ఇరవై ఎనిమిది సంవత్సరాల యువతి పేరు నాగమణి హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం. ఒకే తల్లి రక్తం పంచుకొని, ఒకే తల్లి కడపులోనుంచి పుట్టిన సోదరుడు పరమేష్ నాగమణిని చాలా దారుణంగా హత్య చేశాడు. స్కూటర్‌పై డ్యూటీకి వెళ్తున్న నాగమణిని కారుతో వెనుక నుండి ఢీ కొట్టి, కింద పడిపోయిన తర్వాత గొడ్డలితో నరికి చంపిన ఘటన జరిగి వారం దాటలేదు. ఇది వినడానికి, చదవడానికి చాలా బాధగా ఉంది. జీవితం మీద ఎన్నో ఆశలతో, ఎన్నోన్నో కలలు కన్న ఓ యువతి హఠాత్తుగా సొంత సోదరుని చేతుల్లో హత్యకు గురికావడం ఆశ్చర్యమే. కాని ఇది నిజం.
సోదరిని హత్య చేసిన పరమేష్ కొద్ది నిమిషాల్లోనే పోలీసులకు లొంగిపోయాడు. “తమ కులంగానోన్ని పెళ్ళి చేసుకొని, ఊళ్ళో నా పరువు తీసింది. పది మందిలో ముఖం ఎత్తుకొని తిరగలేకపోతున్నాను. అందుకే చంపేశాను” అంటూ పోలీసులకు తన వాంగ్మూలంగా చెప్పాడు. నాగమణి తల్లిదండ్రులు చనిపోయారు. మిగిలింది ఒక్కడే తమ్ముడు. నాగమణి బి.సి కులానికి చెందిన యువతి. ఎస్‌సి మాల కులానికి చెందిన శ్రీకాంత్‌ను నవంబర్ 21న పెళ్ళి చేసుకుంది. నాగమణి, శ్రీకాంత్‌లు చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారని, నాగమణికి అన్ని విధాలా శ్రీకాంత్ తోడుగా ఉన్నాడని, ఇద్దరు ఇష్టపడే ఈ పెళ్ళి చేసుకున్నారని, గ్రామ యువకుడొకరు చెప్పారు.
అయితే ఈ పెళ్ళి నాగమణి బంధువులకు, తమ్ముడు శ్రీకాంత్‌కు ఇష్టం లేదు. అయినా నాగమణి, శ్రీకాంత్‌లు నవంబర్ 21న యాదగిరిగుట్టలో పెళ్ళి చేసుకున్నారు. నాగమణి, శ్రీకాంత్‌లు తమను పరమేష్ బెదిరిస్తున్నాడు, తమకు ప్రాణభయం ఉన్నదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి పరమేష్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళ మీద దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. అయితే ఇవేవి ఫలించలేదు. నాగమణి భయపడినట్టుగానే తమ్ముడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది.
తెలంగాణలో ఆడబిడ్డలను దేవుళ్ళ కన్న ఎక్కువగా చూసుకుంటారు. ఏ శుభకార్యం జరిగినా ఆడబిడ్డల అడుగులు లేకుండా, వాళ్ళ చేతులు తాకకుండా సాధ్యం కాదు. దసరా ముందు వచ్చే బతుకమ్మ పండుగ ఆడబిడ్డలను ఆరాధించే సందర్భం మాత్రమే. ఆడబిడ్డలు, అన్నదమ్ముల ప్రేమ, గౌరవాలు మీద ఎన్నో కథలు, మరెన్నో పాటలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అవేవీ పరమేష్ గుండెను తాకలేదు. ఈ ఘాతుకానికి పాల్పడకుండా ఆపలేకపోయాయి. ప్రేమ స్థానంలో విద్వేషం చేరడానికి కులం అనే విషమే కారణం. ఆ కుల కుటిలమే నాగమణి లాంటి ఓ ఆడబిడ్డ ప్రాణాలను బలి తీసుకున్నది.
అయితే ఈ సంఘటనలో చట్టప్రకారంగా పరమేష్ మాత్రమే నిందితుడు. నేరం కోర్టులో రుజువైన తర్వాత నేరస్థుడు. కానీ పరమేష్ ఒక్కడే ఈ సంఘటనకు బాధ్యుడు అనుకుంటే పొరపాటే. ఈ నేరం జరగడానికి ముఖ్యమైన బాధ్యత ఆ గ్రామానిది. గ్రామంలో ఇంకా బలంగా మనుగడ సాగిస్తున్న కులవ్యవస్థ.
