Monday, December 23, 2024

యువశక్తితోనే సమాజోన్నతి!

- Advertisement -
- Advertisement -

Social upliftment with youthful energy

భారత దేశ జనాభా 140 కోట్లను తాకేందుకు పరుగెడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల రెండవ దేశంగా (17.7 శాతం) భారత్ నిలిచింది. చదరపు కిలోమీటర్‌కు దేశ జనసాంద్రత 500 ఉంది. సగటు ఆయుర్దాయం 70.4 ఏండ్లు, జనాభా పెరుగుదల శాతం 1.2గా నమోదు అవుతున్నది. జననాల రేటు ప్రతి వెయ్యి జనాభాకు 18.2, మరణాల రేటు 7.3 ఉంది. 750 కోట్ల ప్రపంచ జనాభాలో యువత (15 29 ఏండ్లు) 180 కోట్లు ఉండగా, ఇండియాలోనే 36.6 కోట్ల యువత ఉన్నారు.ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. యువ భారత్‌గా పిలువబడే ఇండియాలో 27 శాతం జనాభా 1529 మధ్య వయస్కులు ఉన్నారని అంచనా. 2020 అంచనాల ప్రకారం మన దేశంలో 35 ఏండ్ల లోపు జనాభా 65 శాతం ఉంది. అధిక జనాభాతో పాటు నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగం, ప్రజారోగ్యం, ఉద్యోగ కల్పన, ఆర్థిక కుదుపులు, అసమానతలు, వాతావరణ మార్పులు లాంటి అనేక సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న భారత్‌లో అత్యధిక యువశక్తి అద్భుత వరంలా మారింది. యువభారతం నడుం బిగిస్తే దేశం పలు సవాళ్ళను అధిగమిస్తూ ప్రగతి పథంలో వేగంగా నడుస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

ప్రభుత్వాలు, పౌర సమాజం యుక్తితో ప్రవర్తిస్తూ యువతను నైపుణ్య సంపద వైపు నడుపుతూ ఆదర్శ భారతాన్ని నిర్మించేందుకు సత్వరమే పూనుకోవాలి. దేశ యువత తమ కాళ్ల మీద తాము నిలబడడం, సాధికారత సాధిస్తూ వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడడాన్ని బట్టి దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. యువత సాధికారతలో ఆర్థిక, వస్తు సేవలు, ఆధ్యాత్మక, సాంఘిక, విద్య, వృత్తి రంగాలు ఉన్నాయని గుర్తించాలి. యువశక్తిని పరిపుష్టం చేయడానికి నవ యువతలో మానవీయ విలువలు, దృక్పధం, సాంకేతిక నైపుణ్యాలు, విలక్షణ వ్యక్తిత్వ వికాస శిక్షణలు అందించడం ముఖ్యమని గుర్తించాలి. యువత అభివృద్ధితో పాటు సాధికారత కూడా సఫలం అయితేనే దేశం సమగ్రాభివృద్ధి సాధిస్తుందనేది వాస్తవం.

ఆర్థికాభివృద్ధిలో అమెరికా, చైనా లాంటి అగ్ర దేశాలను అధిగమించ గల మానవ వనరులు మన భారత్ వద్ద పుష్కలంగా ఉన్నాయి. ఇండియాలో అధిక శ్రామిక దళాలు, నైపుణ్య యువత, మహిళా శక్తి వనరులు, ఉద్యోగ ఉపాధి వర్గాలు అధికంగా ఉన్నాయి. వీరందరి శక్తియుక్తులను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలిగితే దేశ ప్రగతి రథం వేగంగా అభివృద్ధి దిశగా దూసుకుపోగలుగుతుంది. దేశ యువత, పెద్దల జనాభా ఉద్యోగ ఉపాధుల్లో నిమగ్నమైన నాడు మాత్రమే దేశంలో పేదరికం తగ్గుతూ, అక్షరాస్యత పెరుగుతూ సమగ్రాభివృద్ధి దిశగా పయనించడం ఖాయంగా తోస్తున్నది. భారత్‌లోని ఆర్థికంగా వెనుకబడిన బీహార్, యుపి, యంపి, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు బలీయమైన యువశక్తిని సద్వినియోగం చేసుకొన్నపుడు మాత్రమే సర్వతోముఖాభివృద్ధి దిశగా దేశం సాగవచ్చని అభిప్రాయపడుతున్నారు. నేటి అపార యువశక్తిని సదాలోచనలతో వివిధ రంగాల అభివృద్ధిలో వాడుకోగలిగితే ప్రపంచ దేశాల్లో భారతం అగ్రభాగాన నిలుస్తుందనటంలో సందేహం లేదు. యువ జనాభా పెరిగితే అభివృద్ధి సాధ్యపడుతుందనడానికి కూడా ఆస్కారం లేదు.

