివృద్ధి చెందిన దేశం జిడిపిని చూసినపుడు సంపన్నంగా ఉందనిపించవచ్చు. కాని, ఆ దేశంలో శాంతి, సమరసత, ఆనందం, పౌరస్వేచ్ఛ వర్ధిల్లినప్పుడే అక్కడ సామాజిక శ్రేయస్సు కూడా ఉన్నట్టు. సామాజిక శ్రేయస్సు కోణంలోనే సామాజిక ఆవిష్కరణ భావన పురుడు పోసుకుంది. ఈ భావనకు ఆద్యుడు బెంజిమన్ ఫ్రాంక్లిన్. ‘The Evolution of Social Innovation Building Resilience Through Transitions’ గ్రంథంలో సంపాదకులు Frances Westley, Katharine McGowan, Ola Tjornbo సామాజిక ఆవిష్కరణ మూలాలను ప్రస్తావిస్తూ ‘In truth, we are not the first to venture backwards to explore social innovation; Geoff Mulgan explicitly places the origin of social innovation in the industrial revolution.

As people moved into cities en masse, The evolution of social innovation the new human geography overwhelmed the traditional civil society and religious institutions that provided many basic services, and the need for social innovation was born’ అని అంటారు. దీని కొనసాగింపుగానే 1960లలో పీటర్ డ్రక్కర్, మైఖేల్ యంగ్ వంటి వ్యవస్థాపనా నిపుణులు కృషి సలిపారు. హెర్రెరో డి ఎగానా బి. ప్రకారం సామాజిక ఆవిష్కరణలు సంబంధిత సామాజిక సవాళ్లను (Relevant Social Challenges) ఎదుర్కోవాల్సిన అధునాతనమైన, సమర్థవంతమైన స్థిరమైన లేదా మునుపటి వాటి కంటే ఎక్కువ ప్రభావం చూపగల మార్గాలుగా ప్రజాదరణ పొందాయి.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అయితే ఏకంగా ప్రెసిడెంట్ ఒబామా 2009లో వైట్ హౌస్‌లో సోషల్ ఇన్నోవేషన్ అండ్ సివిక్ పార్టిసిపేషన్ కార్యాలయాన్ని స్థాపించారు. ఇది పబ్లిక్, ప్రైవేట్ వనరులను కలిపే ప్రాజెక్టులకు ‘సోషల్ ఇన్నొవేషన్ ఫండ్’ ద్వారా నిధులు సమకూరుస్తూ సామాజిక ఆవిష్కరణలకు మద్దతునిస్తుంది. డచ్ తత్వవేత్త హర్మాన్ డొయీరేడ్ పది రకాల సామాజిక ఆవిష్కర్తలను గుర్తిస్తూ ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించారు. న్యాయ సంబంధ, సాంస్కృతిక, రాజకీయ, సైద్ధాంతిక, నైతిక, ఆర్థిక, సంస్థాగత, సాంకేతిక, జీవావరణ, సామాజిక విశ్లేషణ రంగాల్లో సేవా సంస్థలు మరిన్ని నెలకొనాలని కాంక్షించారు. లండన్‌కు చెందిన ‘ఎల్లోబాల్’ వ్యవస్థాపకులు ఓవెన్ హాన్నుమ్ మన చుట్టూ ఉండే సామాజిక ఆవిష్కర్తలను’ ఛాలెంజర్స్, కొలాబరేటర్స్, ఐడియా జనరేటర్స్, వాలిడేటర్స్, సోషలైజర్స్, నెగ్లెక్టర్స్, ఇంక్విజిటర్స్ అని ఏడు రకాలుగా వర్ణించారు. ఈ ఏడుగురిలో మొదటి ఐదుగురు అనుకూలురుగానూ, చివరి ఇద్దరు ప్రతికూలురుగానూ సామాజిక ఆవిష్కరణలు జయప్రదం కావడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తోడ్పతారని ఓవెన్ చెబుతారు.
మన దేశంలో సామాజిక ఆవిష్కర్తల కృషిని గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నాను. మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ ఏ సి నీల్సన్ నివేదిక ప్రకారం, ‘శానిటరీ ప్రొటెక్షన్: ఎవ్రీ ఉమెన్స్ హెల్త్ రైట్’, భారత దేశంలోని 88 శాతం మంది మహిళలు తమ పీరియడ్స్ సమయంలో బూడిద, వార్తాపత్రిక, ఇసుక పొట్టు, ఎండిన ఆకులను ఉపయోగిస్తన్న పరిస్థితి. ఈ అపరిశుభ్రమైన పద్ధతుల ఫలితంగా 70 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు పునరుత్పత్తి మార్గపు అంటువ్యాధులతో బాధపడుతున్నారు, తత్సంబంధిత క్యాన్సర్ సంక్రమించే ప్రమాదాన్ని ఈ మొర టు విధానం మరింత పెంచుతోంది.