బాబాసాహెబ్ అంబేడ్కర్ గ్రామ స్వరాజ్యం అనే గాంధీ చింతనను తిరస్కరిస్తూ అన్న మాటలు ఇక్కడ మనకు సరిగ్గా వర్తిస్తాయి. “గ్రామాలు కులతత్వానికి, అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, సంకుచితత్వానికి నరకకూపాలుగా ఉంటాయి” అంటూ గ్రామాలను, గ్రామాలలో ఉండే కుల వ్యవస్థను మన కళ్ళ ముందుంచారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ మాటలు ఆధునిక భారతంలో కూడా సజీవంగా సాక్షాత్కరిస్తున్నాయి. బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ గ్రామాలలో న్యాయస్థానాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే అక్కడ రాజ్యాంగాలు, చట్టాలు అమలు కావు. కేవలం కులవ్యవస్థ నిర్మించిన మనువాద సూత్రాలు రాజ్యమేలుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సరిగ్గా ఈ సంఘటనను కూడా ఈ కోణంలోనే చూడాలి. పరమేష్‌కు ఒక కులం ఉంది. ఆ కులం ఒక శక్తిగా ఆ గ్రామంలో ఉంటుంది. తన అక్క వేరే కులపోన్ని అది కూడా అంటరాని కులపోన్ని పెళ్ళి చేసుకుందంటే పరమేష్ కులం, కులం కుళ్ళును నింపుకున్న ఊరు కాకుల్లాగా పొడిసుంటుంది.
ఎక్కడికెళ్ళినా ఆ చూపులు వెంటాడి ఉంటాయి. వాటిని తట్టుకొని, అక్కకు అండగా నిలిచే బలం పరమేష్‌కు ఉండదు. అక్కను చంపి అపవాదును తుడిచేసుకుందామని భావించి ఉంటాడు. దాని కోసం బంధాలు, బాంధవ్యాలు అన్నింటినీ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. అక్కను చంపితే హత్య నేరం అవుతుందని తెలుసు. శిక్షపడి ఏండ్ల కొద్ది జైలులో ఉండాల్సి వస్తుందని తెలుసు. ఆ తర్వాత తన జీవితం ఏమవుతుందో కూడా ఆయనకు తెలియదు. కానీ చేశాడు. దానికి ఆయనకు ధైర్యాన్నిచ్చింది కులవ్యవస్థే. తన అక్క కన్నా తన పరువు, కులం పరువు ముఖ్యమని భావించాడు. అందుకే ఒకే తల్లి బిడ్డలమనే భావనను కూడా ఆయన మరిచిపోయాడు.
కుల వ్యవస్థ సృష్టించిన ఈ విషవలయం గత వందల ఏళ్లుగా ఎన్నో వేల మందిని బలి తీసుకుంది. ఇక్కడ మరొక సారి బాబాసాహెబ్ అంబేడ్కర్ కుల వ్యవస్థ పుట్టుక గురించి చేసిన పరిశోధన మనకు ఒక స్పష్టమైన అవగాహనను అందించగలదు. కుల వ్యవస్థ వృత్తుల సమాహారంగా భావిస్తుంటారు. కానీ దానిని బాబా సాహెబ్ అంబేడ్కర్ అంగీకరించలేదు. కుల వ్యవస్థ కంచెలతో ఏర్పడిన గుంపుల కలయిక. మొదటిగా తమ ప్రయోజనాల కోసం పూజారి వర్గమైన బ్రహ్మణ సమూహం తమకు తాముగా ఒక గుంపుగా మారి తమ చుట్టు కంచెను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇతర సమూహాలు దీనిని అనుకరిస్తూ అనుసరించాయి.
అందుకే ఈ దేశంలో కులం, ఒక జాతి, దేనికదే ఒక ప్రత్యేక తెగ. ఈ సమూహాల స్వచ్ఛత, ప్రత్యేకత కొనసాగాలంటే బలమైన కట్టుబాట్లు అవసరమవుతాయి. ఆ కట్టుబాట్ల సమాహారమే మనుధర్మం. కులాల మధ్య సంకరం జరగకుండా ఉండడానికి కొన్ని నిబంధనలు ఏర్పరచారు. ఒకవేళ తప్పిపోయి ఎక్కడైనా సంకరం జరిగితే, వారిని వెలివేతకు గురిచేసే నిబంధనలు పెట్టారు. అటువంటి వారిని చంఢాలునేగా, నిషాదులుగా రకరకాలు పేర్లతో పిలిచారు.