వ్యక్తిత్వ వికాసం, శాస్త్రసాంకేతిక నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానాలు, ఉద్యోగ సాధన స్కిల్స్ అందిపుచ్చుకున్న యువతకు మాత్రమే అద్భుత అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇండియాలోని యువశక్తిని వైజ్ఞానిక, సాంకేతిక నైపుణ్య నిధిగా మార్చగలిగే ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలను ఇచ్చినపుడు దేశ దశ దిశలు సమూలంగా సకారాత్మకంగా మార్పు చెందుతాయని గమనించాలి. ప్రభుత్వ పథకాల రచన, అమలు విధానాలు సరైన ప్రణాళిక ప్రకారం జరిగితే భారతం భవ్యబాటల్లో వెలుగొందగలగడం ఖాయంగా తోస్తున్నది. యువ వనరులను సుశిక్షిత శక్తిగా మార్చడానికి కావలసిన భౌతిక మౌలిక వసతులు ప్రాధాన్యతాక్రమంలో నెలకొల్పాలి. ఉన్నత విద్య, సాంకేతిక నైపుణ్యాలను యువతలో పెంచిన నాడు ఔత్సాహిక వృత్తి వ్యాపారాలు అనేక రెట్లు పెరుగుతాయి. విద్యలో పెట్టుబడే దేశాభివృద్ధికి పునాది అని నమ్మి ప్రభుత్వాలు యువతకు సంబంధించిన పథక రచనలు చేయాలి.

విద్యావంతులు, నైపుణ్య యువతతోనే పారిశ్రామిక, వస్తు సేవలు ప్రగతిని రుచి చూస్తాయి. ఉద్యోగ కల్పన, ఔత్సాహిక యువతను వృత్తి ఉపాధి రంగాల్లో అభిరుచిని పెంచి పోషించాలి. యువతను సద్వినియోగం చేసుకున్న సమాజమే సమగ్రాభివృద్ధి దిశగా కదులుతుంది. కార్మిక శక్తికి నైపుణ్య యువనిధిని జోడిస్తే సమాజోన్నతి సత్వరమే జరుగుతుంది. మేధో సంపత్తి హక్కులు, కాంట్రాక్టుల్లో పారదర్శకత, అర్హతకు తగిన ఉద్యోగ ఉపాధులు, చట్టాల అమలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఆర్థిక సంస్కరణలు, దీర్ఘకాలిక సామాజిక అవసరాలు, పోషకాహారం, వైద్య సేవలు, ఉత్తమ పాఠశాల విద్య, నాణ్యమైన ఉన్నత విద్య, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పట్టాణాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినపుడే నేటితరం చురుకుగా సన్మార్గంలో ఎదుగుతుంది.

యువశక్తిని నిర్లక్ష్యం చేసినపుడు నిరుద్యోగం, అండర్ ఎంప్లాయిమెంట్ (అర్హత కన్న తక్కువ ఉద్యోగం) అనేక రెట్లు పెరుగుతాయి. ఇలా జరిగితే యువతలో అశాంతి, హింసాత్మక ధోరిణి నెలకొంటాయి. కరోనా విజృంభణతో దాదాపు 300 మిలియన్ల యువత ఉద్యోగ, ఉపాధులు కోల్పోయి దిక్కుతోచని దుస్థితిలో నేటికీ మగ్గుతున్నారు. యువశక్తి నిర్వీర్యం అయినపుడు దేశ ప్రగతి మందగిస్తుంది. ఇండియాలో దాగి వున్న యువశక్తికి సరిసమానంగా మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు అందుబాటులో లేవని మనకు అర్థం అవుతున్నది. మహిళా శక్తిని వినియోగించుకోవడంలో ప్రపంచంలోనే భారత్ చాల వెనుకబడి ఉందని అంగీకరించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళాశక్తి గరిష్ఠంగా ఉపయోగపడుతున్నది.

ఆయా దేశాల్లో మహిళలకు సంబంధించిన ప్రసవ సెలవులు, పిల్లల సంరక్షణలో సహాయం, పని వేళల్లో మార్పులు లాంటి పథకాలు/ చట్టాలు సమర్థవంతంగా అమలు చేయబడుతున్నాయి. ఆధునిక సమాజ అవసరాలకు అనువైన రంగాల్లో యువతకు సాంకేతిక శిక్షణలు ఇవ్వాలి. కరోనా అలలతో తల్లడిల్లుతున్న భారతదేశంలో వైద్య అత్యవసర దుస్థితి ఏర్పడడం చూశాం. మనదైన ప్రత్యేక అపార యువ సంపదను దేశాభివృద్ధికి సక్రమంగా వినియోగించుటలో భారత్ సఫలం కావాలని కోరుకుందాం. యువ భారతాన్ని సంపన్న హిందుస్థాన్‌గా మార్చే దిశలో మనందరం కృషి చేద్దాం. యువశక్తిని ఒడిసి పడదాం, భరత మాతకు పట్టాభిషేకం చేద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News