Sunday, December 22, 2024

పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మొబైల్ ఫోన్‌తోనే ఎక్కువ సేపు గడుపుతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ పరిస్థితి మరీ తీవ్రమైంది. ఎప్పుడైనా సోషల్ మీడియా యాప్‌ల్లో అంతరాయం కలిగితే వినియోగదారులు ఎంతో గాబరా పడుతుంటారు. దీన్ని బట్టి సోషల్ మీడియా ప్రభావం మనుషులపై ఎంతగా ఉంటుందో చెప్పవచ్చు. అయితే ఈ వినియోగం పిల్లల జీవితంపై ఎక్కువ వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. పిల్లలు మానసిక కుంగుబాటుతో పాటు అనేక సమస్యలకు గురవుతున్నారు.

ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అశ్లీల దృశ్యాలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం పరిపాటి అవుతోంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేలా చట్టాన్ని తీసుకురాడానికి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం స్వాగతించాల్సిందే. నవంబర్ 18న ఆస్ట్రేలియా పార్లమెంట్ సమావేశంలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గురువారం (7112024)నాడు ప్రకటించారు.

ప్రజా ప్రతినిధులు ఆమోదించిన 12 నెలల తరువాత ఈ చట్టం అమలులోకి వస్తుందని చెప్పారు. తల్లిదండ్రుల సమ్మతి ఉన్న పిల్లలకు లేదా ఇప్పటికే అకౌంట్స్ ఉన్న పిల్లలకు కూడా ఇందులో మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలైన తరువాత ఎక్స్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు 16 ఏళ్ల లోపు పిల్లలను తమ సైట్ల నుంచి ఎలా మినహాయించాలో ఆలోచించాలని సూచించారు.

నిర్దేశించిన వయో పరిమితిని సోషల్ మీడియా సంస్థలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఈ జరిమానా వర్తించదు. చిన్నపిల్లలకు యాక్సెస్ నిరోధించే బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే. ఆ బాధ్యత తల్లిదండ్రులు లేదా యువతపై ఉండదు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, హెడ్ ఆఫ్ సేఫ్టీ యాంటిగోన్‌డేవిస్ ప్రభుత్వం నిర్ణయంచే వయో పరిమితులను తమ సంస్థ గౌరవిస్తుందని చెప్పారు. అయితే ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలన్న దానిపై లోతైన చర్చ అవసరమన్నారు. యాప్ స్టోర్‌లలో, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సమర్ధవంతమైన టూల్స్‌తో తల్లిదండ్రులు వారి పిల్లలు ఏ యాప్ వాడాలో నియంత్రించవచ్చని చెప్పారు.

ఇది చాలా సులభమైన, సమర్థవంతమైన పరిష్కారం అని అభిప్రాయపడ్డారు. గత ఏడాది 15 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని ఫ్రాన్స్ ప్రతిపాదించింది. కానీ వినియోగదారులు, తల్లిదండ్రుల సమ్మతితో నిషేధాన్ని దాటవేయగలిగారు. అమెరికాలో 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను యాక్సెస్ చేయాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరిగా ఉండాల్సిందే. 13 ఏళ్లకన్నా తక్కువ వయసు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలని చాలా సోషల్ మీడియా సంస్థలు విధానాలను ఏర్పర్చుకున్నాయి. బ్రిటన్ మీడియా రెగ్యులేటర్ ‘ఆఫ్‌కామ్’ 2022లో నిర్వహించిన అధ్యయనంలో బ్రిటన్ లోని 80% మంది పిల్లలు 12 ఏళ్ల వయసులోనే సోషల్ మీడియా అకౌంట్లు కలిగి ఉన్నారని బయటపడడం విశేషం. అమెరికా సర్జన్ జనరల్స్ ఆఫీస్‌కు చెందిన 2023 అడ్వైజరీ అధ్యయనంలో సోషల్ మీడియా నుంచి పిల్లలను నెల రోజుల కన్నా ఎక్కువ కాలం దూరంగా ఉంచితే వారికి మానసిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని స్పష్టమైంది.

ఇక మన దేశంలో లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సోషల్ మీడియాకు ఏ విధంగా నిమగ్నం అయిపోతున్నారో అధ్యయనం నిర్వహించింది. సోషల్ మీడియా ప్రభావం 9 ఏళ్ల నుంచి 17 ఏళ్ల పిల్లలపై ఎలా ఉంటుందో తెలుసుకోడానికి ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 31 వరకు 368 అర్బన్ జిల్లాల్లో 13,743 మంది తల్లిదండ్రులపై సర్వే చేయగా 70,000 స్పందనలు వచ్చాయి. 66 శాతం తల్లిదండ్రుల్లో 47% మంది తమ పిల్లలు ప్రతిరోజూ మూడు నాలుగు గంటలు, 10 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరు గంటలకు మించి సోషల్ మీడియాలోనే లీనమైపోతున్నారని వెల్లడించారు.

58% తల్లిదండ్రులు తమ పిల్లల్లో దూకుడుతనం కనిపిస్తోందని, 49% తల్లిదండ్రులు తమ పిల్లలు అసహనంగా ఉంటున్నారని, మరో 49% మంది తమ పిల్లలు నీరసంగా ఉంటున్నారని తెలిపారు. 42 శాతం మంది తమ పిల్లలు కుంగుబాటుకు గురవుతున్నారని, 30% మంది తమ పిల్లలు అన్ని విషయాల్లో అత్యుత్సాహం చూపిస్తుంటారని చెప్పారు. ఏదేమైనా పిల్లల మానసిక ప్రవర్తనపై, ఆరోగ్యంపై సోషల్ మీడియా అనేక విధాలుగా వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఆస్ట్రేలియాలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు ఎలా సాధ్యమవుతుందో మున్ముందు గమనించాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News