కుల వ్యవస్థ కొనసాగడానికి కులాంతర వివాహాలను నేరంగా పరిగణించారని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా కులాంతర వివాహాలు జరగకుండా చూడడానికి ప్రజల మెదళ్ళలో ఒక ఆలోచన మంత్రాన్ని బిగించారని అంబేడ్కర్ స్పష్టం చేశారు. అందుకే కుల వ్యవస్థ భౌతికమైన అంశం కన్నా మానసికమైన రుగ్మతగా అంబేడ్కర్ అభివర్ణించారు. ముఖ్యంగా కులాంతర వివాహాలు అంటరాని కులాలతో జరుగుతున్నప్పుడు దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది. హిందూ కులాల్లో ఎంత పేదలున్నప్పటికీ తమ కుల గౌరవం అనేది వాళ్ళకు చాలా ప్రతిష్టకరమైనది. కూటికి పేదోళ్ళం కావచ్చు. కానీ కులానికి పేదోళ్ళం కాదు” అని చాలా గర్వంగా చెప్పుకుంటారు.
హిందూ సమాజంలో అంటరాని కులాలు భాగం కాదని, వాళ్ళను మనుషులు కూడా చూడలేని, చూడకూడని ఒక దృక్పథాన్ని ప్రచారం చేశారు. భారత దేశం స్వాతంత్య్రం పొంది, ఒక అభ్యుదయకరమైన రాజ్యాంగాన్ని ఏర్పరుచుకున్న 75 ఏళ్ళ తర్వాత కూడా అంటరాని కులాలుగా ముద్రపడ్డ ఎస్‌సిలను సమాజం ఇంకా తమ మనుషులుగా భావించడం లేదు. దళితుల హత్యలు, అత్యాచారాలు, ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి కానీ ఏమాత్రం తగ్గడం లేదు. అదే విధంగా పరువు హత్యల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను కడతేర్చే సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దుర్మార్గం ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ , గుజరాత్ రాష్ట్రాల్లో చాలా అమానుషంగా పెరిగిపోతున్నది. హర్యానా లాంటి రాష్ట్రంలో కాప్ పంచాయితీల పేరుతో నట్టనడి బజారులో ఇటువంటి హత్యలు చేయడం సర్వసాధారణం. ఇందులో ఎస్‌సిలతో ఇతర కులాల అమ్మాయిల పెళ్ళిళ్ళు, ప్రేమలే ఎక్కువ. మిగతా కులాల మధ్య ఇంతటి విద్వేషం లేదు. ఇటీవల ఒక పరిశోధన ఈ విషయాలనే బయటపెట్టింది. భారత దేశంలోని సామాజిక చరిత్రను పరిశీలించిన అంబేడ్కర్ హిందూ మతంలోని కులాల మధ్య సంబంధాన్ని చాలా లోతుగా పరిశీలించారు.
చాతుర్వర్ణాలలో కొన్ని విభేదాలున్నప్పటికీ వాళ్ళు సర్దుకుపోతారని, కానీ అంటరాని కులాలుగా ముద్ర పడ్డ ఎస్‌సిల విషయంలో ఏ కులం కూడా సానుకూలంగా స్పందించదని, పైగా తీవ్ర ద్వేషంతో ఉంటారని చెబుతూ అంటరాని కులాలకు మిగతా సమాజానికి మధ్య ఉన్న ఇనుప కంచెను తేల్చిచెప్పారు. అయితే అంటరానితనం నిర్మూలనకు చట్టాలు ఎన్ని వచ్చినప్పుటికీ, రావాల్సిన పరివర్తన సమాజంలో రాకపోవడానికి, విద్వేషం ఇంకా కొనసాగడానికి కుల విద్వేషమే ప్రధాన కారణం. సరిగ్గా ఈ నేపథ్యం నుంచే నాగమణి హత్యను చూడాలి. అయితే దీనికి చట్టపరమైన చర్యలతో పాటు సమాజంలో మార్పురావడానికి సామాజిక పరివర్తన ఉద్యమం రావాలి.
అయితే సమాజంలోని ఇతర కులాల మేధావులు, ప్రజాస్వామికవాదులు ఇటువంటి విషయాలను పట్టించుకోవడం లేదు. నాగమణి హత్య పైన ఇప్పటి వరకు ఏ మహిళా సంఘం స్పందించిన దాఖలాలు లేవు. ఒకవేళ స్పందించినా అది పత్రికా ప్రకటనలకే పరిమిత కావడం విచారకరం. కుల విద్వేషం, కుల వివక్షలు, అంటరానితనం అంశాలపైన ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన బాధ్యతను నాగమణి హత్య మనకు గుర్తు చేస్తున్నది.
మల్లేపల్లి లక్ష్మయ్య
దర్పణం