Monday, December 23, 2024

రాష్ట్రంలో బీఎస్పీతోనే సామాజిక న్యాయం దక్కుతుంది : డా. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సమాజంలోని అన్ని పేద వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే బీఎస్పీతోనే సాధ్యమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పేద వర్గాలకు నిజమైన అభివృద్ధి ఫలాలు దక్కాలంటే రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రావాలని అన్నారు. కేంద్రంలో మోడీ దోపిడీ పాలన సాగిస్తూ, కార్పొరేట్ గద్దలకు దోచుపెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీకి బుద్ది చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జల్,జంగల్,జమీన్ కోసం ఆదివాసీలు ఉద్యమిస్తే అప్పటి నియంత పాలకులు అడవి బిడ్డలపై తుపాకీ గురిపెట్టి తూటాల వర్షం కురిపించిందన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి స్థూపం వద్ద మృతవీరులకు నివాళులు అర్పించి రైతులు,ఆదివాసీలు రైతు కూలీలపై ఎలాంటి హెచ్చరికలు చేయకుండా అప్పటి ప్రభుత్వం విచక్షణ రహితంగా దాడులు చేసి ఎంతో మంది ప్రాణాలను పొట్టన బెట్టుకుందని అన్నారు. దేశంలో మరో జలియన్ వాలా భాగ్‌ను తలపించేలా వందలాది మంది అమరులై,వేలాది మంది గాయాల పాలయ్యారని వివరించారు. ఆనాటి అమరవీరుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో రాజకీయంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులందరిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం సందర్శించి,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ బన్సీలాల్ రాథోడ్,నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్, ఖానాపూర్ అధ్యక్షులు కే. రాజేష్, మహిళా కన్వీనర్ కాంపల్లి సంతోషి,ఇంద్రవెల్లి బీఎస్పీ మండల అధ్యక్షులు పెందూర్ అంకుష్, మహిళ మండల అధ్యక్షురాలు సోన్ కాంబ్లే సుకేష్మా, ప్రధాన కార్యదర్శి దీపక్ కాంబ్లే, కార్యదర్శి మెస్రం మురళీ, ఖానాపూర్ నియోజకవర్గ కార్యదర్శి సొయం రాందాస్, నాయకులు సొన్ కాంబ్లే సునిల్, లాండ్గే సాయి కుమార్, సునీత, రాధబాయి, తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల స్ఫూర్తితో రాజ్యాధికారం సాధిద్దాం:
దేశంలో అణగారిన వర్గాలకు సామాజిక,సాంస్కృతిక దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు తమ జీవితాలను ధారపోసిన గొప్ప మహనీయుల స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్,మరాఠా సాహిత్య సామ్రాట్ అన్నభావు సాటే విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహనీయులని వారి త్యాగాలను స్మరించుకున్నారు. మహనీయుల ఆశయసాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. వారి అడుగుజాడల్లో యువత నడిస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News