మహిళలకు సంబంధించిన ఈ పెను సమస్య నివారణార్థం భారతీయ సామాజిక వ్యవస్థాపకుడు డా. అరుణాచలం మురుగానందం దేశంలోని తక్కువ -ఆదాయ వర్గాల మహిళలకు ఆదాయాన్ని అందించడంతో పాటు అదే సమయంలో శానిటరీ టవల్‌లను కొనుగోలు చేసే స్థోమతను కల్పించడం ద్వారా వారికి గౌరవాన్ని అందించారు. ఇతను శానిటరీ టవల్స్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి తక్కువ-ధర యంత్రాన్ని సృష్టించాడు. ప్రస్తుతం, తన స్టార్టప్ కంపెనీ జయశ్రీ ఇండస్ట్రీస్ ద్వారా తయారు చేయబడిన 1300 లకు పైబడిన యంత్రాలు భారత దేశంలోని 28 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమర్చబడ్డాయి.
ఈయన బ్యాంకు రుణంతో పాటు లాభాపేక్ష లేని సంస్థల మద్దతు ద్వారా గ్రామీణ మహిళలకు నేరుగా తన తక్కువ ధర యంత్రాలను విక్రయిస్తాడు. ఒక మెషీన్ ఆపరేటర్ మొత్తం టవల్ తయారీ ప్రక్రియను మూడు గంటల్లో నేర్చుకోవచ్చు. ప్రాసెసింగ్‌తో కలుపుకొని పంపిణీలో సహాయం చేయడానికి మరో ముగ్గురిని నియమించుకొని శానిటరీ టవల్స్ తయారీలో ఉపాధి కల్పించ వచ్చు. ఇంతకూ విద్యార్థులకు ఉపాధ్యాయులుగా మనం నొక్కి చెప్పాల్సిన విషయమేమంటే ‘కొత్త ఆలోచన మీ దగ్గర ఉంటే, అది నాణ్యతను జీవిత పరిమాణాన్ని మెరుగుపరచ గల సామర్థ్యాన్ని కలిగి ఉంటే, మీలో ఓ గొప్ప సామాజిక ఆవిష్కర్త ఉన్నట్టేనని, రానున్న రోజుల్లో ప్రపంచ శ్రేయోదాత, క్రియాశీల ప్రజామేధావి మీరేనని.

2023 సంవత్సరానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో ష్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఇన్నోవేటర్స్ అవార్డులను గెలుచుకున్న ఐదుగురు భారతీయులు అనికేత్ దోగర్ -సహ వ్యవస్థాపకుడు, సిఇఒ హక్దర్శక్ ఎంపవర్‌మెంట్ సొల్యూషన్స్; కనికా పాల్- సంచాలకులు, యూనిలీవర్- సౌత్ ఏషియా సస్టైనబిలిటీ; ఖుష్బూ అవస్థి- డిజైనర్, పంజాబ్ ఎడ్యుకేషన్ కలెక్టివ్, కో- లీడర్స్ రుచా పాండే, సిమ్రాన్ ప్రీత్ ఒబెరాయ్ సామాజిక చింతనను ఆవిష్కరణలను పిల్లలకు గుర్తుచేద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News